అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
ఒమన్‌తో కుదురిన ‘హోర్మూజ్’ ఒప్పందం
ఖామేనీతో సమావేశం కష్టమే: పెజెష్కియాన్
తెహ్రాన్: ఇజ్రాయిల్, అమెరికా దాడులు ఆపకపోతే పశ్చిమాసియా అగ్నిగుండంగా మారుతుందని ఇరాన్ హెచ్చరించింది. హోర్మూజ్ జల సంధి విషయంలో ఒమన్‌తో అంగీకారానికి వచ్చినట్లు తెలిపింది. అమెరికా జోక్యం లేకుంటే సంయుక్త ప్రకటన త్వరలో వెలువడుతుందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ వెల్లడించారు. ఇదిలాఉంటే, చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించాలని, అణ్వాయుధాల తయారీకి అనుమతించబోమని ఇరాన్‌కు పశ్చిమాసియాలోని తాజా పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోమారు స్పష్టంచేశారు. వెనిజులా విధానాన్నే ఇరాన్‌లోనూ అమలు చేస్తున్నట్లు తెలిపారు. తమ చర్యలు ఫలించాయని, అమెరికాను ఇరాన్ గౌరవిస్తోందని చెప్పుకున్నారు. మరోవైపు తమ దేశాధినేత మొజ్తాబా ఖామేనీని కలుసుకోవడం, ఆయనతో సంప్రదింపులు జరపడం చాలా కష్టంగా మారిందని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ వ్యాఖ్యానించారు. ఆయన నాయకత్వమే దేశానికి బలమని చెప్పారు. మొజ్తాబాతో పెజెష్కియాన్ రహస్యంగా భేటీ అయ్యారని, అధినేత ముఖాన్ని కూడా ఆయన చూడలేదని కథనాలు వెలువడిన నేపథ్యంలో తాజా వ్యాఖ్యలకT ప్రాధాన్యత ఏర్పడింది. ఇరాన్‌ను చావుదెబ్బ తీయాలని శుత్రు దేశాలు ప్రయత్నిస్తున్నాయని, తమ సైన్యం తీవ్రంగా, సమర్థంగా ప్రతిఘటిస్తోందని పెజెష్కియాన్ అన్నారు. మొజ్తాబా కనిపించకపోయినాగానీ రాతపూర్వక ఆదేశాలు, ప్రకటనలు జారీ చేస్తుంటారని తెలిపారు. ప్రభుత్వానికి అవసరమైన దిశానిర్దేశం చేస్తారన్నారు. గతంలో సానుకూల చర్చలు జరిపినట్లు గుర్తుచేసుకున్నారు. ఉద్దేశపూర్వకంగా అభిప్రాయభేదాలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని పెజెష్కియాన్ ఆరోపించారు. భద్రతా వ్యవహారాలు, అణు చర్చల వంటి కీలక నిర్ణయాల్లో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ అహ్మద్ వహీదీకి ఖామేనీ మద్దతు ఇస్తున్నారని ప్రచారం జరిగింది. పెజెష్కియాన్ రాజీనామా చేస్తానని హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. ఈసారి అలాంటిదే జరిగితే అడ్డుకునేది లేదని ఖామేనీ తేల్చిచెప్పినట్లు ఇజ్రాయిల్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. మరోవైపు హోర్మూజ్ జల సంధి మార్గంలో సమన్వయం కోసం ఇరాన్, ఒమాన్ మధ్య ముసాయిదా ఒప్పందం కుదిరింది.ఈ ఒప్పందాన్ని తాత్కాలిక పరిష్కారంగా అధికారులు పేర్కొన్నారు. ఈ ఒప్పందం ప్రకారం పర్షియన్ గల్ఫ్‌లోకి ప్రవేశించే నౌకలు ఇరాన్ నియంత్రణలోని సముద్ర మార్గాన్ని వినియోగిస్తాయి. ఒమన్ అధీనంలోని మార్గం గుండా బయటకు వెళతాయి. భద్రతా ఏర్పాట్లు, సముద్ర పర్యావరణ పరిరక్షణ పేరుతో నౌకల నుంచి సేవా రుసుము వసూలు చేయాలన్న ఇరాన్ ప్రతిపాదనపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేస్తుండటం విదితమే.
ఆయుధాల కొరత…
హెగ్సెత్‌పై ట్రంప్ ఆగ్రహం
ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా క్షిపణి నిల్వలు తగ్గిపోతుండటంతో ట్రంప్ యంత్రాంగానికి ఆందోళన మొదలైంది. ఆయుధాల కొరతపై క్యాంప్ డేవిడ్‌లో జరిగిన కేబినెట్ సమావేశంలో అధ్యక్షుడు ట్రంప్ అసంతృప్తి వ్యక్తంచేశారు. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ను నిలదీశారు. క్షిపణి వ్యవస్థల కొరతపై తనకు పూర్తి సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ హెగెత్స్కు ట్రంప్ చీవాట్లు పెట్టారని ‘ది వాషింగ్టన్ పోస్ట్’ నివేదించింది. ఆయుధాల కొరత గురించి ట్రంప్‌కు తెలియకపోవడానికి తన సిబ్బంది కారణమని హెగ్సెత్ చెప్పారని, సహాయ మంత్రి స్టీఫెన్ ఫెయిన్బర్గకు బాధ్యత అప్పగించారని వార్తా కథనం వెల్లడించింది. క్రూయిజ్ క్షిపణులు, వైమానిక రక్షణ ఇంటర్సెప్టర్లు, వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణులను ఇరాన్ యుద్ధంలో అమెరికా విరివిగా ఉపయోగించిందని, ఫలితంగా కొరత ఏర్పడిందని పేర్కొంది. ఈ కథనాన్ని అవాస్తవ ప్రచారంగా శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ లీవిట్ కొట్టిపారేశారు. ట్రంప్‌కు, హెగ్సెత్కు మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలుగానీ ఘర్షణలుగానీ లేవన్నారు. ‘వార్త కథనం నిరాధారమైనది. హెగ్సెత్ను అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం జరుగుతోంది. హెగ్సెత్ అంటే ట్రంప్‌కు ఇష్టం. వారి మధ్య విభేదాలు లేవు’ అని లీవిట్ పేర్కొన్నారు. పెంటగాన్ ప్రతినిధి షాన్ పార్నెల్ కూడా అంతర్గత విభేదాల వార్తలను తీవ్రంగా ఖండించారు. వాషింగ్టన్ పోస్ట్ పనికిమాలిన వార్త ప్రచురించిందని మండిపడ్డారు. ఆయుధ సామగ్రి స్థితిపై తప్పదారి పట్టించలేదు’ అని పార్నెల్ పేర్కొన్నారు.


