లేపాక్షి, విశాలాంధ్ర: దేశంలో కార్మికులు, రైతులు, పేదల ప్రయోజనాలను విస్మరించి పెట్టుబడిదారీ విధానాలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. లేపాక్షిలో సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన మూడు రోజుల రాజకీయ–సైద్ధాంతిక శిక్షణా తరగతుల ముగింపు సమావేశంలో బుధవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈశ్వరయ్య మాట్లాడుతూ, రైతుల ఆత్మహత్యలను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. గత పన్నెండు ఏళ్ళ మోడీ పాలనలో 1.42 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సగటున 31 మంది రైతులు అప్పుల భారంతో ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంటూ, ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయాన్ని “పండుగ”గా అభివర్ణించడం బాధ్యతారాహిత్యమన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణా, కేరళ ప్రాంతాలలోని నదుల అనుసంధానం ద్వారా కోట్ల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. మరోవైపు, ప్రైవేటు కంపెనీలకు భూములు కేటాయించడం వల్ల ఖనిజాలు, ఇసుక, ఇనుము, మట్టి మాఫియాలు విజృంభిస్తున్నాయని ఆరోపించారు.గ్యాస్ ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య, ప్రైవేటీకరణ విధానాలు, బ్యాంకు రుణ ఎగవేతలు, చిన్న వ్యాపారులపై పెరుగుతున్న భారం వంటి అంశాలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలను ఆయన తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే రాజకీయ పార్టీలపై కేసులు నమోదు చేసి ఒత్తిడి తీసుకురావడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.అయోధ్య రామాలయ నిర్మాణం, ఆలయంలో జరిగిన దొంగతనాల అంశాలను ప్రస్తావిస్తూ పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తారు. అలాగే రైల్వే శాఖలో గేట్‌మన్ ఉద్యోగాలకు కూడా ఉన్నత విద్యావంతులు పోటీ పడుతున్న పరిస్థితి దేశంలోని నిరుద్యోగ తీవ్రతకు నిదర్శనమని పేర్కొన్నారు.రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం బీజేపీ అజెండాను అమలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కంటే రాజకీయ ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు.శతాబ్ద కాలంగా ప్రజల కోసం పోరాడుతున్న భారత కమ్యూనిస్టు పార్టీని మతోన్మాద శక్తులు భయపెట్టలేవని స్పష్టం చేసిన ఈశ్వరయ్య, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.సమావేశం అనంతరం శిక్షణా తరగతుల్లో పాల్గొన్న సుమారు 500 మంది కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి. జగదీష్, రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య, రాష్ట్ర మహిళా సమాఖ్య నాయకురాలు పద్మావతమ్మ, జిల్లా కార్యవర్గ సభ్యులు కనిశెట్టిపల్లి వినోద్‌కుమార్, శివప్ప, మధు, మండల కార్యదర్శి గౌతమ్‌కుమార్, జిల్లా నాయకురాళ్లు సంపూర్ణమ్మ, సామీరా, ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు నరసింహమూర్తి, మహేంద్ర, రాజా, గోవిందప్పతో పాటు సీపీఐ జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.
కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోదీ ప్రభుత్వం : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
- Advertisement -
RELATED ARTICLES


