విశాలాంధ్ర – కడియం: కడియం మండలం, జేగురుపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని, బీసీ కాలనీలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన ర్యాలి సత్యవతి కుటుంబాన్ని జేగురుపాడు సర్పంచ్ వై సతీష్ చంద్ర స్టాలిన్ తో కలిసి బుధవారం ఉదయం వైసీపీ జిల్లా జనరల్ సెక్రటరీ, మండల జెసిఎస్ అధ్యక్షులు తాడాల విష్ణు చక్రవర్తి పరామర్శించారు. తమ టీవీసీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున బాధిత కుటుంబానికి 25 కెజి ల బియ్యం, కొత్త దుస్తులు, ఐదువేల రూపాయల నగదు అందజేశారు. ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ నిరుపేదలైన బాధితుల ఇల్లు అగ్ని ప్రమాదంలో కాలి బూడిదవటం దురదృష్టకరమని, బాధితులు ధైర్యంగా ఉండాలని అన్నారు. భవిష్యత్తులో కూడా ఏ అవసరం వచ్చినా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. సర్పంచ్ స్టాలిన్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి తక్షణం సాయం అందేలా కృషి చేయాలని స్థానిక నాయకులకు విజ్ఞప్తి చేశారు. మంచి మనసుతో సాయం అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని స్వచ్ఛంద సంస్థలు సహాయం చేయడానికి ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేగురుపాడు ఎంపీటీసీ ఆకుల సుధాకర్, నాగిరెడ్డి మోహన్, అంగర రాజు, తోట వెంకన్న, కడియపు సావరం ఎంపిటిసి సాపిరెడ్డి దుర్గా కామేష్, కొత్తపల్లి శివాజీ, చిలుకూరి రామకృష్ణ, గణేశుల చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.


