బంగారం, వెండి ధరలు రోజురోజుకీ పెరుగుతూ కొత్త రికార్డులను అధిగమిస్తున్నాయి. ఇప్పటికే రూ.లక్షన్నర దాటిన మేలిమి (24 క్యారెట్లు) బంగారం 10 గ్రాముల ధర (gold ) బుధవారం మరింత పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో నేటి ఉదయం 11.45 గంటల సమయంలో పసిడి ధర ఏకంగా రూ.1.61 లక్షలు పలికింది. క్రితం రోజుతో (రూ.1,52,800) పోలిస్తే దాదాపు రూ.9వేలు పెరగడం గమనార్హం. ఇక, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,900కు చేరింది.మరోవైపు, వెండి (Silver ధరకూడా దూసుకెళ్తోంది. నేటి మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.3,30,000గా ఉంది. క్రితం రోజుతో పోలిస్తే ఇవాళ వెండి ధర దాదాపు రూ.14వేలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ లోహాల ధరలు జోరుగా పెరుగుతున్నాయి. ఔన్సు వెండి ధర చరిత్రలో తొలిసారి 94 డాలర్ల మార్క్‌ను దాటి పయనిస్తోంది. ఇక ఔన్సు బంగారం ధర 4,849 డాలర్లను చేరింది. గ్రీన్‌లాండ్ స్వాధీనానికి, గాజా శాంతిమండలిలో సభ్యత్వానికి సహకరించడం లేదంటూ ఐరోపా దేశాలపై, ఫ్రాన్స్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీ సుంకాలను ప్రకటించారు. దీంతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు పెరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండిని మదుపర్లు సురక్షిత పెట్టుబడి సాధనాలుగా భావించడంతో వీటి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు కొత్త ఇంధన రంగాలు, విద్యుత్తు వాహనాల తయారీ రంగాల నుంచి వెండికి గిరాకీ అంతకంతకూ పెరుగుతుండడంతో దానికి విపరీతంగా డిమాండ్ ఏర్పడింది.


