Homeఆంధ్రప్రదేశ్యూపీఐ ప్రకంపనలు

యూపీఐ ప్రకంపనలు

- Advertisement -
  • పేద, మధ్యతరగతిపైనే ఆర్థిక భారం
  • నగదు ద్వారా ఇంధన విక్రయాలు… పెట్రో డీలర్ల యోచన
  • కేంద్రం తక్షణం యూపీఐ చార్జీల ప్రతిపాదనను విరమించాలి

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: కేంద్రంలోని మోదీ సర్కారు సమీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) లావాదేవీలపై అదనపు చార్జీలు వడ్డించడంపై దేశవ్యాప్తంగా, రాష్ట్రంలోనూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం అమలైతే పేద, దిగువ మధ్యతరగతి వర్గాలతో పాటు చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు, చిన్నతరహా రవాణా రంగాలపై అదనపు ఆర్థిక భారం పడుతుందని వివిధ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో రోజుకు సగటున దాదాపు 1.8 కోట్ల యమూ| Óఐ లావాదేవీలు జరుగుతున్నట్లు సమాచారం. అదనపు చార్జీల వల్ల దేశీయ వినియోగదారులపై ఏటా దాదాపు 20వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని అంచనా. ఈ మొత్తంలో అత్యధిక భాగం విదేశీ, ముఖ్యంగా అమెరి కాకు చెందిన ఫైనాన్సియల్ కార్పొ రేట్ కంపెనీల జేబుల్లోకే చేరుతుం దనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో, పెరుగుతున్న ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో దాదాపు 95 శాతం ప్రజానీకంపై ఇది కోలుకోలేని దెబ్బగా మారనుంది. రాష్ట్రంలో యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ఆర్థిక రంగాన్ని విప్లవాత్మకంగా మార్చడమే కాకుండా కీలక రంగాల్లో ప్రధాన చెల్లింపు సాధనంగా మారింది. ఇంధన రవాణా రంగంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 5 వేల పెట్రోల్ బంకుల్లో నిత్యం వేలాది వాహనదారులు క్యూఆర్ కోడ్ ద్వారానే లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థలో భాగంగా ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో కండెక్టర్లు స్మార్ట్ ఈ-టికెటింగ్ మిషన్ల ద్వారా ప్రయాణికుల నుంచి యూపీఐ చెల్లింపులను స్వీకరిస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కిరాణా దుకాణాలు, పండ్లు, కూరగాయల వ్యాపారులు, వీధి వ్యాపారులు సౌండ్బాక్స్‌ పరికరాల ద్వారా చిన్న తరహా లావాదేవీలను వేగంగా పూర్తి చేస్తున్నారు. వ్యవసాయ, ఆక్వా రంగాల్లో రైతులు, వ్యాపారుల మధ్య ఎరువులు, మేత, ధాన్యం కొనుగోళ్ల చెల్లింపులకు ఇది విరివిగా ఉపయోగపడుతోంది. వాటితో పాటు విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్నులు, ఇతర పురపాలక సేవల రుసుముల చెల్లింపుల్లోనూ ప్రజలు యూపీఐ సేవలను వినియోగిస్తున్నారు. అదనపు సర్చార్జీల వల్ల పెట్రోల్ బంకులు, ఆర్‌టీసీ బస్సులు, చిన్న తరహా వర్తక రంగాల్లో యూపీఐ లావాదేవీలు నిలిచిపోయి… క్షేత్రస్థాయిలో సమస్యలు తలెత్తే ప్రమాదముంది. కిళ్లీ, సిగరేట్ బడ్డీ కొట్లు వంటి అతి చిన్న వ్యాపారాలు మినహా మిగిలిన అన్ని వాణిజ్య, వ్యాపార నిర్వాహకులు ఈ రుసుములను తప్పనిసరిగా చెల్లించాల్సి రావడంతో ఆ అదనపు భారాన్ని నేరుగా సాధారణ వినియోగదారుల పైకే నెట్టేయడం ఖాయం. లేదా వీరంతా అకస్మాత్తుగా డిజిటల్ సేవలు నిలిపివేస్తే వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.
నగదు లావాదేవీలపై పెట్రోల్ బంకుల చూపు
ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ అత్యంత కీలకమైన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల్లో యూపీఐ డిజిటల్ చెల్లింపులకు పూర్తిస్థాయిలో స్వస్తి చెప్పి… బంకుల్లో కేవలం ప్రత్యక్ష నగదు లావాదేవీలనే అనుమతించాలని తీవ్రంగా యోచిస్తోంది. డిజిటల్ విధానంలో నిత్యం ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ కావడంలో కొనసాగుతున్న తీవ్ర ఆలస్యం, ఫెయిల్ అయిన లావాదేవీల వల్ల వాహనదారులు` బంక్ సిబ్బంది మధ్య వివాదాలు తలెత్తడం వల్ల డీలర్లు తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయమై సమస్య తీవ్రతను వివరిస్తూ అసోసియేషన్ ప్రతినిధులు ఇప్పటికే జాతీయ స్థాయిలోనూ పోరాటాన్ని ముమ్మరం చేశారు. దేశవ్యాప్తంగా డీలర్లు ఎదుర్కొంటున్న ఈ అవరోధాలను వివరిస్తూ కేంద్రానికి లేఖను పంపారు. ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులు కూడా రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి విజ్ఞప్తి చేయనున్నారు. పెట్రోల్ బంకుల డీలర్ల అసోసియేషన్ నగదు తీసుకునేందుకే ప్రాధాన్యత ఇస్తే డిజిటల్ పేమెంట్లపైనే ఆధారపడి బంకులకు వచ్చే లక్షలాది మంది వాహనదారులకు రాబోయే రోజుల్లో తీవ్ర అవస్థలు ఎదురయ్యే ప్రమాదం స్పష్టంగా కన్పిస్తోంది. కేంద్రంలోని మోదీ సర్కారు ‘డిజిటల్ ఇండియా’ పేరుతో నగదు రహిత లావాదేవీలను విపరీతంగా ప్రోత్సహించి, ప్రజలందరినీ యూపీఐ చెల్లింపుల విధానానికి అలవాటు చేసిన తర్వాత, ఇప్పుడు అమెరికా ఫైనాన్స్ కంపెనీల ఒత్తిళ్లకు తలొగ్గి ఇలా అదనపు రుసుములు విధించడం ప్రజలను తీవ్రంగా దగా చేయడమేనని వామపక్ష పార్టీలతో పాటు ప్రజా సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. యూపీఐ చార్జీల విధింపును తక్షణమే ఉపసంహరించుకునేలా ఎన్‌డీఏలో ఉన్న సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్…కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు