విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా): – మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందాల్సిన బియ్యం, నిత్యావసర సరుకులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గిరిజన విద్యార్థి ప్రజా సమాఖ్య (GVPS) రాష్ట్ర అధ్యక్షుడు మూడ్ రవికుమార్ నాయక్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గురుకుల పాఠశాలల్లో పేద, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా నాణ్యమైన భోజనం అందించాల్సి ఉండగా, కొందరు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వారికి అందాల్సిన ఆహార పదార్థాలను దారి మళ్లిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని అన్నారు.విద్యార్థుల సంక్షేమాన్ని పక్కనపెట్టి ఆహార సరుకుల వినియోగంలో అక్రమాలు జరిగితే అది తీవ్రమైన విషయం అని పేర్కొన్నారు. పాఠశాలలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి, వాస్తవాలను వెలికితీసి బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్, డీసీఓ, సంబంధిత ఉన్నతాధికారులను కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలల విద్యార్థులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.


