ముంబై: ఆస్కార్-2027 పురస్కారాలకు భారత్ తరపున అధికారిక ఎంట్రీ ఖరారైంది. మరాఠీ థ్రిల్లర్ ‘గోంధల్’ ఈ అరుదైన అవకాశం దక్కించు కుంది. ఈ మేరకు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. త్వరలో జరగనున్న 99వ అకాడమీ అవార్డుల (ఆస్కార్) వేడుకలో ‘ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో ఈ చిత్రం భారత్ తరపున ప్రాతినిధ్యం వహించనుంది. ఆస్కార్ ఎంట్రీ కోసం దేశవ్యాప్తంగా మొత్తం 33 చిత్రాలు పోటీ పడ్డాయి. ఇందులో హిందీ నుంచి అత్యధికంగా 14 సినిమాలు రాగా… మరాఠీ, తెలుగు, గుజరాతీ భాషల నుంచి చిత్రాలు వచ్చాయి. తమిళం నుంచి మూడు, మలయాళం, నాగమీస్ భాషల నుంచి ఒక్కో సినిమాతో పాటు ఒక మూకీ చిత్రం కూడా ఉన్నాయి. ఈ చిత్రాల ఎంపిక కోసం ఫిల్మ్ ఫెడరేషన్ ప్రత్యేక జ్యూరీని ఏర్పాటు చేసింది. తెలుగు నుంచి ‘సింగ్ గీతం’, ‘పెద్ది’, ‘ఇరుముడి’, ‘ఇగ్వా’ (విడుదల కావాల్సి ఉంది) చిత్రాలు కమిటీ స్క్రీనింగ్‌కు వెళ్లాయి. హిందీ నుంచి ‘120 బహదూర్’, ‘బోర్డ్ర్2’, ‘ధురంధర్’, ‘ధురంధర్: ది రివెంజ్’, ‘ఇకీక్కస్’ సహా ఇటీవల బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్ అంశ్’ తదితర చిత్రాలను జ్యూరీ వీక్షించింది. వీటన్నింటినీ వెనక్కి నెట్టి ‘గోంధల్’ ఈ అవకాశం దక్కించుకుంది. గోంధాల్ చిత్రం మహారాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలలో పాతుకుపోయిన ఒక కథ. గోంధాల్’ ఒక థ్రిల్లర్ చిత్రం. దీనికి ఆ పేరు రావడానికి కారణమైన సంప్రదాయ అర్ధరాత్రి ఆచారం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఎంపిక కమిటీ చైర్ పర్సన్ పి.శేషాద్రి మాట్లాడుతూ 33 పోటీదారుల జాబితా నుంచి ఈ చిత్రాన్ని భారతదేశం తరపున 2027 ఆస్కార్ ఎంట్రీగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆస్కార్ అవార్డులకు భారతదేశం తరపున అధికారిక ఎంట్రీగా ఎంపికయిన నాలుగవ మరాఠీ చిత్రం గోంధాల్. 99వ అకాడమీ అవార్డుల వేడుక మార్చి 14, 2027న హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్లో జరగనుంది.


