సమస్యలను పరిష్కరించడంలో దిట్ట..
అక్రమార్కుల గుండెల్లో హడలు..
విశాలాంధ్ర – కొవ్వూరు: ఆమె డివిజన్ కు మహిళా ఉన్నతాధికారి.. నిత్యం తన కార్యాలయానికి వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండటమే కాక వారి సమస్యలను పరిష్కరించడంలో కూడా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఇసుక మాఫియా, మట్టి మాఫియా కు పాల్పడుతున్న అక్రమాలను అరికడుతూ ముందుకు దూసుకు వెళ్తున్నారు. ఆమె కొవ్వూరు డివిజనల్ అధికారి (ఆర్డీవో) రాణి సుస్మిత. ప్రతి సోమవారం తన కార్యాలయంలో జరిగే పీజీ ఆర్ఎస్ కార్యక్రమం కింద ప్రజలు ఇచ్చిన అర్జీలను స్వయంగా చదివి తన కిందిస్తాయి అధికారులకు ఆదేశాలు ఇస్తూ మరోవైపు, సమస్య తన పరిధిలో ఉంటే స్వయంగా పరిష్కరిస్తూ, తన పరిధి దాటితే తనపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు న్యాయం చేస్తున్నారు. గ్రూప్ వన్ పరీక్షలలో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన ఆమె మొదటిగా అనంతపురం జిల్లాలో ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం కొవ్వూరు ఆర్డీవోగా బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ డివిజన్లో ఉన్న ప్రధాన సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. మరోవైపు ఇసుక మాఫియా, మట్టి మాఫియా, గ్రామాలలోనూ పట్టణాలలోనూ అధికమైన ప్రభుత్వ భూముల ఆక్రమణ వంటి విషయాలపై చురుగ్గా వ్యవహరిస్తూ మంచి అధికారిగా పేరు పేరుపొందారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలైన పెన్షన్లు, రేషన్ దుకాణాల ద్వారా వృద్ధులకు ఇంటింటికి వెళ్లి ఇచ్చే డీలర్లు ఎలా వ్యవహరిస్తున్నారన్న అన్న విషయం ఆరా తీసి స్వయంగా తానే లబ్ధిదారుల ఇళ్లకువెళ్లి పరిశీలిస్తున్నారు. అదేవిధంగా రేషన్ షాపులకు వెళ్లి స్టాక్ రిజిస్టర్ లను, ఉన్న స్టాక్ ను తనిఖీ చేస్తున్నారు. కొవ్వూరు డివిజన్లో కొవ్వూరు, తాళ్లపూడి, నిడదవోలు,పెరవలి మండలాల్లో ఇసుక ర్యాంపులు ఎక్కువగా ఉండటంతో అక్కడఅక్రమాలు చోటుచేసుకుంటే అది పగలైనా రాత్రి అయినా తనకు సమాచారం అందగానే తాను స్వయంగా అక్కడికి వెళ్లి అక్రమార్కుల భరతం పడుతున్నారు. ఇటీవల వరుస తుఫానులతో అతా కుతలమైన రైతాంగాన్ని, వరద ముంపునకు గురైన గ్రామాలలోని బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి ఆహారం, మందులు పంపిణీ వంటిఏర్పాట్లను స్వీయ పర్యవేక్షణ చేస్తున్నారు. అదేవిధంగా చిన్నపాటి తుఫానుకు నిడదవోలు దగ్గర ఉన్న ఎర్రకాలువ పొంగి ప్రవహించడంతో ఆ ప్రాంత ప్రజలకు అందించాల్సిన సహాయం విషయమై ఆమె చురుగ్గా నిర్ణయాలు తీసుకుని బాధితులను ఆదుకోవడంలో సమర్థవంతమైన అధికారిగా పేరుపొందారు. తన క్రింది స్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు ఇస్తూ అవసరమైతే ఆదేశిస్తూ ముందుకు వెళుతున్నారు. నిన్నటికి నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో నిర్వహించిన గోదావరి మహా హారతి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదే విధంగా రాబోయే సంవత్సరం జూలై నెలలో నిర్వహించే పుష్కరాలను పురస్కరించుకుని డివిజన్లోని యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ మౌలిక సౌకర్యాల కల్పన, తీసుకోవలసిన చర్యలను, జరగవలసిన నిర్మాణాలు విషయమై వివిధ శాఖల అధికారులతో ప్రతివారం సమీక్షలు నిర్వహించి అప్రమత్తం చేస్తున్నారు. ఈ విషయాలను విశాలాంధ్ర ప్రతినిధి ఆమె ముందు ప్రస్తావించగా కుటుంబంలో ప్రతి గృహిణికి ఎంత బాధ్యత ఉంటుందో అదేవిధంగా సమాజంలో అధికారిణిగా అంతే బాధ్యత ఉంటుందన్నారు. సమాజంలో ప్రజలకు సేవ చేయటం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆర్డీవో రాణి సుస్మిత పేర్కొనడం ఆమె నిబద్ధతకు నిలువుటెత్తు అద్దంలా ఉందని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనే చెప్పవచ్చు.


