విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని నిమ్మలకుంటలో గల జాతీయ అవార్డు గ్రహీత ధలవాయి చలపతిని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ అభినందించారు. ఈ సందర్భంగా వారు తొలుత నిమ్మలకుంటలోని ఎండోమెంట్ పొలమును వారు పరిశీలించారు. వర్షపు నీరును నిల్వ చేస్తూ 12 సంవత్సరాలుగా 20 ఎకరాలలో చింత చెట్లు పెంపుదల పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం దలవాయి చలపతి స్వగృహానికి స్వయంగా జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ తో పాటు ఆర్డీవో మహేష్ వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా దళవాయి చలపతి తోలుబొమ్మలాట కళాకారుడిగా చేసిన సేవలను వారు స్వయంగా తెలుసుకొని, అభినందించారు. అంతేకాకుండా తోలుబొమ్మలాటకు కావలసిన అనేక చిత్రాలను వారు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఇటువంటి ప్రతిభా కలిగిన దలవాయి చలపతి ధర్మవరం మండలంలో ఉండడం నిజంగా శుభ సూచకమన్నారు. రాష్ట్ర, జిల్లా, జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులను పొంది జిల్లాకు మంచి గుర్తింపు తేవడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. అనంతరం తోలుబొమ్మలాట గూర్చి కొన్ని విషయాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీ ఉపాధిని మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వంతో చర్చించడం జరుగుతుందని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో తో పాటు సిఎస్డిటి ఈశ్వరయ్య పాల్గొన్నారు.
…ప్రజలకు వైద్య సేవలు అందేలా కృషి చేయాలి.. శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్.
ప్రజలకు వైద్య సేవలు అందేలా కృషి చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధర్మవరం మండల పరిధిలోని నిమ్మలకుంట గ్రామంలో గల ఆయుష్మాన్ భారత్ హెల్త్ సెంటర్ ను వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ఒక ఆశా కార్యకర్త తప్ప ఎవరు లేకపోవడంతో, డాక్టరు ఎక్కడ వెళ్లారు? మిగిలిన సిబ్బంది ఎక్కడికి వెళ్లారు? అని అడిగారు. ఆశా కార్యకర్త పొంతనలేని సమాధానం చెప్పడంతో సున్నితంగా మందలించారు. ఆసుపత్రి సిబ్బంది బయటికి వెళ్లినప్పుడు సమాచారాన్ని బయట ఓ నోటీసు ద్వారా ప్రజలకు తెలియజేసేలా ఉండాలని సూచించారు. అనంతరం అక్కడ గల అపరిశుభ్రత పట్ల కలెక్టర్ అసహనానికి గురయ్యారు. పరిశుభ్రత పాటిస్తూ, గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మహేష్ తదితరులు పాల్గొన్నారు.


