మార్కాపురం జిల్లాకు 10 వేల కోట్ల ప్యాకేజీ డిమాండ్ …సిపిఐ పిలుపు
విశాలాంధ్ర, పామూరు: నూతన మార్కాపురం జిల్లా సమగ్రాభివృద్ధికి 10 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని, జిల్లాను తీవ్ర కరువు జిల్లాగా ప్రకటించాలని సిపిఐ డిమాండ్ చేసింది.ఆగస్టు 11వ తేదీన కనిగిరిలో జరిగే సిపిఐ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ పామూరు మండల కార్యదర్శి పాలపర్తి మస్తాన్ రావు పిలుపునిచ్చారు.గురువారం పామూరు పట్టణంలో సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పాలపర్తి మస్తాన్ రావు మాట్లాడుతూ దశాబ్దాల పోరాటాల ఫలితంగా 2025 డిసెంబర్ 31న నూతన మార్కాపురం జిల్లా ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా ఇంకా ప్రభుత్వ అధికారుల నియామకాలు జరగలేదని తెలిపారు. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి అనే 4 వెనుకబడిన నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటు చేసినా అభివృద్ధికి నిధులు కేటాయించలేదని ఆరోపించారు.జిల్లా కార్యవర్గ సభ్యులు సయ్యద్ మౌలాలి మాట్లాడుతూ జిల్లా వరప్రదాయిని పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు 30 సంవత్సరాలుగా నిర్మాణంలో ఉందని, 2026 జూలై 1కి నీరు ఇస్తామని సీఎం నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ నెరవేరలేదని అన్నారు. ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పరిష్కరించలేదని, 2025 డిసెంబర్ నాటికి 18 ఏళ్లు నిండిన యువతకు ఆర్ అండ్ ఆర్ వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పూర్తికి 4 నుండి 5 వేల కోట్లు అవసరమైనా ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని విమర్శించారు.ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక మార్కాపురం జిల్లాలోని 21 మండలాల్లోనూ తీవ్ర కరువు ఛాయలు ఉన్నాయని, వెంటనే జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల విద్య, వైద్యం, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధి లేక ఉపాధి లేక వలసలు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లా కార్యవర్గ సభ్యులు పోతల ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి 10 వేల కోట్ల ప్యాకేజీ, రైతులకు గిట్టుబాటు ధర, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ విద్యాసంస్థలు, మార్కాపురం మెడికల్ కాలేజీని ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించాలని, చెరువులన్నింటినీ వెలుగొండ ప్రాజెక్టు పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు. సిపిఐ మార్కాపురం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆగస్టు 6 నుండి 15 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రచార, పాదయాత్రలు జరుగుతున్నాయని, ఆగస్టు 11 సాయంత్రం 4 గంటలకు కనిగిరిలో జరిగే ప్రదర్శన, బహిరంగ సభ ను జయప్రదం చేయాలని కోరారు. వజ్రాల సుబ్బారావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ఎన్డీఏ కూటమి ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ మార్పు కావాలి అనే నినాదంతో సెప్టెంబర్ 1న ఛలో ఢిల్లీ కార్యక్రమానికి ప్రజలు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో వజ్రాల సుబ్బారావు, పేరం రఘునాథరెడ్డి, ఇర్రి. వెంకటరెడ్డి, ఇర్రి. హజరత్ రెడ్డి, చలివేంద్ర. సుబ్బారావు, రాగిపాటి .సూరిబాబు, ప్రసాద్, కిషన్ సింగ్, మహేష్, సురేష్, దేవకుమార్, రమణయ్య, మల్లికార్జున, అంజి, మాల కొండయ్య, ఆదిలక్ష్మి ,మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.


