Homeవిశ్లేషణకరవును ఎదుర్కోవడంలో కూటమి విఫలం

కరవును ఎదుర్కోవడంలో కూటమి విఫలం

- Advertisement -

బొల్లిముంత సాంబశివరావు

తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆంధ్రప్రదేశ్ నేడు తీవ్ర కరవు పరిస్థితులను ఎదుర్కుంటోంది. 59శాతం లోటు వర్షపాతం నమోదయ్యింది. రాష్ట్రంలోని 685 మండలాల్లో 653 మండలాలు కరువు మండలాలుగా ఉన్నాయి. ఖరీఫ్ సేద్యం ప్రశ్నార్థకంగా మారింది. కృష్ణాడెల్టాకు సాగునీరు విడుదల చేయలేమని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. వరిసాగు చేయొద్దని రైతులను ఆదేశించింది. సాగునీటి నిపుణులు మాత్రం ప్రస్తుతం నీటి నిల్వలు దృష్ట్యా సాగునీరు విడుదల చేయవచ్చని చెబుతున్నారు. ప్రభుత్వం నీరు విడుదల చేయకపోవడం వల్ల అనేక తిప్పలుపడి రైతులు వేసిన ఫైర్లు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారు. కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో కూటమి ప్రభుత్వం మాటలకే పరిమితమైంది.
వరదనీరు నిల్వలో పాలకుల వైఫల్యం : భారీ వర్షాలు, వరదల వల్ల వచ్చే నీటిని నిల్వ చేయడానికి అవసరమైన నీటిప్రాజెక్టులు పూర్తిచేయడంలో పాలకులు విఫలమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో 36 సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాకుండా పెండింగ్‌లో ఉన్నాయి. వాటిల్లో ప్రధాన ప్రాజెక్టులైన పోలవరం, వెలిగొండ, హంద్రీనీవా సుజల స్రవంతి, గాలేరు-నగరి, వంశధార-నాగావళి అనుసంధానం, మద్దువలస జలాశయం రెండో దశ, హీర మండలం ఎత్తిపోతల పథకం, జంఝ²వతి రిజర్వాయిర్, తోటపల్లి బ్యారేజ్, నాగావళి`చంపావతి నదుల అనుసంధానం, గుంటూరు ఛానల్ ఆధునీకరణ, వరికపుడిశెల ఎత్తిపోతల పథకం, చింతలపూడి ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తిచేసి ఉంటే వరదనీరు నిల్వ సాధ్యమయ్యేది. వర్షాభావ, కరువు పరిస్థితుల్లో సాగు, తాగునీరు విడుదలకు చేయడానికి అవకాశం ఉండేది. దీన్ని గమనిస్తే నేటి సాగునీటి సమస్యకు గత ప్రభుత్వాలు, నేటి ప్రభుత్వమే కారణంగా ఉన్నాయి.
నీటి ప్రాజెక్టులు పూర్తికాకపోవడానికి ‘కాగ్’ చెప్పిన కారణాలు : ఆంధ్రప్రదేశ్‌లో ‘జలయజ్ఞం’ కాలం నుండి నేటి వరకు సాగునీటి ప్రాజెక్టులు దశాబ్దాల పాటు పెండింగ్‌లో పడిపోవడంపై తన వివిధ నివేదికల్లో కాగ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. పరిపాలన లోపాల వల్ల ప్రాజెక్టుల అంచనా వ్యయం వేల కోట్లకు పెరిగిందని స్పష్టం చేసింది. కాగ్ ఎత్తి చూపిన ప్రధాన కారణాలు-ముందే టెండర్లు వేయడం, భూసేకరణ పూర్తికాకుండా, అటవీ, పర్యావరణశాఖల అనుమతులు, కేంద్ర జలసంఘం అనుమతులు రాక ముందే కాంట్రాక్టులు కట్టబెట్టడం అతిపెద్ద తప్పిదమని కాగ్ పేర్కొంది. క్షేత్రస్థాయిలో సరైన సర్వేలు చేయకుండా, పనులు ప్రారంభించడం వల్ల మధ్యలో డిజైన్‌లు, అలైన్మెంట్లు మార్చాల్సి వచ్చి ప్రాజెక్టుల పనులు నిలిచిపోయాయని చెప్పింది. నియమాలకు విరుద్ధంగా, నిబంధనలు ఉల్లంఘించి, కాంట్రాక్టర్లకు వడ్డీ లేని అడ్వాన్సులు ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని కాగ్ ఆరోపించింది. నిబంధనలను కఠినంగా మార్చి పోటీ లేకుండా చేసి ఒకే ఒక్క బిడ్డర్‌కి పనులు దక్కేలా చేయడం జరిగిందని చెప్పింది. బడ్జెట్లో సాగునీటి రంగానికి కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో వాడలేదు. పోలవరం పనుల్లో బడ్జెట్ కేటాయింపు నిధుల్లో 21శాతం నుండి 61శాతం వరకే ఉందని కాగ్ వెల్లడించింది. ప్రాజెక్టులకు కేటాయించిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించడం వల్ల ప్రాజెక్టుల పనులు ముందుకు సాగలేదని పేర్కొంది. ప్రాజెక్టుల హెడ్వర్క్స్‌ (డ్యాములు లేదా బ్యారేజీలు) పై పెట్టిన శ్రద్ద కాలువల నీటివర్క్ పై పెట్టలేదని ఫలితంగా కాల్వల నిర్మాణం ఆగిపోయి నీరు ఉన్నా పొలాలకు అందించలేని పరిస్థితి ఏర్పడిందని వెల్లడించింది. 2004లో జలయజ్ఞం కింద ప్రారంభించిన 86ప్రాజెక్టుల ప్రాధమిక అంచనా వ్యయం 1.86 కోట్లు కాగా, సరైన సమయానికి పనులు పూర్తికాకపోవడం వల్ల 52,116 కోట్ల అదనపు భారం పడుతుందని కాగ్ అప్పుడు హెచ్చరిం చింది. 2026 మార్చిలో విడుదల చేసిన కాగ్ నివేదిక ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం ఏ విధంగా అస్తవ్యస్తంగా మారిందో గణాంకా లతో వివరించింది. బడ్జెట్ కేటాయింపుల్లో వినియోగంలో 21శాతం నుండి 66శాతం మాత్రమే ఉందని పేర్కొంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో కూడా నిబంధనలు ఉల్లంఘించి కాంట్రాక్టర్లకు మేలు చేసేలా అదనంగా 330కోట్లు చెల్లించారని కాగ్ ఆడిట్‌లో చెప్పింది. ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్ల గోదావరి, కృష్ణా నదుల నుంచి ప్రతి సంవ త్సరం 2,500 టీఎంసీల నుంచి 3,500 టీఎంసీల నీరు సముద్రంలోకి పోతున్నది. సాధారణ వర్షపాతం నమోదైన సంవత్సరాల్లో సగటున 2000 నుండి 3000 టీఎంసీల నీరు ధవళేశ్వరం బ్యారేజీ మీదుగా సముద్రం లో కలుస్తుంది. వర్షాలు చాలా ఎక్కువ పడినప్పుడు 4,100 నుండి 6,000 టీఎంసీల నీరు ఈ బ్యారేజ్ నుండి సముద్రంలో కలుస్తుంది. సముద్రంలో కలిసే ఈ నీరుతో నాగార్జునసాగర్ లాంటి పెద్ద జలా శయాన్ని దాదాపు 15 నుండి 20సార్లు నింపటానికి సరిపోతుంది. తీవ్రకరువు ఉన్న సంవత్సరాల్లో కూడా 900 టీఎంసీల నీరు సముద్రం లోకి పోతోంది. కృష్ణానదిపై ఉన్న ప్రకాశం బ్యారేజ్ గుండా ఏటా 300 నుండి 500టీఎంసీల నీరు సముద్రం పాలౌతున్నది. వరదలు వచ్చిన సంవత్సరాల్లో 700 నుండి 1000 టీఎంసీల నీరు వృథాగా సము ద్రంలో కలుస్తుంది. సముద్రం పాలయ్యే నీటిలో మూడవ వంతు నిల్వ చేయగలిగినా కరువు పరిస్థితుల్లో కూడా తాగు, సాగు నీరు సమస్యలు ఉత్పన్నమయ్యేవి కావు.
ప్రభుత్వ సహాయక విధానాలపై ‘కాగ్’ : కరువు నివారణ నిధులు, విపత్తుల నిధుల వినియోగంలో రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కాగ్ అనేక అంశాలను లేవనెత్తింది. రాష్ట్ర విపత్తుల ప్రతిస్పందన నిధిలో కేంద్రప్రభుత్వం 75శాతం నిధులను ఇస్తుంది. మిగిలిన 25శాతం నిధులను రాష్ట్రప్రభుత్వం జమచేయాల్సి ఉంటుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కి 1449.64 కోట్లు కేటాయించగా, అందులో కేంద్రప్రభుత్వం 1,088 కోట్లు విడుదల చేసింది. కేంద్రం ఇచ్చే సహాయక నిధులే నామమాత్రంగా ఉంటే, వాటిని కూడా రైతాంగానికి అందించకుండా వేరే వాటికి రాష్ట్రప్రభుత్వం మళ్లిస్తుంది. ఈ విషయాన్నే కాగ్ నివేదిక బట్టబయలుచేసింది. కరువు సహాయం, ఉపాధి పధకాలు, విపత్తుల సమయాల్లో రైతులకు ఉచిత ఇన్‌పుట్ సబ్సిడీ, అందించటానికి ఉద్దేశించిన నిధులను తన రెవెన్యూలోటును పూడ్చుకోవడానికి, ఇతర సాధారణ ఖర్చులకు ప్రభుత్వం మళ్లిస్తుందని కాగ్ తప్పుపట్టింది. విపత్తుల నిర్వహణ నిధి కింద కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా ప్రత్యేక ఖాతాల్లో ఉంచకుండా వాడుకోవడం వల్ల రైతులకు పంట నష్టపరిహారం సక్రమంగా అందడం లేదని కాగ్ నివేదిక వెల్లడించింది. కరువు, ప్రకృతి వైపరీత్యాల సహాయార్థం బడ్జెట్ గ్రాట్యూటీస్ రిలీఫ్ కింద వందల కోట్లు కేటాయించినప్పటికీ క్షేత్రస్థాయిలో రైతులకు, కరువు ప్రభావిత మండలాలకు నిధులు చేరడంలో తీవ్రమైన లోపం జరుగుతున్నదని కాగ్ స్పష్టం చేసింది. గత కరువు నివారణ, గ్రామీణ తాగునీటి పధకాలకు భారీగా బడ్జెట్ చూపించినా, అందులో 30 నుండి 40శాతం నిధులు విడుదల చేయలేదు. కరువు మండలాలు, పంటనష్ట తీవ్రతను అంచనా వేసే ‘నష్టపరిహార సర్వేలు’ సకాలంలో పారదర్శకంగా జరగడం లేదని, దాని వల్ల అర్హులైన కరువు ప్రాంతాల రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందలేదని, ప్రభుత్వ పరిపాలనలో జవాబుదారీతనం లోపించిందని కాగ్ వెల్లడించింది. నేడు రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల, కరువు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం వెంటనే ఈ కింది చర్యలు చేపట్టాలి. తక్షణం రాష్ట్రాన్ని కరువు పీడిత రాష్ట్రంగా ప్రకటించాలి. సేద్యానికి తక్షణం నీరు విడుదల చేయాలి. పంటలు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. కౌలురైతులతో సహా చిన్న, సన్నకారు రైతుల బ్యాంకుల అప్పులను పూర్తిగా రద్దు చేయాలి. మిగతా రైతులకు వడ్డీ మాఫీ చేసి దీర్ఘకాలిక అప్పులుగా ప్రకటించాలి. తిరిగి రైతులందరికీ వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. విద్యార్థుల చెల్లించాల్సిన ఫీజులను రద్దు చేయాలి. గ్రామీణ ఉపాధి పధకాన్ని 250 రోజులకు పెంచి , రోజు కూలి 450గా ప్రకటించి, గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించాలి. ప్రతి గ్రామంలోని రేషన్ షాపుల ద్వారా అన్నిరకాల నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకు ప్రజలకు అందించాలి. గ్రామాల్లో మంచినీటి సమస్యను పరిష్కరించాలి. కరువు సహాయం కోసం ఎక్కువ నిధులు కేటాయించి, అవి దుర్వినియోగం కాకుండా చూడాలి. అంటు వ్యాధులు ప్రభలకుండా చర్యలు తీసుకోవాలి. వీటిని సాధించుకోవడానికి రాష్ట్ర ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలి.
రైతు కూలీ సంఘం (ఆం.ప్ర) రాష్ట్ర కార్యవర్గ సభ్యుల, సెల్ : 9885983526

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు