. ఐక్య పోరాటాలతోనే హక్కుల సాధన
. ప్రపంచంలోనే అతిపెద్దది ఎర్రజెండా పార్టీ: కూనంనేని, చాడ
విశాలాంధ్ర బ్యూరో -పెద్దపల్లి: పేదల పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అని… ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎర్రజెండ పార్టీ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. పెద్దపల్లి ఎన్ఎస్ భవన్లో గురువారం సీపీఐ నాల్గవ మహాసభలు ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ మాజీ జిల్లా కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్ పతాకావిష్కరణ చేశారు. వెంకట్ రెడ్డి అమరుల స్తూపానికి నివాళులర్పించారు. ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మార్కపురి సూర్య, రేణిగుంట్ల ప్రీతం అధ్యక్షతన జరిగిన మహాసభలో సంతాప తీర్మానంతో పాటు సీపీఐ జిల్లా రాజకీయ రిపోర్టును పార్టీ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం ప్రవేశపెట్టారు. అనంతరం కూనంనేని, వెంకటరెడ్డి మాట్లాడుతూ సీపీఐ… వందేళ్ల పోరాట చరిత్ర కలిగిందన్నారు. సీపీఐ అనుబంధ సంఘాలు, కార్యకర్తలు, నాయకులు పార్టీ పటిష్టతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో కార్మిక చట్టాలు సీపీఐ పోరాటాల ద్వారానే ఏర్పడ్డాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికులపై ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన అనేక ఉద్యమాల్లో అనేకమంది సీపీఐ నాయకులు అమరులయ్యారన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు భూములు పంచిపెట్టడం జరిగిందని తెలిపారు. ఎర్రజెండా కింద ఉన్న అన్ని పార్టీలు ఏకమై ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. విద్య, ప్రభుత్వ రంగ కార్మికుల హక్కులు, మహిళల సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేసినట్టు చెప్పారు. ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని సుప్రీంకోర్ట్ సుమోటోగా స్వీకరించాలన్నారు. మావోయిస్టులపై సాగిస్తున్న మారణకాండ నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. కమ్యూనిస్టులు ఒకే తాటిపై వచ్చి, కార్మికుల, కర్షకుల హక్కులను కాపాడాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం… ఆర్ఎస్ఎస్, సంఫ్‌ు పరివార్ అజెండాను దేశంలో అమలు చేస్తోందని మండిపడ్డారు. దాన్ని తిప్పి కొడతామని హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ… పెద్దపెల్లి జిల్లాలో సింగరేణి కార్మికులు పోరాటాల ద్వారా నే తమ హక్కులు సాధించుకున్నారని తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవైన శంకర్ మాట్లాడుతూ… పెద్దపెల్లి జిల్లాలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


