పోరాట తత్వమే ఆయన పుట్టి ముంచిందా..
కాలయాపనలో కొవ్వూరు ఇన్చార్జ్ నియామకం..
స్థానిక ఎన్నికల సమరానికి సిద్ధపడుతోందా?
విశాలాంధ్ర – కొవ్వూరు : కొవ్వూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నదిలోకి గాని, సముద్రంలోకి గానీ ఒక పడవ వెళితే అది అక్కడ వాతావరణాన్ని తట్టుకునేలా దానికి తెరచాప కట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అటువంటిదే రాజకీయ పార్టీ అయినా, ఒక కుటుంబమైనా, లేక సమాజమైన ఒక దిశా నిర్దేశం లేకపోతే ఒక గమనం, లక్ష్యం ఉండదు. అదేవిధంగా రాష్ట్ర ప్రజల అభిమానాన్ని చూ రగున్న జనసేన పార్టీ కొవ్వూరు నియోజకవర్గంలో వెనుకబడి ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం అనేకవిధాలుగా ఉన్నా పార్టీకి నాయకత్వ లోపం ఉందన్న భావన పలువురులో వ్యక్తమవుతోంది. ఇటీవల వరకు కొవ్వూరు జనసేన ఇన్చార్జిగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్యే టీవీరామారావును ఆ పదవి నుంచి అధిష్టానం తొలగించింది. అయితే ఈయన చేసిన పొరపాటుగా చెబుతున్న అధిష్టానం పార్టీ కోసం నిరసన వ్యక్తం చేయటం ఏమిటని ప్రశ్నించింది. అయితే ఆయన మాత్రం పార్టీలో కార్యకర్తలకు తగిన అవకాశాలు లభించడం లేదు అన్నది ఆయన వాదనగా ఉంది. మొదటి నుంచి పోరాట తత్వమే.. కొవ్వూరు నియోజకవర్గం 2009లో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా మారింది. అప్పటివరకు జనరల్ నియోజకవర్గంగా ఉన్న రిజర్వుడ్ నియోజకవర్గంగా మారింది. దీంతో ఎస్సి వర్గాలకు చెందిన పలువురు నాయకులు టిడిపి టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ సమయంలో ఒక పేరు తెరమీదకు వచ్చింది. నా పేరే తానేటి వెంకట రామారావు, ఇలియాస్ టీవీ రామారావు. పుట్టుక రీత్యా అప్పటి పశ్చిమగోదావరి జిల్లా ( ఇప్పటి తూర్పుగోదావరి జిల్లా)కు చెందిన వ్యక్తిగా టీవీ రామారావు కొవ్వూరు టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ ప్రయత్నంలో అప్పటి టిడిపి జిల్లా అగ్రనేత, అప్పటిఎమ్మెల్యే కృష్ణ బాబు తో పాటు, స్థానిక నాయకుల మద్దతు కూడగట్టడంలో సఫలం చెందిన రామారావు రేసులో నిలబడి సీటును దక్కించుకున్నారు. అనంతరం 2009 ఎన్నికల్లో కొవ్వూరు నుంచి టిడిపి అభ్యర్థిగా ఇప్పటి శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు పై విజయం సాధించడంతో పార్టీ అధినేత చంద్రబాబు దృష్టిలో పడ్డారు. అప్పటినుంచి చంద్రబాబుకు విధేయుడుగా, పార్టీకి నిబద్ధుడిగా పేరు తెచ్చుకున్నారు. నిరసన వ్యక్తం చేయడంలో ప్రత్యేక తీరు.. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగా టీవీ ఆర్ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పార్టీ పరంగా పిలుపునిచ్చిన అది తూచా తప్పకుండా పాటించడం, ప్రభుత్వం, అప్పటి అధికార యంత్రాంగం కొవ్వూరు నియోజకవర్గానికి ఏమాత్రం అన్యాయం చేసిందనిఅనుకున్నా తాను నిరసనను ప్రత్యేక రీతిలో వ్యక్తపరిచేవారు. ఉదాహరణకు రాస్తారోకో అంటే అది ప్రధాన రహదారి అయినా, మరే రహదారి అయినా రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేయటం, అదేవిధంగా అధికార యంత్రాంగం పట్టించుకోకపోతే ఆయా అధికారుల కార్యాలయాల భవనాల పైభాగానికి వెళ్లి అధికారులు న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేయటం వంటి పద్ధతులను అవలంబించేవారు. దీంతో ఈయనను అప్పటి కర్నూల్ మేయర్ బంగి అనంతయ్యతో పోల్చేవారు. అనంతయ్య కూడా టిడిపి తరఫున కర్నూల్ మేయర్గా వినూత్న తరహాలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసనలు తెలిపేవారు. జనసేన లోను అదే శైలి..2014 ఎన్నికలలో వివిధ సమీకరణాల దృష్ట్యా టీవిఆర్ కు టిడిపి తరఫున కొవ్వూరుటికెట్టు లభించలేదు. 2024లో ఆయన జనసేనలో జాయిన్ కావడం, పొత్తులో భాగంగా కొవ్వూరు సీటు టిడిపికి దక్కింది. ఈ నేపద్యంలో ప్రస్తుత ఎమ్మెల్యే ముప్పుడి వెంకటేశ్వరరావు విజయానికి కృషి చేశారు. ఈ నేపథ్యంలో రామారావును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొవ్వూరు నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు. నామినేటెడ్ పోస్టుల్లో వెనుక పాటుతనం అంటూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో జనసేనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ టివిఆర్ నిరసనగలం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇదే సందర్భంలో మొన్న జరిగిన సొసైటీల చైర్మన్ లు, డైరెక్టర్లు భర్తీ విషయంలో నియోజకవర్గంలో 14 పదవులు ఉండగా తమ పార్టీకి మూడే పదవులు కేటాయించారని ఆరోపిస్తూ రోడ్డు కం రైల్వే వంతెన వద్ద జనసేన కార్యకర్తలతో రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ఇలా బహిరంగ నిరసన పద్ధతి సరికాదని పేర్కొంటూ జనసేన అధిష్టానం టీవీఆర్ ను కొవ్వూరు జనసేన ఇంచార్జ్ పదవి నుంచి తొలగించింది. దాదాపు ఇది జరిగి మూడు నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఇన్చార్జి పదవిపై జనసేన అధిష్టానం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్కంగా మారింది. స్థానిక సంస్థలకు సిద్ధపడుతోందా.. నాయకత్వ లోపంతో సతమతమవుతున్న కొవ్వూరు జనసేన జనవరి నెలలో జరగనున్న స్థానిక ఎన్నికలకు సిద్ధపడుతుందా లేదా అన్న ప్రశ్న ఆ పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లోనూ వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ జనవరిలో స్థానిక ఎన్నికలకు సిద్ధపడమని అధికారులకు ప్రభుత్వానికి తెలియపరచిన వేళ జనసేన అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అని పార్టీ క్యాడర్ ఎదురుచూస్తున్నారు. ఇన్చార్జి పదవి విషయమై అధిష్టానం తగిన నిర్ణయం తీసుకోవాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.


