Homeతెలంగాణరైతు సంక్షేమమే ధ్యేయం

రైతు సంక్షేమమే ధ్యేయం

- Advertisement -

మద్దతు ధరకే పంటల కొనుగోళ్లు
సదర్మాట్‌ బ్యారేజీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌

విశాలాంధ్ర బ్యూరో-నిర్మల్‌/ఆదిలాబాద్‌: రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, రైతుబంధు, రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాలతో పాటు, పంట ఉత్పత్తులను కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్‌ జిల్లాలోని మామడ మండలం పొన్కల్‌ గ్రామంలో నిర్మించిన సదర్మాట్‌ బ్యారేజీని, ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం హత్తి ఘాట్‌ వద్ద నిర్మించిన చనాక-కోరాట ఎత్తిపోతల పథకాన్ని శుక్రవారం సీఎం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ సదర్మాట్‌ బ్యారేజీ ద్వారా వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని తెలిపారు. 2016, అక్టోబరులో ప్రారంభమైన ఈ ప్రాజెక్టును రూ.676.592 కోట్లతో నిర్మించినట్టు చెప్పారు. ఇందుకోసం 1,176 ఎకరాల భూమిని సేకరించారని పేర్కొన్నారు. ఈ బ్యారేజీ ద్వారా నిర్మల్‌ జిల్లా కడెం, ఖానాపూర్‌ మండలాల్లో 12 వేల ఎకరాలు, జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌ ప్రాంతాల్లో ఐదు వేల ఎకరాలు … మొత్తం 18,016 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని వివరించారు.34 గ్రామాల వ్యవసాయ భూములకు సాగునీరు అందనుందని చెప్పారు. పాత సదర్మాట్‌, గంగానాలా ఆయకట్టు స్థిరీకరణకు 1.58 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నీటిని సాగు అవసరాలకు అనుగుణంగా విడుదల చేస్తామని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్‌, జిల్లా కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, ఎస్‌పీ జానకి షర్మిల, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌ రెడ్డి, శాసనసభ్యులు పాయల్‌ శంకర్‌, ఎంపీ జి. నగేశ్‌, కలెక్టర్‌ రాజర్షి షా, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు