–బ్యాళ్లు, మంచి నూనె మాయం
–కోడిగుడ్లు ధ్వంసం
విశాలాంధ్ర, ఆస్పరి (కర్నూలు జిల్లా) : మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రం-2లో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. తాళాలు పగలగొట్టి 26 కేజీల బ్యాళ్లు, 7 లీటర్ల మంచి నూనె ప్యాకెట్లను దొంగలించారు. అలాగే, కేంద్రంలోని కోడిగుడ్లను కూడా పగలగొట్టినట్లు తెలిసింది. సోమవారం ఈ సంఘటన వెలుగులోకి రాగా, అంగన్వాడి టీచర్ నాగేంద్రమ్మ, ఐసిడిఎస్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ రాజు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మండల కేంద్రంలో గత కొంతకాలంగా దొంగతనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాత్రి వేళల్లో ఇళ్లు, ఆలయాలు, మోటార్ సైకిళ్లతో పాటు ఇప్పుడు అంగన్వాడి కేంద్రాలు కూడా దొంగల లక్ష్యంగా మారాయి. అయితే మరో కోణం కూడా ఉంది. అంగన్వాడి కేంద్రాలలో పని చేస్తున్న టీచర్లుకు కేంద్రాల నిర్వహణ విషయంలో ఒకరికొకరికి మనస్పర్ధలు ఉన్నాయని, వారిలోనే కొందరికి సరిపడక ఇలాంటి ఘటనలు జరిగి ఉండవచ్చని కూడా స్థానికులు అనుమానిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పోలీసు గస్తీని బలోపేతం చేయాలని, దొంగతనాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ప్రజలు కోరుతున్నారు.


