విశాలాంధ్ర-బ్యూరో అనంతపురం: జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదాలు జరగడం వెనక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే కారణమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ ఆరోపించారు. శనివారం అనంతపురం సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్నూలు సమీపంలో ఇటీవల బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగిన సమయంలో ప్రభుత్వాలు స్పందించడం మానేసుకుని రోడ్డు భద్రత కారణాలను అన్వేషించాలని వాహనాల రాకపోకలకు రహదారులు బాగు చేయాలని సూచించారు.ప్రభుత్వ , ప్రైవేటు బస్సులపై నిఘా ఉంచి భద్రత ప్రమాణాలను పాటు విరివిగా తనిఖీలు చేపట్టాలని కోరారు. ప్రజల ఆరోగ్యాలను కాపాడుతామని ప్రమాణం చేసి చట్టసభకు ఎన్నికవుతున్న మంత్రులు, ఎంపీలు ఎమ్మెల్యేలు తర్వాత పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రైవేట్ బస్సులను రోడ్డుపైకి పంపే సమయంలో ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించకుండా చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడమే దీనికి కారణమన్నారు. అధికారులు ముడుపులుకు అలవాటు పడడం ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ఆయన మండిపడ్డారు. బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఈ విధానం విమాన ప్రయాణాలలో ఉంటుందని గుర్తు చేశారు. బస్సులను తనిఖీ చెయ్యడం లేదని, అధికారుల అవినీతి ఇందుకు కారణమన్నారు. కాలం చెల్లిన బస్సులు రోడ్డుపైకి వస్తున్నాయని, 120 నుండి 150 కిలోమీటర్ల స్పీడుతో వెళ్తున్నాయని, అలాంటప్పుడు ప్రయాణికులకు భద్రత లేకుండా పోతుందన్నారు. ప్రైవేటు బస్సులు ఫిట్ నెస్ సర్టిఫికెట్, లైసెన్స్, డ్రైవర్ వివరాలు ఆన్లైన్ లో ఉంచాలని ప్రభుత్వానికి చూచించారు. 19 మంది చనిపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తూతూ మంత్రంగా పరిహారం ప్రకటించారని, ఒక్కో కుటుంబానికి రూ.కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఇలా ఇచ్చిన సంఘటన ను గుర్తు చేశారు.విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి.జాఫర్,జిల్లా సహాయ కార్యదర్శి జె.రాజారెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీశైలం రాజేష్ గౌడ్, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు దనుంజయలు పాల్గొన్నారు.


