– మంత్రి సత్యకుమార్ యాదవ్
విశాలాంధ్ర- ధర్మవరం: నీటి చౌర్యాన్ని అడ్డుకోవాలని ఉమ్మడి అనంతపురం జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. అవసరమైతే పోలీసు బందోబస్తును ఏర్పాటుచేసి, ధర్మవరం నియోజకవర్గంలోని చెరువులను నింపేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. జిల్లాల కలెక్టర్లతో మంత్రి సత్యకుమార్ మంగళవారం ఫోన్ ద్వారా మాట్లాడారు. ధర్మవరం నియోజకవర్గంలోని పీఏబీఆర్ (పెన్నా అహోబిలం బ్యాలెన్స్ రిజర్వాయర్) రైట్ కెనాల్ ద్వారా చెరువులను నింపే విషయమై వారితో చర్చించారు. సోర్స్ వద్ద 600 కూసెక్కులు విడుదల అవుతుండగా, మన్నీల వద్ద కు వచ్చే సరికి కేవలం 65 కుసెక్కేలే వస్తుందని, సంబంధిత అధికారులు ఏమి చేస్తున్నారని మండిపడ్డారు. ఇద్దరు కలెక్టర్లు దీనిపై సంయుక్త సమావేశం నిర్వహించుకుని సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఇప్పటికైనా వారబంది నిర్వహించి కింద ఉన్న గ్రామాలకు న్యాయం చేయాలన్నారు. పైన వాటర్ డైవర్షన్ జరుగుతున్నందున స్పెషల్ పోలీస్ లను బందోబస్త్ ఏర్పాటు చేసిన నీటి చౌర్యం ఆపాలని జిల్లా ఎస్పీకి తెలియజేశారు. సంబందిత శాఖల అధికారులు ధర్మవరం నియోజకవర్గంలో చెరువులను నింపేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ఆదేశించారు.


