వచ్చే సెప్టెంబర్ 17 నాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 75 ఏళ్లు నిండుతాయి కనక ఆయన పదవి నుంచి తప్పుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మధుకర్ రావ్ మోహన్ భగవత్ అన్యాపదేశంగా సూచించారు. మోదీ పేరెత్తకుండానే ఆయన 75 ఏళ్లు దాటిన వారు పదవుల నుంచి తప్పుకోవాలని అన్నారు. మోదీకి సెప్టెంబర్ 17 నాటికి 75 ఏళ్లు నిండితే మోహన్ భగత్‌కు అంతకన్నా ఆరు రోజుల ముందు అంటే వచ్చే సెప్టెంబర్ 11 న 75 ఏళ్లు పూర్తి అవుతాయి. పదవీ విరమణ సూత్రం మోహన్ భగవత్‌కు వర్తిస్తుందో లేదో తెలియదు. మోరో పంత్ పింగ్లే జీవిత చరిత్ర నాగపూర్‌లో ఆవిష్కరిస్తున్న సందర్భంÛగా మోహన్ భగవత్ 75 ఏళ్లకు పదవీ విరమణ అంశం ప్రస్తావించారు. మోరో పంత్ పింగ్లేకు 75 ఏళ్లు నిండినప్పుడు ఆయనకు శాలువా కప్పితే ఇది ఇక తప్పుకొమ్మనడానికి సంకేతం అని వ్యాఖ్యానించారని భగవత్ గుర్తు చేశారు. 2014 లో మోదీ ప్రధానమంత్రి అయిన తరవాత లాల్ కృష్ణ అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి లాంటి వారిని మార్గదర్శక్ మండల్‌లో చేర్చి వారి క్రియాశీల రాజకీయాల శకం ముగిసినట్టు తెలియజేశారు. అప్పటికి అడ్వాణీకి 87 ఏళ్లు. ఇప్పుడు ఆయన వయసు 98. మోరే పంత్ పింగ్లే చెప్పిన మాటలను గుర్తు చేస్తూ 75 ఏళ్లకు పదవీ విరమణ అని మోహన్ భగవత్ చెప్పిన మాటలకు పెద్ద ప్రాధాన్యత ఏమీ లేదని ఆర్‌ఎస్‌ఎస్ వర్గాలు అంటున్నాయి. భగవత్ బుధవారం నాగపూర్‌లో మాట్లాడుతూ మోరే పంత్ మాటలను గుర్తు చేయడం హాస్యానికి అన్న మాటేనని వెనకేసుకొస్తున్నారు. మోరే పంత్ మాటలను గుర్తు చేయడం అంటే 75 ఏళ్లకు పదవీ బాధ్యతల నుంచి తప్పుకోవాలన్న నియమం ఉన్నట్టు కాదని వారు చెప్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ అధినేత తన బాధ్యతల నుంచి తప్పుకునే ప్రతిపాదన కూడా ఏదీ లేదు అని ఆర్‌ఎస్‌ఎస్ వర్గాల వారు చెప్తున్నారు. 75 ఏళ్లకు బాధ్యతల నుంచి తప్పుకోవడం అనే సూత్రం మోదీకి వర్తించదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా 2023 మేలోనే తేల్చి చెప్పారు. బీజేపీ నిబంధనల్లో 75 ఏళ్ల వయో పరిమితి ఏమీ లేదని కూడా ఆయన అన్నారు. సెప్టెంబర్ 17 తరవాత ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకుంటానని మోదీ కూడా ఎన్నడూ చెప్పలేదు. 75 ఏళ్లు నిండిన తరవాత శాలువా కప్పడం అంటే ఇక తప్పుకోమని చెప్పడమేనని మోరో పంత్ అన్నట్టు మోహన్ భగవత్ గుర్తు చేయడం కేవలం హాస్యానికే అయి ఉంటుంది. మోరో పంత్ కూడా ఈ మాట ఇదే ధోరణిలో అని ఉంటారు. మోరే మరో మాట కూడా అనే వారు. తాను లేచి నిలబడి ఒక్క మాట కూడా మాట్లాడక ముందే జనం నవ్వుతారు అనే వారు. మోరే హిందుత్వ రాజకీయాల్లో చాలా కీలక పాత్ర పోషించిన నాయకుడు. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయిందే 81 వ ఏట. అటల్ బీహారీ వాజపేయి 80 ఏళ్లు వచ్చే దాకా ప్రధానిగా ఉన్నారు. శివసేన నాయకుడు సంజయ్ రౌత్ లాంటి వారు భగవత్ మాటలను పట్టుకుని ‘‘అవును మోదీ పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని’’ యాగీ చేస్తున్నారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్‌థాక్రే ఏ అధికార పదవిలో లేకపోయినా 76 వ ఏట మరణించేె దాకా శివసేన అధినేతగానే ఉన్నారు. ‘‘ఆచరణలో పెట్టలేని మాటలు చెప్పకూడదు’’ అని కాంగ్రెస్ నాయకుడు, ప్రసిద్ధ న్యాయవాది అభిషేక్ మను సింఫ్వీు వ్యాఖ్యానించారు. నిజానికి మన రాజకీయాల్లో వయో పరిమితీ లేదు. విద్యార్హతల నియమమూ లేదు. రాజకీయాలు వయసుకు, విద్యార్హతకు సంబంధం లేని అంశాలు. కనీసం ఉన్నత పదవుల్లో ఉన్న వారు ఇన్నిసార్లు పదవిలో ఉన్న తరవాత తప్పుకోవాలన్న నిబంధనా లేదు. పండిత్ నెహ్రూ 75 వ ఏట మరణించే దాకా ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇందిరా గాంధీ 67 వ ఏట హత్యకు గురయ్యే దాకా ప్రధానిగా ఉన్నారు.
మోదీని తప్పుకోవాలని కోరడానికి వయసు కారణం కాకూడదు. వయసు మళ్లి, పని చేయలేని స్థితికి వచ్చామనుకునే వారు స్వచ్ఛందంగా తప్పుకోవడం వేరు. 75 ఏళ్లు వచ్చాయి కనక ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలని మోహన్ భగవత్ చెప్పడంలో నిగూడార్థం ఉండి ఉండొచ్చు. ఇటీవల మోదీ నాగపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయానికి వెళ్లారు. ప్రధానమంత్రి అయిన తరవాత ఆయన ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయానికి వెళ్లడం అదే మొదటి సారి. ఆయన ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో ఎవరితో ఏం మాట్లాడారోనన్న వివరాలు బయటకు రాలేదు. రావు కూడా. కానీ ఊహాగానాలకు ఎప్పుడూ కొదవ ఉండదు. 75 ఏళ్లు నిండిన తరవాత ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పడానికే ఆయనను ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయానికి ‘‘పిలిపించారు’’ అన్న మాటలూ వినిపిస్తున్నాయి. శారీరకంగా అశక్తులైనా, కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పటికీ పదవిలో కొనసాగిన నాయకులు ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఇప్పుడు 79 ఏళ్లు. మోదీని దిగిపొమ్మని అనడానికి ఆయన వయసు కారణం కాకూడదు. ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ పరోక్షంగా ఈ విషయం సూచించడానికి ఇతరేతర కారణాలు ఉండి ఉంటాయి. ఈ మాట ఆయన నేరుగా కానీ, గట్టిగా కానీ చెప్పిన దాఖలాలూ లేవు. అలా చెప్తే ఆయనే మోదీ కన్నా ఆరు రోజుల ముందు ఆర్‌ఎస్‌ఎస్ అధినేత స్థానం నుంచి తప్పుకోవలసి వస్తుంది. మోదీ పాలన సహించకపోవడానికి బోలెడు కారణాలు ఉంటాయి. వాటి ఆధారంగా ఆయనను గద్దె దింపాలనుకోవడంలో న్యాయం ఉంది. దానికీ ఓ పద్ధతి ఉంటుంది. ఆయన ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికై నిరంకుశంగా మారిన నాయకుడు. అందుకని ఆయన నిరంకుశత్వాన్ని, ఫాసిస్టు పోకడలను ఎంత తీవ్రంగానైనా వ్యతిరేకించవచ్చు. ఆ అవసరం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఆయనను గద్దె దించే అవకాశం ఏది అన్నది ప్రధానమైన ప్రశ్న. ఎన్నికలలో ఓడిస్తే ఆయనే గద్దె దిగుతారు. కానీ సార్వత్రిక ఎన్నికలు 2029 లో తప్ప జరగవు. ఆలోగా బీజేపీ అంతర్గత రాజకీయాలలో మోదీకి వ్యతిరేకంగా కొనసాగుతున్న అలజడి కూడా ఏమీ లేదు. ఆ సత్తా ఉన్న నాయకులూ కనిపించడం లేదు. వయసు ఆధారంగా మోదీని దిగిపొమ్మనడం భవిష్యత్తులో కూడా ప్రమాదకరం కావొచ్చు. మార్క్సిస్టు పార్టీ నాయకుడు జ్యోతిబసు దాదాపు రెండున్నర దశాబ్దాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన వయసు ఆయన పరిపాలనా సామర్థ్యాన్ని దెబ్బ తీసిన దాఖలాలు లేవు. మోదీని క్యాలెండర్‌తో దించాలనుకోవడం దండగ.
పదవీ విరమణ వయసు మీమాంస
- Advertisement -


