రిజిస్ట్రార్ రమణారావు వెంటనే సస్పెండ్ చేయాలి
సీపీఐ నగర కార్యదర్శి ఎన్. శ్రీరాములు డిమాండ్
విశాలాంధ్ర- అనంతపురం : అధికారుల అండతో అనంతపురం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఎమ్మెల్యే బావమరిది బహిరంగ అవినీతి బయటపడడంతో అందుకు సంబంధించిన రిజిస్ట్రార్ రమణారావు వెంటనే సస్పెండ్ చేయాలని సిపిఐ నగర కార్యదర్శి ఎన్ శ్రీరాములు డిమాండ్ చేశారు. రిజిస్ట్రార్ రమణారావును వెంటనే విధుల నుండి తొలగించాలని బుధవారం సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో రాంనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాకు నగర సహాయ కార్యదర్శి రమణ అధ్యక్షత వహించగా నగర కార్యదర్శి ఎన్. శ్రీరాములు మాట్లాడుతూ… అనంతపురం సాయి నగర్ ఆరవ క్రాస్‌లో ఉన్న ఆస్త్ర హాస్పిటల్ భవనాన్ని బోనాల సుమీయ బోనాల షరీఫ్‌లు మార్చి 26, 2024 సం రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, కొనుగోలు అనంతరం ఆ భవనం కరెంట్ బిల్లులు, మునిసిపల్ రికార్డులు, అలాగే మ్యాక్స్ సొసైటీ బ్యాంకులో ₹85 లక్షల రుణం కూడా వారి పేరుమీద మంజూరైనట్లు తెలిపారు. అనంతపురం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారులు కాసుల ఆశతో నిబంధనలకు విరుద్ధంగా, అదే ఆస్తిని మళ్లీ మే 3, 2025న కుంటిమద్ది శివ పేరుమీద డబుల్ రిజిస్ట్రేషన్ చేసినట్టు వెల్లడించారు.
ఇది బహిరంగ అవినీతి చర్య అని ఆయన తీవ్రంగా ఖండించారు.
గత ప్రభుత్వ కాలంలో ఐఏఎస్, ఐపిఎస్ ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అవినీతికి పాల్పడి ఈ రోజు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారనీ, అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతిని వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. అనంతపురం ఎమ్మెల్యే కుటుంబ సభ్యుడు బావమరిది అశోక్ చేతిలో రిజిస్ట్రేషన్ కార్యాలయం నడుస్తున్నది అన్న అనుమానం ప్రజల్లో పెరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమ డబుల్ రిజిస్ట్రేషన్‌ను వెంటనే రద్దు చేయాలన్నారు. ఈ అవినీతిలో పాలుపంచుకున్న రిజిస్ట్రార్ రమణారావు మరియు సంబంధిత సిబ్బందిపై విధుల నుండి తొలగించాలని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో అనంతపురం నగరంలో ఇటువంటి డబుల్ రిజిస్ట్రేషన్లు మళ్లీ జరగకుండా ఉన్నతాధికారులు సమగ్ర చర్యలు చేపట్టాలన్నారు. అవినీతిని ప్రోత్సహిస్తున్న అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకు పోవడం జరుగుతుందన్నారు. అనంతరం రిజిస్టర్ కార్యాలయంలో ఉన్న ఉన్నతాధికారికి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఉన్నతాధికారి స్పందిస్తూ ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని పేర్కొన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పద్మావతి, కార్యవర్గ సభ్యులు లింగామయ్య, నగర సహాయ కార్యదర్శులు రమణ, , నగర కార్యవర్గ సభ్యులు అల్లిపీర, ఏల్లుట్ల, నారాయణస్వామి, చందుభాష, ఖాజా గౌశల్ వార్, జానకి, యశోదమ్మ, వరలక్ష్మి, ఏ ఐ వై ఎఫ్ నగర కార్యదర్శి శ్రీనివాస్, మంజునాథ్, మున్న, సుందరరాజు, ఆచారి, ఖాజా తదితరులు పాల్గొన్నారు.


