30 కుటుంబాలకు శ్రీ సాయి నవనీతం హ్యాండ్లూమ్ ఉపాధి
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : కనుమరుగవుతున్న చేనేత పరిశ్రమకు అండగా నిలుస్తూ, సుమారు 30 చేనేత కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న శ్రీ సాయి నవనీతం హ్యాండ్లూమ్ ఆధ్వర్యంలో శుక్రవారం చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉరవకొండ పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహ కాలనీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికుల సమక్షంలో కేక్ కట్ చేసి చేనేత దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న అనేక కుటుంబాలకు శ్రీ సాయి నవనీతం హ్యాండ్లూమ్ నిర్వాహకులు గొరిగే సరస్వతి, గొరిగే రమేష్ ఉపాధి కల్పిస్తూ అండగా నిలుస్తున్నారని తెలిపారు. ప్రభుత్వాల నుంచి పెద్దగా సహాయ సహకారాలు అందకపోయినా సొంతంగా మగ్గాలను ఏర్పాటు చేసి చేనేత కార్మికులకు పని కల్పించడం అభినందనీయమన్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, నేత కార్మికులకు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. చేనేత కార్మికుల కోసం సొసైటీలను ఏర్పాటు చేసి, వారికి నిరంతర ఉపాధితో పాటు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ సాయి నవనీతం హ్యాండ్లూమ్ నిర్వాహకులు గొరిగే సరస్వతి, గొరిగే రమేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సహాయ సహకారాలు లేకపోయినప్పటికీ సొంతంగా మగ్గాలను ఏర్పాటు చేసుకుని పలువురు చేనేత కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తమలాంటి హ్యాండ్లూమ్ యూనిట్లకు ఆర్థిక సహాయం, రాయితీలు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని కోరారు.
ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తే చేనేత పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు మరిన్ని కుటుంబాలకు ఉపాధి కల్పించే అవకాశం ఉంటుందని వారు తెలిపారు. తరతరాలుగా వస్తున్న చేనేత కళను, పరిశ్రమను కాపాడుకోవడానికి ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.


