వజ్రకరూరు తహశీల్దార్ జయశ్రీ
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని వజ్రకరూరు. తహశీల్దార్ జయశ్రీ తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహశీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. గత నెలలో 8 కొత్త అర్జీలు ఆన్లైన్లో నమోదయ్యాయని, 13 అర్జీలను పరిష్కరించినట్లు తెలిపారు. పరిష్కరించిన వాటిలో 10 భూ సమస్యలు, 3 ఇతర సమస్యలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం 24 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిలో 12 భూ సమస్యలు, 2 ధ్రువీకరణ పత్రాలు, 4 పట్టాదారు పాస్‌పుస్తకాల మంజూరు, 4 ఇతర సమస్యలు, 2 ఇంటి పట్టాల మంజూరుకు సంబంధించినవి ఉన్నాయని వివరించారు. అర్జీ స్వభావాన్ని బట్టి 75 నుంచి 105 రోజుల వరకు పరిష్కార గడువు ఉంటుందని తెలిపారు. పరిష్కరించిన అర్జీలపై జిల్లా కలెక్టర్ కార్యాలయ కాల్‌సెంటర్ ద్వారా లబ్ధిదారులను సంప్రదించి సమస్య పూర్తిగా పరిష్కారమైందా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తారని పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కాని పక్షంలో సంబంధిత అర్జీని గుంతకల్లు ఆర్డీవోకు సిఫారసు చేసి తగిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ జయశ్రీ తెలిపారు. మండల ప్రజలు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.


