. ఉత్తమ సేవలందించిన మహిళా ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు
. స్వయం సహాయక సంఘాలకు రుణాలు పంపిణీ
. నియోజకవర్గ స్థాయిలో కూడా మహిళా దినోత్సవ వేడుకలు
. మహిళా దినోత్సవానికి విస్త్రృత ఏర్పాట్లు
. అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
విశాలాంధ్ర – ఏలూరు: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఏర్పాట్లపై గురువారం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ
ఈ నెల 8వ తేదీన ఏలూరు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా మరియు నియోజకవర్గ స్థాయిలలో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారులు తమ నియోజకవర్గంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించేలా ఏర్పాట్లను పర్యవేక్షించాలన్నారు. డిఆర్డిఏ , జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆద్వర్యాన వివిధ శాఖల సమన్వయంతో ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. వేడుకలు నిర్వహించే ప్రాంగణంలో వివిధ శాఖల ఆద్వర్యంలో స్టాల్స్ ను ఏర్పాటు చేయాలన్నారు. వివిధ శాఖలు స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేయాలన్నారు. మహిళల్లో చైతన్యం కలిగించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. దీనికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. జిల్లాలో వివిధ రంగాలలో స్వచ్చంద సేవలందిస్తున్న మహిళలు, వివిధ శాఖలలో ఉత్తమ సేవలందిస్తున్న మహిళా ఉద్యోగినులకు ప్రశంసా పత్రాలు అందించాలన్నారు. వివిధ రంగాల్లో సత్తాచాటుతున్న మహిళలను సన్మానించాలన్నారు. మహిళా దినోత్సవ కార్యక్రమాలలో మహిళల హక్కులు, మహిళల భద్రతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తెలియజేయాలన్నారు. మహిళల రక్షణకు ఉద్దేశించిన శక్తీ యాప్ వంటి వాటిపై మహిళలకు అవగాహన కలిగించాలన్నారు. మహిళలకు హెల్త్ చెకప్ శిబిరాన్ని ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా క్యాన్సర్ స్క్రీనింగ్ కు సంబంధించిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. న్యూట్రిషన్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలన్నారు. మహిళా దినోత్సవ కార్యక్రమంలో మహిళలతోపాటు వివిధ శాఖల జిల్లా అధికారులందరూ తప్పక హాజరు కావాలని సూచించారు.
సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, డిఆర్డిఏ పిడి విజయలక్ష్మి , ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ . భాను ప్రతాప్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. శోభ, ఐసిడిఎస్ పిడి పి. శారద, జిల్లా బి.సి. సంక్షేమ అధికారి ఆర్.వి. నాగరాణి, మెప్మా పీడీ రాజా బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


