నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కారమే ప్రజాదర్బార్ లక్ష్యం.
అనపర్తిలో ప్రజా దర్బార్ లో 75 ఫిర్యాదులు స్వీకరించిన ఎమ్మెల్యే నల్లమిల్లి.
విశాలాంధ్ర – అనపర్తి : అనపర్తి నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అనపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికగా “ప్రజా దర్బార్” కార్యక్రమాన్ని శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఉదయం 10 గంటల నుంచి రెండు గంటల్లో 75 పిర్యాదులు ప్రజలు సమర్పించారు.ఈ సందర్భంలో ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ— జీబీర్ కాలేజ్ యాజమాన్యం ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ భూముల ఆక్రమణకు సంబంధించిన నోటీసులను నాలుగు నెలలుగా తప్పించుకుంటోందని, దీనిపై వచ్చిన పిర్యాదును ఆర్డీవో, కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. గాంధీ బొమ్మ సెంటర్ ఐ ఎల్ టి డి రోడ్ వరకు ఉన్న ప్రాంతంలో రహదారి ఆక్రమణపై వచ్చిన ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వ భూములను గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేక చోట్ల ఆక్రమణకు అనుమతించిందని, ఇప్పుడు వాటిని ప్రభుత్వ పరంగా మార్చడంపై కొంతమంది సందేహాలు వ్యక్తం చేయడం విచిత్రమనిపేర్కొన్నారు.వైద్యరంగం,విద్యారంగం ప్రైవేటీకరణపై కొంతమంది ఇచ్చే ఉపన్యాసాలు పాక్షికమని, గతంలో రైతుల విరాళాలతో నిర్మించిన కాలేజీని యేసార్సీపీ ప్రభుత్వం ప్రైవేటీకరించిందని గుర్తుచేశారు. ప్రైవేట్ వైద్యం గురించి విమర్శలు చేసే వారు స్వయంగా ప్రైవేట్ వైద్య సేవల్నివినియోగించుకుంటున్నారని కూడా ప్రశ్నించారు. ఈరోజు వచ్చిన ప్రతి సమస్యను దశలవారీగా పరిశీలించి, సంబంధిత అధికారులతో చర్చించి, ఫిర్యాదుదారులకు తిరిగి సమాచారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి అన్ని ఫిర్యాదులు పంపబడతాయని, త్వరితగతిన పరిష్కారం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి, అనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ జుత్తుగా సూర్య కుమారి, అనపర్తి సొసైటీ అధ్యక్షులు కొవ్వూరి శ్రీనివాస్ రెడ్డి, వెలుగుబంటి సత్తిబాబు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అనపర్తి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సిరిసపల్లి నాగేశ్వరరావు , నాలుగు మండలాల అధికారులు, కూటమి ప్రతినిధులు పాల్గొన్నారు.


