* రేయిన్ బో ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాలలో అట్టహాసంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు అని, హిందువులు జరుపుకునే ఉగాది, దసరా, దీపావళి, సంక్రాంతి మొదలగు పండుగలలో సంక్రాంతి పండుగకు ప్రత్యేకత ఉందని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి, మాజీ ఎంపీపీ నరవ శశిరేఖ అన్నారు. శుక్రవారం పెద్దకడబూరు గ్రామంలోని రేయిన్ బో ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాలలో కరస్పాండెంట్ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరవ శశిరేఖ మాట్లాడుతూ సంక్రాంతి పండుగను ‘పొంగల్ పండుగ’, పెద్ద పండుగ’ అని కూడా పిలుస్తారని గుర్తు చేశారు. పండుగల వల్ల సమాజంలోని వ్యక్తుల మధ్య స్నేహభావం, ఐకమత్యం పెరుగుతాయని అన్నారు. పండుగలలో తెలుగు ప్రజలందరికీ ముఖ్యమైన పండుగ సంక్రాంతి అని తెలిపారు. భారత సౌరమానాన్ని అనుసరించి వచ్చే పండుగ ఇది, మనకు 12 తెలుగు నెలలు ఉన్నాయని, అలాగే 12 రాశులు కూడా ఉన్నాయని, సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తాడని, అలా ప్రవేశించడాన్ని ‘సంక్రమణం’ అంటరాని పేర్కొన్నారు. అలా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే మకర సంక్రమణం రోజును మాత్రమే మనం సంక్రాంతి పండుగగా జరుపుకుంటామన్నారు. ఈ పండుగ జనవరి నెలలో వస్తుందని, ఈ నెలలో రైతులకు పంట చేతికి వస్తుందని, భారతదేశ ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం కాబట్టి దాదాపు వ్యవసాయ వృత్తి కలవారందరికీ ఈ నెలలో పంట చేతికి అంది ధన ధాన్యలక్ష్ములు నిలువ ఉంటాయని, ఈ పండుగకు నెలరోజుల ముందే ధనుర్మాసం ప్రారంభమవుతుందన్నారు. ఈ మాసములో స్త్రీలు వేకువనే లేచి వాకిళ్ళు శుభ్రం చేసి పేడతో కళ్ళాపి చల్లి అందమైన ముగ్గులు వస్తారని, ఆవు పేడతో గొబ్బిళ్ళను తయారు చేసి, ఆ గొబ్బిళ్ళను బంతిపూల లాంటి పువ్వులతో అలంకరించి ముగ్గుల మధ్య ఉంచుతారని గుర్తు చేశారు.
ఈ మూడు రోజుల పండుగ వేడుకలలో మొదటి రోజును భోగి, రెండవ రోజును సంక్రాంతి పండుగ, మూడవ రోజును కనుమ పండుగగా జరుపుకుంటామన్నారు. భోగిపండుగ రోజున వేకువతోనే లేచి ఇళ్ళలో పనికిరాని కర్ర, చెక్కలు వంటి పాత వస్తువులు, కొంతమంది తాటి ఆకులు మొదలగు వాటితో భోగిమంటలు వస్తారని వాపోయారు. భోగి మంటలు వేశాక తల స్నానాలు చేస్తారని, భోగినాడు ‘పులగం’ అంటే బియ్యం, పెసరపప్పుతో కలిపిన అన్నాన్ని దేవుడికి నివేదన చేసి దానిలో బెల్లం, నెయ్యి కలుపుకుని తింటారన్నారు. భోగి నాటి సాయంత్రం మహిళలు చిన్న పిల్లలకు భోగిపళ్ళు పోస్తారని, వాటిలో రేగుపండ్లు, మరమరాలు అంటే (బొరుగులు), చిల్లర డబ్బులు, పువ్వుల రెక్కలు కలిపి భోగిపళ్ళను పోస్తారని గుర్తు చేశారు. చుట్టు ప్రక్కల ముత్తైదువులను పిలిచి పిల్లలకు భోగిపళ్ళు పోయించి వారిచే ఆశీర్వాదం పొందుతారని తెలిపారు. మరుసటి రోజును మకర సంక్రాంతి పండుగగా జరుపుకుంటారని, ఆ రోజు నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుందన్నారు. సంక్రాంతి నాడు సంక్రమణ సమయంలో చనిపోయిన తల్లిదండ్రులకు, పెద్దలకు తర్పణాలు వదులుతారని, ఆ రోజు పరమాన్నం, గారెలు, బొబ్బట్లు రకరకాల పిండివంటలతో పెద్దలకు నైవేద్యం పెట్టి కొత్త బట్టలు వారికి పెట్టి, ఆ బట్టలు ధరిస్తారన్నారు. అంతే కాకుండా కొత్తగా చేతికి వచ్చిన పంటలోని బియ్యంతో, అరిసెలు, జంతికలు, కజ్జికాయలు వంటి రకరకాల పిండివంటలు తయారు చేసి బంధు మిత్రులకు పంచిపెడతారన్నారు. పిల్లలందరూ డాబాల మీద కలుసుకుని గాలిపటాలను, ఎగురవేస్తూ సందడి చేస్తారని,
మొత్తం మీద ఈ నెల అంతా హరిదాసులు, గంగిరెద్దులు, గాలిపటాలు, జంగమదేవరలతో సందడి సందడిగా ఉంటుందని, అందుకే హిందువులు జరుపుకొనే పండుగలలో సంక్రాంతి ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నట్లు తెలిపారు.
ముగ్గుల పోటీలలో విజేతలకు బహుమతులు పంపిణీ
అంతకు ముందు ముందస్తు సంక్రాంతి వేడుకల్లో భాగంగా పాఠశాల ఆవరణలో విద్యార్థుల తల్లులకు, మహాళా ఉపాధ్యాయులకు నిర్వహించిన ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఇందులో విజేతలైన తల్లులు కళ్యాణి, మేఘన, సంగీత, పవిత్ర, లలిత, గౌతమీలకు మాజీ ఎంపీపీ నరవ శశిరేఖ బహుమతులు పంపిణీ చేశారు. అలాగే విజేతలుగా నిలిచిన మహిళా ఉపాధ్యాయులు కావ్యశ్రీ, గీత, భార్గవి, చంద్రకళకు కరస్పాండెంట్ గోవిందరెడ్డి బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులు అట్టహాసంగా రంగు రంగుల గాలిపటాలను ఎగుర వేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, ఉపాద్యాయ సిబ్బంది పాల్గొన్నారు.


