Homeబనకచర్ల… నీటి వివాదాలపై నిపుణుల కమిటీ

బనకచర్ల… నీటి వివాదాలపై నిపుణుల కమిటీ

- Advertisement -

. అమరావతిలో కేఆర్‌ఎంబీ, హైదరాబాద్‌లో జీఆర్‌ఎంబీ కార్యాలయాలు
. రిజర్వాయర్ల నుంచి నీటి వినియోగంపై టెలీ మీటర్లు
. తెలుగు రాష్ట్రాల సీఎంల చర్చలు సానుకూలం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : బనకచర్ల ప్రాజెక్టుతో సహా కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దిల్లీలో బుధవారం జరిగిన ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో సానుకూల వాతావరణంలో చర్చలు సాగాయి. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాల అంశాలపై చర్చించేందుకు దిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ ఆధ్వర్యంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈసందర్భంగా సీఆర్‌ పాటిల్‌తో పాటు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి పరస్పరం కరచాలనం చేసుకున్నారు. దుశ్శాలువలు, మెమెంటోలతో ఒకరికొకరు గౌరవ ప్రదంగా సత్కరించుకున్నారు. ఈ భేటీకి ముఖ్యమంత్రులతో పాటు ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇరు రాష్ట్రాల సీఎస్‌లు, జలవనరుల శాఖ కార్యదర్శులు, ఇంజినీర్లు హాజరయ్యారు. తొలుత ఈ భేటీలో లేవనెత్తాల్సిన అంశాలు, సాంకేతికంగా ఇవ్వాల్సిన సమాధానాలపై సీఎంలు ఇద్దరూ తమ అధికారిక నివాసాల్లో సుమారు గంటన్నరపాటు సీఎస్‌లు, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు అనుసంధానంపై ఏపీ ప్రభుత్వం సింగిల్‌ పాయింట్‌ అజెండాను ప్రతిపాదించగా, తెలంగాణ ప్రభుత్వం మొత్తం 13 అంశాలను ఈ సమావేశంలో ప్రతిపాదించింది. బనకచర్లకు ప్రాజెక్టుకు సంబంధించి అనేక సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నందున, ఇరు రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఒక ప్రత్యేక కమిటీ వేయాలని నిర్ణయించారు. ఈ కమిటీలో సాంకేతిక నిపుణులు, అడ్మినిస్ట్రేటివ్‌ అధికారులు ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన వారు ఉంటారు. ఈ కమిటీ సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది. కాలయాపన లేకుండా వచ్చే సోమవారం లోపునే కమిటీ నియామకం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో బనకచర్లపై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చ జరగలేదు. అయితే బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని, మిగులు జలాలను సద్వినియోగం చేసుకోవడానికి, కరువు సీమకు శాశ్వత పరిష్కారం కల్పించడానికి మాత్రమే ఈ ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యమని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక రూపంలో విన్నవించింది. ఈ సందర్భంగా గోదావరిలో వందేళ్ల సరాసరి ప్రవాహాల గణాంకాలను నివేదికంలో పేర్కొంది. ఏటా 3వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని తెలిపింది. బనకచర్ల ద్వారా గరిష్ఠంగా 200 టీఎంసీలే తరలిస్తామని వివరించింది. ఈ ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం ఉండదని, 11 ఏళ్లుగా తెలంగాణలో కట్టిన ఏ ప్రాజెక్టుకూ అభ్యంతరం చెప్పలేదని పేర్కొంది. దిగువ రాష్ట్రంగా ఏపీ ఇబ్బందులను, సీమ నీటి సమస్యలను తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరింది. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని రిజర్వాయర్ల నుంచి కాలువలకు వెళ్లే అవుట్‌ ఫ్లో కు సంబంధించి టెలిమీటర్లు ఏర్పాటు చేయాలనే నిర్ణయంపై ఇరు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. తెలుగు జాతి సంపద అయిన శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలు కలసి కాపాడుకోవాలని, ఈ ప్రాజెక్టు మరమ్మతుల విషయంలోనూ, ప్లంజ్‌ పూల్‌ రక్షణ విషయంలోనూ సిడబ్ల్యూసి సిఫార్సులు, నిపుణుల సూచనలు సత్వరమే పాటించి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయి. ఇక మరో ప్రధాన అంశమైన కృష్ణా రివర్‌ మేనేజ్మెంట్‌ బోర్డ్‌ (కేఆర్‌ఎంబీ) అమరావతి లోను, గోదావరి రివర్‌ మేనేజ్మెంట్‌ బోర్డ్‌(జీఆర్‌ఎంబీ) హైదరాబాదులో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన 13 అంశాలు
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిరడి ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వాలని, శ్రీశైలం నుంచి వేరే బేసిన్‌కి ఆంధ్రప్రదేశ్‌ నీటి తరలింపు పనులను వెంటనే ఆపేయాలని, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రారంభించిన ప్రాజెక్టులకు సహకరించేలా కృష్ణా ట్రైబ్యునల్‌లో మద్దతుగా వాదించేలా ఏపీని ఒప్పించాలని, కృష్ణానదీ జలాలను వేరే బేసిన్‌కు తరలించకుండా కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు చర్యలు తీసుకునేలా ఆదేశించాలని, కృష్ణా జలాలను అక్రమ తరలింపును అడ్డుకునేందుకు టెలిమెట్రీలను ఏర్పాటు చేసేందుకు ఏపీ అంగీకరించాలని తెలంగాణ కోరింది. అలాగే తుంగభద్ర బోర్డు నీటి తరలింపుపై చర్చించాలని, రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకంపై ఎన్జీటీ ఉత్తర్వులను అమలు చేసే విధంగా కేంద్ర జలశక్తి శాఖ చర్యలు తీసుకుని, ఈ పథకంపై చట్టపరంగానే ముందుకు వెళ్లాలని సూచించింది. శ్రీశైలం కుడి కాలువ ద్వారా ఎక్కువగా నీటి తరలింపును నియంత్రించాలని, శ్రీశైలం ప్రాజెక్టులో కొత్త ప్రాజెక్టులు హంద్రీనీవా, వెలిగొండ, గురు రాఘవేంద్ర నిర్మాణాలను ఆపాలని, నీటి తరలింపు ద్వారా విద్యుత్‌ ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలుగుతున్నందున దీనిని అడ్డుకోవాలని కోరింది. పోలవరం ప్రాజెక్టు తరహాలోనే ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని, ఇచ్చంపల్లి నుంచి కావేరికి గోదావరి జలాల తరలింపుకు మేము సిద్ధమని, అందులో 200 టీఎంసీల నీటిని వాడుకునేందుకు, సమ్మక్క సాగర్‌ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని తెలంగాణ విజ్ఞప్తి చేసింది. అదేవిధంగా ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టుకు ఏఐబీపీ కింద నిధులు ఇవ్వాలని, మహారాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వమే చర్చలు జరిపి తుమ్మిడి హట్టి వద్ద బ్యారేజ్‌ నిర్మాణానికి సహకరించాలని కోరింది. మొత్తానికి రాష్ట్రాలు వేరైనా, పార్టీలు వేరైనా తెలుగుజాతి ఒకటేనన్న స్నేహపూర్వక వాతావరణంలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల ఢల్లీి సమావేశం జరగటం గొప్ప శుభ పరిణామంగా జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. సమావేశం వివరాలను ఆయన మీడియాకు వివరించారు.
కేసీఆర్‌ తప్పులను సరిచేస్తున్నాం : సీఎం రేవంత్‌ రెడ్డి
తెలంగాణ హక్కులను కేసీఆర్‌ గతంలో ఏపీకి ధారాదత్తం చేయడంతో, ఆయన చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. పెండిరగ్‌ సమస్యల పరిష్కారం కోసమే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర ప్రభుత్వం సమావేశం నిర్వహించిందని వెల్లడిరచారు. ఈ భేటీలో కేంద్ర ప్రభుత్వం కేవలం నిర్వాహక పాత్రే పోషించిందని, కేంద్రం ఎవరివైపూ మాట్లాడలేదని తెలిపారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తిశాఖ నిర్వహించిన సమావేశం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ భేటీలో ఏపీ ప్రభుత్వం నుంచి గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు కడతామన్న ప్రతిపాదన చర్చకు రాలేదని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అజెండాలో వారు కడతామనే ప్రతిపాదనే చర్చకు రానప్పుడు ఆపాలన్న చర్చే ఉండదన్నారు. ఇది అపెక్స్‌ కమిటీ భేటీ కాదని చెప్పారు. అనుమానించుకుంటూ పోతే ముందుకు సాగలేం. సమస్యలను పరిష్కరించుకునేందుకే ఉన్నాం.. గొడవలు పెట్టుకునేందుకు కాదు. ఇరు రాష్ట్రాలు గొడవలు పెట్టుకోవాలని కొందరు చూస్తున్నారు. వివాదాలు లేకుండా సమస్యలను పరిష్కరించుకోవడమే మా అజెండా అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు