విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : పులికనుమ ప్రాజెక్టు ద్వారా ఎల్లెల్సీ కి మూడు, నాలుగు రోజుల్లో సాగునీరు విడుదల చేసి కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని డిస్ట్రిబ్యూటరీ చైర్మన్, టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం పొట్ట దశలో ఉన్న రబీ పంటను కాపాడుకోవడానికి సాగునీరు ఎంతో అవసరమని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అధికారులతో మాట్లాడి మూడు, నాలుగు రోజుల్లో పులికనుమ ప్రాజెక్టు నీరును రైతులు అవసరానికి విడుదల చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈనెల 28న సాగునీటి సంఘం అధ్యక్షులకు, డిస్ట్రిబ్యూటరీ అధ్యక్షులకు ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న నిబద్ధత అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులను గానీ, సాగునీటి సంఘాలను గానీ, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలుగానీ పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. త్వరలో పులికనుమ ప్రాజెక్టు ద్వారా ఎల్లెల్సీకి సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకుంటామన్నారు.


