మెనూ పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక
విశాలాంధ్ర- ఆస్పరి (కర్నూలు జిల్లా) : మండలంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మంగళవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాలలో పలు రికార్డులు, హాస్టల్ కిచెన్‌ను, స్టాక్ రిజిస్టర్‌ను, మెనూ బోర్డును పరిశీలించారు. పరిశీలించిన సమయంలో విద్యార్థినులకు అందించాల్సిన భోజన మెనూలో తేడా ఉండటంతో ప్రిన్సిపాల్ చారున్ స్మైలి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల ఆరోగ్యం, పోషకాహారం విషయంలో ఎట్టి రాజీపడరాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన మెనూని ఒకరోజు కూడా మార్చే హక్కు ఎవరికీ లేదని వెంటనే సరిచేసుకోకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు. అదే సమయంలో విద్యార్థినులకు శుభ్రత, తాగునీరు, వసతి వంటి సదుపాయాలు సరైన రీతిలో అందుబాటులో ఉన్నాయా లేదా అన్నది కూడా పరిశీలించారు. లోపాలు ఉన్న చోట్ల వెంటనే మెరుగులు పర్చాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సచివాలయం -1 ను ఆకస్మిక తనిఖీ చేశారు. కొంతమంది సచివాలయ ఉద్యోగులు ఆన్‌లైన్ హాజరులో ఆలస్యంగా చేరినట్లు కలెక్టర్ గమనించారు. విధులకు ఆలస్యంగా వస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.ప్రజలకు ఏలాంటి అంతరాయం లేకుండా మెరుగైన సేవలు అందుతున్నాయో లేదో నిర్ధారించేందుకు, సచివాలయాలపై నియమితంగా ఆకస్మిక తనిఖీలు చేయాలని, సిబ్బంది పనితీరును నిశితంగా పర్యవేక్షించాలని కలెక్టర్ ఎంపీడీఓ గీతావాణి ని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో శ్యాముల్ పాల్, తాసిల్దార్ రామేశ్వర్ రెడ్డి, ఎంఈఓ రాజేంద్రప్రసాద్, సర్పంచ్ మూలింటి రాధమ్మ, రెవెన్యూ సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
తాగునీటి సమస్యను పరిష్కరించండి
కలెక్టర్ కు సిపిఐ వినతి
మండలంలో నెలకొన్న త్రాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి కి సిపిఐ మండల సహాయ కార్యదర్శి రమేష్, నాయకులు శేఖర్, సురేష్ లు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో త్రాగడానికి నీరు లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అవేదన వ్యక్తం చేశారు. ఆస్పరి మండలంలో భవిష్యత్తులో త్రాగునీటి సమస్య తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరారు.


