రూ.30 లక్షల నిధుల దారిమళ్లింపుపై ఆరోపణలు…
సొసైటీకి నోటీసులు జారీ చేసిన అధికారులు…
విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం (FSCS)లో నిధుల దారిమళ్లింపుపై ఆరోపణలు వెలువడడంతో వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రైతుల సంక్షేమం, పంట రుణాలు, ఎరువుల పంపిణీ కోసం ఉద్దేశించిన సంఘం నిధుల్లో సుమారు రూ.28 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.2013 తర్వాత సంఘానికి ఎన్నికలు జరగకపోవడంతో వివిధ కాలాల్లో త్రిసభ్య కమిటీల ద్వారా నిర్వహణ కొనసాగింది. ఈ క్రమంలో ఏడాది క్రితం నియమితులైన నాన్-ఆఫీషియల్ చైర్మన్ మహేష్ నాయుడు, సొసైటీ సీఈవో సహకారంతో నిధులు దారిమళ్లించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇటీవల సొసైటీ లావాదేవీలను ఆన్లైన్లో పరిశీలించిన అధికారులు కొన్ని ఆర్థిక అవకతవకలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు సొసైటీకి నోటీసులు జారీ చేసి, దారిమళ్లినట్లు గుర్తించిన నిధులను తిరిగి సంఘం ఖాతాలో జమ చేయాలని ఆదేశించినట్లు తెలిసింది.అయితే ఈ వ్యవహారంపై సంబంధిత అధికారుల పూర్తి నివేదిక వెలువడాల్సి ఉంది. మరోవైపు జిల్లాలోని ఇతర సహకార సంఘాల్లోనూ ఇలాంటి అక్రమాలు జరిగి ఉండవచ్చనే అనుమానాలను కొందరు రైతులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు అధికారికంగా స్పందించాల్సి ఉండగా, విచారణ నివేదిక కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


