ప్రైవేట్ లోన్ సంస్థలపై నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం, ఆర్బీఐ జవాబుదారీగా1 వ్యవహరించాలి..
ఏఐవైఎఫ్, ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ నాయకుల డిమాండ్
విశాలాంధ్ర అనంతపురం : అనంతపురంలో వెలుగుచూసిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు గోల్డ్ లోన్ స్కాంలో కీలకంగా ఉన్న కీర్తన ఫైనాన్స్ మేనేజ్మెంట్పై తక్షణమే విచారణ జరిపించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి జి. సంతోష్ కుమార్, ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మావతమ్మ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సీపీఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ అయిన కీర్తన ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టిన బంగారం నిజంగా ఖాతాదారుల పేర్లతో ఉందా? లేకపోతే మోసపూరితంగా హస్తాంతరమయ్యిందా? అనే అంశాలపై స్వతంత్ర బృందం ద్వారా విచారణ జరిపించాలని, వారు స్పష్టంగా పేర్కొన్నారు. కీర్తన ఫైనాన్స్ పై ప్రత్యేక కలెక్టర్ బృందం ఏర్పాటు చేసి,తాకట్టు బంగారం ఖాతాదారుల పేర్లతో ఉందా?,బ్యాంకులో నుండి బంగారం దొంగలించబడిందా?
అనే అంశాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. .ఈ స్కాంను ఆధారంగా చేసుకుని పుట్టగొడుగుల్లా వ్యాపిస్తున్న ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలపై రాష్ట్రవ్యాప్తంగా ఆడిట్ చేయాలన్నారు. ఆర్ బి ఐ గైడ్‌లైన్స్ ప్రకారం ఈ సంస్థలు నిర్వహితమవుతున్నాయా లేదా అన్నది స్పష్టతకు రావాలన్నారు. ఇటువంటి సంస్థలకు లైసెన్స్ ఇచ్చే విధానం, పర్యవేక్షణలో ఉన్న లోపాలను ప్రజల ముందు బహిర్గతం చేయాలని ప్రజల్లో అప్రమత్తత కలిగించేలా ప్రభుత్వమే బహిరంగ విచారణ చేపట్టాలన్నారు.
ఈ స్కాంలో బాధితుల నష్టాలను తక్షణమే గుర్తించి పరిహారం చెల్లించాలని, వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ సంస్ధలపై ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసం సిపిఐ ఏఐవైఎఫ్ ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ, బహిరంగ ఉద్యమానికి సిద్ధంగా ఉన్నాయని వారు తెలిపారు ఇందులో భాగంగా ఏపీ మహిళా సమాఖ్య (ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యు ) అఖిలభారతి యువజన సమాఖ్య ( ఏ ఐ వై ఎఫ్ ) ఆధ్వర్యంలో కీర్తన ఫైనాన్స్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్ఐ డబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు పార్వతి ప్రసాద్, ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ధనుంజయ, ఉపాధ్యక్షులు దేవేంద్ర, శ్రీనివాసులు, మహిళా సమాఖ్య జిల్లా నాయకులు యశోదమ్మ, కమ్మక్క, తదితరులు పాల్గొన్నారు..


