విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా రైతుకు ఖరీఫ్ అంటే ఒక ఆశ, ఒక నమ్మకం. కానీ 2026 ఖరీఫ్ సీజన్ జిల్లా రైతాంగానికి తీరని వేదనను మిగిల్చింది. ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక సాగు గణాంకాలను పైపైన చూస్తే ఁ75 శాతం సాగు పూర్తయింది కదా, జిల్లా బాగుందిఁ అనే భ్రమ కలుగుతుంది. కానీ ఆ గణాంకాల లోతుల్లోకి తొంగిచూస్తే… ఃఅనంతః జీవనాడి అయిన వేరుశనగ కోలుకోలేని దెబ్బతిన్న నిజం బయటపడుతుంది.
‘అనంత’ గుండెకాయ వేరుశనగ కకావికలం!
జిల్లా వ్యాప్తంగా సాధారణంగా 1,47,382 హెక్టార్లలో వేరుశనగ సాగు కావాల్సి ఉండగా, ఈ ఏడాది కేవలం 54,677 హెక్టార్లకే (37 శాతం) పరిమితమైంది. అంటే దాదాపు 63 శాతం భూమిలో అసలు విత్తనమే పడలేదు. వరుసగా మూడు నెలలుగా ఎల్ నినో ప్రభావంతో వానలు రాకపోవడమే ఇందుకు కారణం. ఆరుగాలం కష్టపడి వేసిన ఆ కొద్దిపాటి 37 శాతం పైరు కూడా నీళ్లలేక ఎండు ముఖం పట్టింది.
ప్రత్యామ్నాయం కాస్తా ప్రహసనమైంది:
వర్షాలు రాక వేరుశనగ వేయలేని పరిస్థితుల్లో, తక్కువ నీటితో పండే పంటల వైపు రైతులు మొగ్గు చూపారు. అందుకే కందుల సాగు సాధారణ విస్తీర్ణం (78,274 హెక్టార్లు) కంటే ఏకంగా 162 శాతానికి (1,26,409 హెక్టార్లు) పెరిగింది. కాగితాలపై ఈ సంఖ్యలు సాగు శాతాన్ని పెంచి చూపించినా, క్షేత్రస్థాయిలో కందుల పైరును కాపాడుకోవడానికి కూడా వర్షాలు లేక రైతులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు.
బోర్లలో ఇంకిన నీళ్లు… ఎండిపోతున్న తోటలు:
వర్షాభావం ఒక్క వర్షాధార పంటలనే కాదు, బావులు, బోర్లపై ఆధారపడే ఉద్యానవన పంటలనూ కోలుకోలేని దెబ్బతీసింది. వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. పత్తి (68% సాగు), మొక్కజొన్న (72% సాగు) పంటలతో పాటు బత్తాయి, మామిడి, దానిమ్మ తోటలకు నీళ్లందక ఎండుతున్నాయి. నీటి ట్యాంకర్లను కొనుగోలు చేసి తోటలను బతికించుకోవడానికి రైతులు ఎకరానికి వేలాది రూపాయలు అదనంగా తగలేస్తున్నారు.
గడ్డి కరువై… పశువుల అమ్మకాలు
పంటల సాగు తగ్గడంతో పశుగ్రాసం కొరత తీవ్రరూపం దాల్చింది. పచ్చికబయళ్లు ఎండిపోవడంతో పశువుల కడుపు నింపడం పాడి రైతులకు పెద్ద సవాలుగా మారింది. మేత లేక, పశువులను పోషించలేక తక్కువ ధరలకే సంతల్లో విక్రయించుకుంటున్నారు.
కాగితాల లెక్కలు పక్కనబెట్టి… కరవు సహాయం అందించాలి!
అధికారిక రికార్డుల్లో 75 శాతం సాగు నమోదైందని సంబరపడటం యంత్రాంగానికి తగదు. విత్తనం పడని 63 శాతం వేరుశనగ విస్తీర్ణాన్ని, అలాగే వేసి ఎండిపోతున్న పంటల నష్టాన్ని లెక్కించాలి.
తక్షణ డిమాండ్లు:
అనంతపురం జిల్లాను తక్షణమే అధికారికంగా కరవు జిల్లాగా ప్రకటించాలి.
వర్షాభావం వల్ల పంటలు వేయలేకపోయిన, వేసి నష్టపోయిన ప్రతి రైతుకూ ఎకరానికి రూ. 50,000 నష్టపరిహారం అందించాలి. మండల కేంద్రాల్లో ఉచితంగా పశుగ్రాస కేంద్రాలు (ఫాడర్ బ్యాంకులు) ఏర్పాటు చేయాలి. తోటలను కాపాడుకోవడానికి ఉపాధి హామీ పథకం కింద నీటి ట్యాంకర్లకు సబ్సిడీ పునరుద్ధరించాలి.
బాధిత రైతు ఆవేదన:
ఁఆరు ఎకరాల్లో పంట సాగు చేయడానికి ఎకరానికి రూ. 45 వేల చొప్పున మొత్తం రూ. 2.70 లక్షలు పెట్టుబడి పెట్టాను. గత మూడు నెలలుగా వర్షాలు లేకపోవడంతో వేసిన పంట అంతా కళ్లముందే ఎండిపోతోంది. పెట్టిన పెట్టుబడి కూడా దక్కేలా లేదు, చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. ప్రభుత్వం వెంటనే స్పందించి పరిహారం అందించి మమ్మల్ని ఆదుకోవాలి.
— ఎర్రిస్వామి, రైతు, రాప్తాడు.
రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి: సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున
తీవ్ర వర్షాభావంతో పంటలు వేసి వేయలేక నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వమే తక్షణమే ఆదుకోవాలన్నారు. తెలంగాణ తమిళనాడు ప్రభుత్వాల తరహాలో రైతుల రుణమాఫీలను తక్షణమే బేషరతుగా మాఫీ చేయాలన్నారు.


