Homeఆంధ్రప్రదేశ్రొయ్యల మేత… ధరల వాత

రొయ్యల మేత… ధరల వాత

- Advertisement -

. ఏకపక్షంగా రేట్లు పెంచిన కంపెనీలు
. ఆక్వా రైతుల్లో కలవరం
. సర్కార్ దిద్దుబాటు చర్యలు ఫలించేనా?

విశాలాంధ్రబ్యూరో – అమరావతి: గత కొద్ది రోజులుగా రొయ్యల మేత ధరలను కంపెనీలు భారీగా పెంచాయి. టన్ను మేతకు రూ.8420 నుంచి 10,530 వరకు పెంచడంతో ఆక్వా రైతులకు దిక్కుతోచడం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే టన్నుకు రూ.4వేలు కంపెనీలు పెంచాయి. ఇప్పుడు ముడి సరుకు ధరలు పెరిగాయన్న సాకుతో వెనామీ మేతపై రూ.12వేలు, టైగర్ మేతపై రూ.14వేలు పెంపునకు అనుమతి ఇవ్వాలని గత నెల 30న మత్స్యశాఖ కమిషనర్‌కు రొయ్య మేత తయారీదారుల సంఘం లేఖ రాసింది. రైతు సంఘాలతో సమావేశమై చర్చించి నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ బదులిచ్చారు. అయితే, రైతు సంఘాలతో సమావేశం, చర్చలు జరపకుండానే ఏకపక్షంగా కంపెనీలు ధరలు పెంచాయి. మేత వ్యాపారంలో 50 శాతం వాటా కల్గిన అవంతి ఫీడ్స్ టన్నుకు వెనామీ మేతపై రూ.8,420లు, టైగర్ మేతపై రూ.10,530 పెంచగా, మిగిలిన కంపెనీలు రూ.8వేలు, 10వేలు చొప్పున పెంచాయి. రాష్ట్రంలో 4.58 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగవుతుండగా… లీజు ధరలను బట్టి టన్ను ఉత్పత్తికి వెనామీ రొయ్యలకు రూ.2.60 లక్షలు, టైగర్ రొయ్యలకు రూ.3.50 లక్షలు, చేపలకు 1.10 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. రొయ్యల సాగులో రూ.1.50 లక్షలు, చేపల సాగులో రూ.75వేల వరకు మేతకే ఖర్చు చేస్తుంటారు. మేత ధర పెంపుతో ఉత్పత్తి వ్యయం కాస్తా వెనామీ రొయ్యలపై రూ.2.75 లక్షలకు, టైగర్ రొయ్యలపై రూ.3.75 లక్షలకు చేరుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. రైతులను ఇబ్బందులకు గురిచేసే విధంగా రొయ్యల ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచడం సరైన విధానం కాదని అన్నారు. ఇప్పటికే సాగు వ్యయాలు పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులపై ఈ మేత ధరల పెంపు మరింత భారం మోపే పరిస్థితి తీసుకొచ్చిందని తెలిపారు. ఏపీఎసఏడీఏ చట్టం ప్రకారం రైతు సంఘాలతో సంప్రదింపులు జరిపిన అనంతరమే ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, మేత తయారీ కంపెనీలు ఆ నిబంధనలను పాటించకుండా వ్యవహరించడం ఆందోళనకరమన్నారు. ఈ విషయంపై ఫిషరీస్ కమిషనర్ ఇప్పటికే ఫీడ్ తయారీ సంస్థలకు రైతులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించినప్పటికీ, ధరల పెంపును అమలు చేయడం సమంజసం కాదన్నారు. రైతుల ఆందోళనలు, సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిగణిస్తోందని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో పెంచిన ధరల అమలును తక్షణమే నిలిపివేయాలని సంబంధిత మేత తయారీ సంస్థలకు ఫిషరీస్ కమిషనర్ ద్వారా నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.
అలాగే ఈ అంశంపై రైతు సంఘాలు, మేత తయారీ సంస్థల ప్రతినిధులతో బుధవారం ఉదయం సమావేశం నిర్వహించి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని లక్షలాది ఆక్వా రైతుల ప్రయోజనాలను కాపాడటంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతు పక్షానే నిలుస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు