జిల్లాలో అధిక సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి అంటూ ప్రకటిస్తున్న పశుసంవర్ధక శాఖ అధికారులు.
తాజాగా జిల్లా పశు వైద్యాధికారి ప్రకటన.
బయో సేఫ్టీ పాటించాలి.
జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ వెల్లడి.
విశాలాంధ్ర – కొవ్వూరు : పౌల్ట్రీ రంగాన్ని వింత వ్యాధులు వెంటాడుతున్నాయా.. ఆ రంగానికి చెందిన రైతులకు కష్టాలు తప్పడం లేదా. తూర్పుగోదావరి జిల్లాలో అధిక సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయా.. తాజాగా జిల్లా పశు వైద్యాధికారి సంచలన ప్రకటన పరిశీలిస్తే పై ప్రశ్నలకు అవును అనే సమాధానం వస్తున్నట్లుగా ఉంది. శనివారం జిల్లా పశు వైద్యాధికారి టి శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన సారాంశం ఏమిటంటే జిల్లాలో చాలా చోట్ల కోళ్లు ఎక్కువ సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయని ఆ ప్రకటన సారాంశం. ఈ నేపద్యంలో కోళ్ల రైతులు, వ్యాపారస్తులు బయో సేఫ్టీ పద్ధతులను అవలంబించాలని సదరు వైద్యాధికారి సూచించారు. సీజనల్ వ్యాధులుగా చెబుతున్నప్పటికీ కోళ్ల రైతులు, వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం తో పాటు ఎప్పటికప్పుడు పశువైద్యాధికారులను సంప్రదించటం మేలైన పద్ధతిగా కనిపిస్తోంది.
ముందు నిర్లక్ష్యం.. తర్వాతే ఉరుకులు.. పరుగులు.. ఈ మధ్య కాలంలో బర్డ్ ఫ్లూ వ్యాధి విజృంభించడంతోపౌల్ట్రీ రంగం కుదేలైంది. అలాగే కోళ్ల వ్యాపారస్తులు కూడా తీవ్ర స్థాయిలో నష్టపోయారు. ఇప్పుడు మరలా పశు వైద్యాధికారులు ఇలా ప్రకటించడంతో వారు మరింత బెంబేలెత్తుతున్నారు. చాలా మంది కోళ్ల మాంసం వ్యాపారులు తమ దుకాణాల వద్ద పదుల సంఖ్యలో కోళ్లను వచ్చి వ్యాపారం చేస్తున్నారు. అయితే ఆ కోళ్ల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని వినియోగదారులు చెబుతున్నారు. మరికొన్ని చికెన్ సెంటర్ల వద్ద అయితే అక్కడే కోళ్ళని పెంచి, మేత వేస్తూ వచ్చిన వినియోగదారులకు అప్పటికప్పుడు కోడి మాంసాన్ని అందిస్తున్నారు. అయితే ఈ చికెన్ సెంటర్లు గతంలో నివాసాలకు దూరంగా, వ్యాపార సముదాయాలకు దూరంగాను నిర్వహించేవారు. ఇప్పుడైతే నివాసాలు వ్యాపార సముదాయాలు అనే తేడా లేకుండా ఎక్కడికి అక్కడే సెంటర్లు ఏర్పాటు చేసి మాంసం విక్రాయాలు చేస్తున్నారు. అలాగని మున్సిపల్ అధికారులు గానీ, పశుసంవర్ధక శాఖ అధికారులు కానీ వీటి వంక చూసిన పాపాన పోలేదు. దీంతో వ్యాపారస్తులు ఏమి అమ్ముతున్నారో, వినియోగదారులు తాము ఎటువంటి మాంసాన్ని తీసుకెళ్తున్నామో తెలియని పరిస్థితి నెలకొంది. ఏరా ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు మాత్రమే చికెన్ తినడం మానేస్తున్నారు. మరలా కొద్ది రోజులు తర్వాత షరా మామూలు అన్న చందాన పరిస్థితి తయారవుతుంది. అందువల్ల పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రకటనలు చేసినప్పుడు సదరు స్థానిక సంస్థల అధికారులు కూడా పర్యవేక్షించి మాంసవినియోగదారులు అనారోగ్యానికి గురవకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మాంసాహారు లు చెబుతున్నారు.


