ఎన్నికల హామీల భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రారంభం
విశాలాంధ్ర పుట్టపర్తి:-టిడిపి తోనే మహిళలకు ప్రత్యేక గుర్తింపుని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన స్త్రీ శక్తి పథకాన్ని జిల్లా కలెక్టర్ చేతన్ తో కలిసి మంత్రి సవిత జెండా ఊపి లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత పుట్టపర్తి నుంచి కొత్తచెరువు వరకు బస్సులో ప్రయాణం చేశారు. అంతకుముందు మంత్రి సవిత మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే మహిళలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సారథ్యంలో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేలా రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమానికి వారి ఆర్థిక అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. దీపం పథకం కింద మహిళలకు ఉచితంగా మూడు సిలిండర్లు ఇవ్వడమే కాకుండా సూపర్ సిక్స్ హామీలలో భాగంగా తల్లికి వందనం నిధులను మంజూరు చేసామన్నారు. ప్రస్తుతం స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు తెలియజేశారు. 11449 బస్సులు రాష్ట్రంలో ప్రజా రవాణాకు సేవలు అందిస్తుంటే అందులో 8845 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు తెలియజేశారు. కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ మహిళలు ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి చూపించి ఆర్టీసీ బస్సులలో ప్రయాణించవచ్చని తెలియజేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సింధూర రెడ్డి,మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఆర్డిఓ సువర్ణ, ప్రజా రవాణా అధికారి మధుసూదన్, డిపో మేనేజర్ ఇనయతుల్ల, మున్సిపల్ కమిషనర్ క్రాంతి కుమార్, ఎస్ టి ఐ హరిత, పార్థసారధి రెడ్డి, నాయకులు శ్రీరామ్ రెడ్డి, సాముకోటి ఆదినారాయణ, నాయకులు అధికారులు పాల్గొన్నారు.
టిడిపి తోనే మహిళలకు ప్రత్యేక గుర్తింపు..మంత్రి సవిత
- Advertisement -
RELATED ARTICLES


