Homeజిల్లాలుకర్నూలుఘనంగా జాతీయ గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలు

ఘనంగా జాతీయ గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలు

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామంలోని రేయిన్ బో ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాలలో కరస్పాండెంట్ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం జాతీయ గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ చిత్రపటానికి కరస్పాండెంట్ గోవిందరెడ్డి, ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, ఉన్నత పాఠశాల ఇన్ చార్జ్ పుల్లయ్య, ప్రాథమిక పాఠశాల ఇన్ చార్జ్ ఫ్రాన్సిస్, గణిత శాస్త్ర ఉపాధ్యాయులు నూర్, శ్రీరామ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ 1887, డిసెంబర్ 22న తమిళనాడులో జన్మించారని గుర్తు చేశారు. రామానుజన్ బ్రిటీష్ పరిపాలనా కాలంలో భారతదేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త అని, 20వ శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప గణిత మేధావులలో ఒకరుగా ఎదిగారన్నారు. శుద్ధ గణితంలో ఈయనకు శాస్త్రీయమైన శిక్షణ లేకపోయినా గణిత విశ్లేషణ, సంఖ్యా శాస్త్రం, అనంత శ్రేణులు, అవిరామ భిన్నాలు లాంటి గణిత విభాగాలలో విశేషమైన కృషి చేశారని కొనియాడారు. అప్పట్లో ఇక పరిష్కారం కావు అనుకున్న సమస్యలకు కూడా ఇతను పరిష్కారం కనుగొన్నారని ప్రశంసించారు. ఈయనలోని గణిత పరిశోధనా ప్రవృత్తి ఏకాంతంలోనే ఎక్కువగా అభివృద్ధి చెందిందన్నారు. తన పరిశోధనలతో అప్పట్లో ప్రఖ్యాతి గాంచిన గణిత శాస్త్రవేత్తలకు దగ్గరవ్వాలని ఎంతగానో ప్రయత్నించి విఫలమయ్యారని తెలిపారు. ఎందుకంటే రామానుజన్ కనుగొన్న సూత్రాలు అపూర్వమైనవి, అప్పటి దాకా ఎవరూ పరిచయం చేయనివి, దానికితోడు వాటిని రామానుజన్ సమర్పించిన విధానం కూడా విభిన్నమైనదని, అయినా రామానుజన్ తన పట్టు విడవకుండా తన పరిశోధనను అర్థం చేసుకునే శాస్త్రవేత్తలకోసం వెతుకులాట కొనసాగించాడన్నారు. రామానుజన్ తన జీవిత కాలంలో 3900 సమస్యలకు ఫలితాలను రాబట్టారని తెలిపారు. రామానుజన్ జన్మదినాన్ని జాతీయ గణిత శాస్త్ర దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు. విద్యార్థులు గణిత శాస్త్రంపై మంచి పట్టు సాధించాలని కోరారు. అనంతరం జాతీయ గణిత శాస్త్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు తయారు చేసిన మాథ్స్ ప్రాజెక్టుల ప్రదర్శన, విశ్లేషణలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు కరస్పాండెంట్ గోవిందరెడ్డి బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గోపాల్ కృష్ణ, రామకృష్ణ, అశోక్, రమేష్, గీత, భార్గవి, రోజా, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు