న్యూదిల్లీ: ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అపాచీ హెలికాప్టర్లు భారత సైన్యం అమ్ములపొదిలో చేరాయి. అమెరికా నుంచి రావాల్సిన అత్యాధునిక ఏహెచ్-64ఈ అపాచీ హెలికాప్టర్లు మంగళవారం వాయు సేనకు అందాయి. తొలివిడతలో భాగంగా మూడు అపాచీ హెలికాప్టర్లు ఉత్తర ప్రదేశ్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నాయి. అమెరికా అంతరిక్ష సంస్థ బోయింగ్ అమెరికా నుంచి రవాణా విమానంలో వీటిని భారత్‌కు చేర్చింది. ఈ హెలికాప్టర్లను దేశ పశ్చిమ సరిహద్దులకు చేరువలోని రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో మోహరిం చనున్నారు. అపాచీ హెలికాప్టర్ల రాక ఇప్పటికే 15 నెలలు ఆలస్యం కాగా, ఈ ఏడాది చివరిలోగా మరో మూడు రానున్నాయి. గగనతలం నుంచి శత్రుమూకపై ఉరుము లేని పిడుగులా నిప్పులు కురిపించే ఈ హెలికాప్టర్ల చేరికతో భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. అమెరికా తయారీ అపాచీ హెలీకాప్టర్లు చేరికను భారత సైన్యం ఒక మైలు రాయిగా అభివర్ణించింది. ఇది భారత సైన్యం కార్యాచారణ సామర్థ్యాలను గణనీయంగా పెంచుతుందని ‘ఎక్స్’ లో చేసిన పోస్ట్‌లో పేర్కొంది.
ఎగిరే యుద్ధ ట్యాంకులు
ఎగిరే యుద్ధ ట్యాంకుగా పేరు పొందిన ఈ అపాచీ హెలికాప్టర్లు నింగిలో అద్భుత విన్యాసాలు చేస్తూ ప్రత్యర్థులను తికమక పెట్టగలవు. వీటిలో అధునాతన కమ్యూనికేషన్లు, నేవిగేషన్, సెన్సర్, ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి. శత్రువుపై గురితప్పకుండా ఆయుధ ప్రయోగం చేసేందుకు మోడర్నైజ్ టార్గెట్ అక్విజీషన్ డిజి గ్నేషన్ సిస్టమ్ దీనిలో ఉంది. రాత్రి పగలు అని తేడా లేకుండా శత్రుస్థావరాలపై దాడులు చేయడానికి ఇది సాయపడుతుంది. గంటకు గరిష్ఠంగా 279 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ హెలికాప్టర్లు దాదాపు 6 వేల మీటర్ల ఎత్తుకు ఎగరగలదు. ఆకాశం నుంచి భూమిపైకి హెల్ ఫైర్ క్షిపణులను, 70ఎంఎం హైడ్రా రాకెట్లును ప్రయోగించగలదు. అయితే భారత వైమానిక దళం వద్ద ఇప్పటికే 22 అపాచీ హెలికాప్టర్లు ఉన్నాయి. అదనంగా సైన్యం కోసం 600 మిలియన్ డాలర్ల వ్యయంతో ఆరు హెలికాప్టర్లను అమెరికా నుంచి కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో ఆమోదం తెలిపింది. తొలి విడతలో 3 హెలికాప్టర్లు భారత సైన్యానికి అందాయి.
సైన్యం అమ్ములపొదిలో ‘అపాచీ’
- Advertisement -


