Homeతెలంగాణతాగునీటికే ప్రాధాన్యం

తాగునీటికే ప్రాధాన్యం

- Advertisement -
  • ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొంటాం – పంటల రక్షణకు విడతలవారీ నీరు విడుదల
  • తుమ్మిడిహట్టి పనులు చేపడతాం
  • కృష్ణా జలాల హక్కుల కోసం పోరాటం ఉధృతం: మంత్రి ఉత్తమ్

విశాలాంధ్ర – హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శాసనసభలో శుక్రవారం ఎల్‌నినోపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ కృష్ణా, గోదావరి జలాశయాల్లో అశించిన మేర నీటి లభ్యత లేకపోవడంతో సాగునీటి కంటే తాగునీటికే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. మరోవైపు పంటలను రక్షించేందుకు అందుబాటులో ఉన్న నీటిని విడతల వారీగా విడుదల చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. పంటమార్పడితో పాటు ఆరుతడి పంటల వైపు మొగ్గుచూపాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. మేడిగడ్డ, సుంకేశుల, అన్నారంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, జాతీయ విపత్తు సంస్థలతో పాటు అంతర్జాతీయ సంస్థలు సైతం డ్యాం నిర్మాణాన్ని తప్ప పట్టారని చెప్పారు. ఉత్తర తెలంగాణకు నష్టం చేసింది ముమ్మాటికీ బీఆర్‌ఎస్ చేసిన తప్పిదాలే అని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులకు మరమ్మత్తులు చేపట్టడంతో పాటు ఎన్నికల హామీ ప్రకారం తుమ్మిడిహట్టి వద్ద పనులు కూడా చేపడతామని చెప్పారు. కాళేశ్వరానికి రూ.లక్ష కోట్లు, పాలమూరు రంగారెడ్డి పథకానికి రూ.27 వేల కోట్లు, సీతారామ ప్రాజెక్టుకు రూ.8500 కోట్లు ఖర్చు చేసి వారు ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని ఆరోపించారు. అదే సమయంలో దేవాదుల, ఎస్‌ఎల్‌బీసీ, కల్వకుర్తి, కోయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. కృష్ణా జలాల హక్కులపై తమ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం కోర్టులో తెలంగాణ నీటిహక్కుల సాధన కోసం పోరాటం ఉధృతం చేస్తుందన్నారు. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ హక్కుల కోసం పట్టుబడుతున్నామని చెప్పారు. గత ఏడాది ఇదే సమయానికి కృష్ణా నదిలో 361 టీఎంసీలకు 333 టీఎంసీలు ఉండగా ఈ ఏడాది 120 టీఎంసీలు ఉన్నాయని, గోదావరి జలాశయాల్లో 224 టీఎంసీలకు 164 టీఎంసీలు ఉండగా ఈ ఏడాది 141 టీఎంసీలు ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వర్షాలు లేక రాష్ట్ర వ్యాప్తంగా 44,034 చెరువుల్లో 40 శాతం సామర్థ్యం కన్నా తక్కువగా నీళ్లు ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో తాగునీటికే అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుందని స్పష్టం చేశారు. భగీరథ, మున్సిపల్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రైతులకు సాగునీరు అందించడంతో పాటు తాగునీటిని అందించేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతుందన్నారు. కృష్ణా జలాల్లో 66:34 తాత్కాలిక నిష్పత్తిని శాశ్వత హక్కుగా అంగీకరించలేదని, 50:50 పంపిణీ కోసం తెలంగాణ పట్టుబట్టిందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు