రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ…
విశాలాంధ్ర -అనంతపురం : రాష్ట్రంలోని మహిళలు, ఆడపిల్లల భద్రత మహిళా కమిషన్ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ తెలిపారు. బుధవారం అనంతపురంలోని ఎస్ ఎస్ బి ఎన్ డిగ్రీ కళాశాలలో జిల్లా మహిళా శిశు ,సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళల సంక్షేమం, భద్రత మరియు సాధికారతపై జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా. రాయపాటి శైలజ పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన గావించి, సదస్సులో భాగంగా మహిళా భద్రత పై ఏర్పాటుచేసిన సంతకాల సేకరణ ఫ్లెక్సీ పై సంతకం చేశారు. ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్ పర్సన్ మాట్లాడుతూ మహిళల హక్కులు కాపాడడానికి, మహిళల రక్షణ సంక్షేమానికి మహిళలపై వివిధ రకాల హింస, దారుణాలను నివారించడానికి ప్రభుత్వం ద్వారా మహిళా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వం మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరికి మహిళల చట్టాలపై సంపూర్ణ అవగాహన ఎంతో ముఖ్యమన్నారు. పాఠశాలలు ,కళాశాలలోని విద్యార్థినీలు కూడా ఇప్పటినుండే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక చట్టాలతో పాటు మహిళల రక్షణ,భద్రత మరియు సాధికారతలపై చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం ఎక్కడైనా ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడే కాకుండా వాటిని ముందస్తుగా నివారించడానికి చర్యలు తీసుకోవడం ప్రధానమన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళా భద్రతకు కట్టుబడి ఉందన్నారు. రాయలసీమ ప్రాంతంలో బాల్య వివాహాలు , గృహహింస, మహిళ ఉద్యోగుల వేధింపులు, మైనర్ బాలికలపై వేధింపులు తదితర ఫిర్యాదులు వస్తున్నందున క్షేత్రస్థాయిలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వాటన్నింటిని నివారించడానికి కమిషన్ ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
శక్తి యాప్ ను ప్రతి అమ్మాయి, మహిళ వారి మొబైల్ నందు తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలని
అనంతరంచైర్ పర్సన్ మీడియాతో మాట్లాడుతూ…- మహిళల రక్షణ, భద్రత, సాధికారతపై క్షేత్రస్థాయిలో అన్ని జిల్లాల్లో మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా తిరిగి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం మహిళల సంక్షేమ, అభివృద్ధి, భద్రత కొరకు అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. సినిమాల ప్రభావం కూడా నేటి యువతపై అమ్మాయిలపై ఎంతగానో ఉందని ఆ ప్రభావాన్ని దూరం చేయాలని సంకల్పంతో ఇలాంటి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరి ముఖ్యంగా
ఫేస్ బుక్, ట్విట్టర్ సోషల్ మీడియా వేదికగా పరిచయాల ద్వారా పలువురు మోసపో తున్నందున అలాంటి మహిళలు అప్రమత్తంగా ఉండాలని వారిని చైతన్య పరిచే విధంగా మహిళా చట్టాల పై విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిపారు.
జిల్లాలో బాల్యవివాహాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టేలా ఆదేశించినట్లు తెలిపారు. అలాగే పలు అవగాహన కార్యక్రమాల నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
అమ్మాయిలు విద్యపై దృష్టి పెట్టాలని, పెద్దల సూచనలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు.తొందరపాటు నిర్ణయాలు తీసుకొని తమ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకోవద్దని సూచించారు.
గృహ హింస అనేది ఒక సామాజిక రుగ్మత అని అన్నారు. చదువుకున్న వారు కూడా గృహ హింసకు పాల్పడడం దురదృష్టకరం విచారకరమైన అంశమని అన్నారు. దీనిపై వస్తున్న ఫిర్యాదులను పరిశీలించి చట్ట నిబంధనల మేరకు చర్యలు పటిష్టంగా చేపడతామన్నారు.- ఉద్యోగులు పని చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగ ప్రాంతాల్లో, పాఠశాల, కళాశాలలలో అంతర్గత సెక్సువల్ హెరాస్మెంట్ ప్రివెన్షన్ కమిటీలు ఏర్పాటు కావాలని,సదరు అంశాలపై సంబంధిత అధికారులు వారికి అవగాహన కల్పించాలని సూచించారు.
అమ్మాయిలు, మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరగకుండా ముందుగా నిరోధించేందుకు మహిళా కమిషన్ ద్వారా ప్రభుత్వ సహకారంతో పలు కార్యక్రమాలతో పాటు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
శక్తి యాప్ ను ప్రతి అమ్మాయి, మహిళ వారి మొబైల్ నందు తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలని, ఆపద సమయంలో శక్తి యాప్ మహిళలకు గొప్ప ఆపన్న హస్తంగా సహకరిస్తుందని తెలిపారు. సమాజంలో ఆడ, మగ అనే తేడా లేకుండా పరస్పరం గౌరవించుకోవాలని తెలిపారు.జీవించే హక్కు ఆడ మగ వారికి ఇద్దరికీ సమానంగా ఉంటుందని భావించాలన్నారు. అనంతరం పలువురు మహిళల నుండి వివిధ సమస్యలతో కూడిన అర్జీలను మహిళాకమిషన్ చైర్ పర్సన్ స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో అనంతపురం ఆర్డీవో కేశవ నాయుడు,జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి నాగమణి, డి ఎం హెచ్ ఓ డా. ఈ.బి.దేవి , మాజీ నగర మేయర్ స్వరూప, దిశా పోలీస్ స్టేషన్ సీఐ వెంకటేశ్వర్లు ,నోడల్ అధికారి వనజాక్షి, సిడిపివోలు శ్రీదేవి అనురాధ , భారతి, డివిసి ఉమా నర్మద , మానవ హక్కుల సంఘం ప్రతినిధి మధుసూదన్ శర్మ తాసిల్దార్ హరిప్రసాద్ , పలువురు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
మహిళలు, ఆడపిల్లల భద్రత ప్రధాన లక్ష్యం….
- Advertisement -


