- ముందు ఏపీపీఎస్సీకి బాధ్యతలు…
- రాత పరీక్ష లేకుండా కమిషన్ విముఖత
- తర్వాత వెటర్నరీ శాఖకు అప్పగింత
- నిరుద్యోగుల నుంచి విమర్శలు… మళ్లీ ఏపీపీఎస్సీకే
- 160 పోస్టుల భర్తీకి తాజాగా ఉత్తర్వులు
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: డీఎస్సీ-2025 నియామకాలపై అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం…వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (వీఏఎస్) పోస్టుల భర్తీ విషయంలోనూ విమర్శల్ని ఎదుర్కొంటోంది. ఒకే నియామక ప్రక్రియపై వరుసగా నిర్ణయాలు మార్చుకోవడం, రాత పరీక్ష నిర్వహణ విషయంలో స్పష్టత లేకపోవడం నిరుద్యోగుల్లో ఆందోళనకు దారితీసింది. పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న 160 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను జాబ్ క్యాలెండర్-2026 రెండో దశలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం తొలుత ఏపీపీఎస్సీకి బాధ్యతలు అప్పగించింది. ఈ నెల 13న జీవో 21 జారీ చేసింది. రాత పరీక్ష లేకుండా నియామక ప్రక్రియ చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఏపీపీఎస్సీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుని… వీఏఎస్ పోస్టుల భర్తీ బాధ్యతలను పశుసంవర్ధక శాఖకే అప్పగిస్తూ మరో ఉత్తర్వు జారీ చేసింది. 2016 జీవో 52 ప్రకారం వీఏఎస్ పోస్టులను డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాత పరీక్షకు బదులుగా అభ్యర్థుల ప్రతిభ, గతం లో అమలులో ఉన్న ప్రత్యేక వెయిటేజీ నిబంధనల ఆధారంగా ఎంపిక ప్రక్రియకు సిద్ధమైంది. రిజర్వేషన్, రోస్టర్ నిబంధనలను కూడా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విధానం జాబ్ క్యాలెండర్-2026లోని ఈ నియామకాలకు మాత్రమే పరిమితమని, భవిష్యత్ నియామకాలకు దీనిని ఉదాహరణగా పరిగణించరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాత పరీక్ష లేకుండా నియామకాలు చేపట్టడంపై విద్యార్థి, యువజన సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. డీఎస్సీ-2025లో క్రీడా కోటా నియామకాలపై ఇప్పటికే వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. వీఏఎస్ పోస్టులకూ పరీక్ష లేకుండా నియామకాలు చేపట్టడం అనుమానాలకు తావిస్తోందని ఆరోపించాయి. ఆయా విమర్శలపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ… గత ప్రభుత్వం ఐదేళ్లపాటు ఒక్క వెటర్నరీ డాక్టర్ పోస్టును కూడా భర్తీ చేయకుండా నిరుద్యోగులను నిరీక్షణలో ఉంచిందని ధ్వజమెత్తారు. ఎనిమిదేళ్లుగా నియామకాలు లేక నష్టపోయిన అభ్యర్థుల విజ్ఞప్తి మేరకే వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. వీఏఎస్ పోస్టులను తొలుత ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని భావించినప్పటికీ, పాత వెయిటేజీ విధానంలోనే తమకు అవకాశం కల్పించాలని నిరుద్యోగ సంఘాలు కోరాయని స్పష్టంచేశారు. అభ్యర్థుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని జీవో 52 ప్రకారం ఈ ఒక్కసారికి మాత్రమే పశుసంవర్ధక శాఖ ద్వారా మెరిట్, వెయిటేజీ ఆధారంగా నియామకాలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. అయినప్పటికీ.. విపక్షాలు, విద్యార్థి, యువజన సంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నాయి. దీనిపై పెద్దఎత్తున సామాజిక మాద్యమం వేదికగా ప్రభుత్వ నిర్ణయాన్ని ఎత్తిచూపాయి. ఇతర రాష్ట్రాల్లో వీఏఎస్ పోస్టులకు రాత పరీక్ష ద్వారా నియామకాలు జరుగుతున్నప్పుడు… రాష్ట్రంలో మాత్రం పరీక్ష లేకుండా నియామకాలు చేపట్టడం ఎందుకని ప్రశ్నిస్తున్నాయి. 2016లో జారీ చేసిన జీవోను ఇప్పుడు అమలు చేయాల్సిన అవసరం ఏమిటి… ఏపీపీఎస్సీ ద్వారా రాత పరీక్ష నిర్వహించి అర్హత, మెరిట్ ఆధారంగా నియామకాలు ఎందుకు చేపట్టకూడదు… ఒడిశా, పంజాబ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో పరీక్షల ద్వారా నియామకాలు జరుగుతుంటే… రాష్ట్రంలో మాత్రం పరీక్షకు ఎందుకు మినహాయింపు అంటూ నిలదీశాయి. మరోవైపు డీఎస్సీలో క్రీడా కోటా పోస్టులకు రాత పరీక్ష అవసరం లేదని చెబుతున్న ప్రభుత్వం… పోలీసు నియామకాల్లో మాత్రం రాత పరీక్షను తప్పనిసరి చేస్తోందని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఒకే ప్రభుత్వ నియామకాల్లో ఒకచోట పరీక్ష అవసరం లేదని, మరోచోట పరీక్ష తప్పనిసరి అని చెప్పడం వెనుక ఉన్న విధానపరమైన తేడా ఏమిటని వారు నిలదీస్తున్నారు. దీంతో వీఏఎస్ పోస్టుల భర్తీ వ్యవహారం వరుస మలుపులు తిరిగింది. తొలుత ఏపీపీఎస్సీకి బాధ్యతలు… అనంతరం పశుసంవర్ధక శాఖకు అప్పగింత… విమర్శలు, అభ్యంతరాల నేపథ్యంలో ప్రభుత్వం దిగి వచ్చింది. తాజాగా జీవో 24 జారీ చేసి వీఏఎస్ పోస్టుల నియామక బాధ్యతలను మళ్లీ ఏపీపీఎస్సీకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 160 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీపై సాగిన నిర్ణయాల పరంపరకు తెరపడినట్లయింది.


