విద్యార్థులకు సరైన పౌష్టిక ఆహారం అందేలా చూడాలి
సమీక్షా సమావేశంలో సీఎం.రేవంత్ రెడ్డి
విశాలాంధ్ర – హైదరాబాద్ :: రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పూర్తిస్థాయి డేటాతో సంక్షేమ హాస్టళ్ల వ్యవస్థలో అకౌంటబిలిటీ ఉండేలా చర్యలు చేపట్టాలని సీఎం అధికారులకు సూచించారు. సోమవారం వివిధ సంక్షేమ విభాగాల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ హాస్టళ్లలో విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని పూర్తిగా ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ పరిధిలోకి తీసుకురావాలని పేర్కొన్నారు. విద్యార్థులకు అందించే భోజనం క్వాలిటీ చెక్ కు టెక్నాలజీని ఉపయోగించుకోవాలని తెలిపారు. విద్యార్థులకు సరైన పోషకాలతో కూడిన పౌష్టిక ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. హాస్టళ్లలో విద్యార్థులకు అందించే దుస్తులు, పుస్తకాలు వారికి చేరుతున్నాయో లేదో ధ్రువీకరించాలని సూచించారు. మౌలిక వసతులకు సంబంధించి ప్రతీ హాస్టల్ లో పరిస్థితులపై పూర్తిస్థాయి డేటాను అప్పటికప్పుడు ఆన్ లైన్ లో అప్డేట్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక విధానం అనుసరించాలని తెలిపారు. ఇందుకు సంబంధించి ఏరియలవారీగా హాస్టళ్లను సమీపంలో ఉన్న మెడికల్ కళాశాలలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ తో లింక్ చేయాలన్నారు. తరచూ హాస్టళ్లను సందర్శించి హెల్త్ చెకప్స్ చేసేలా చూడాలని, రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి.. ప్రతీ నెలా గ్రీన్ ఛానల్ లో నిధులు అందించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి.లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ హాస్టళ్ల పై ప్రత్యక దృష్టి పెట్టాలి
- Advertisement -


