జీవో 118 ప్రకారం నేటి నుంచే క్రమబద్దీకరణ
మంత్రి పొంగులేటి
విశాలాంధ్ర – హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన ప్రకటనకు అనుగుణంగా 22-ఏ కు సంబంధించిన అన్ని అంశాలను ఫాస్ట్ ట్రాక్ లో పరిష్కరించడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. ఇందుకు సంబంధించి జీ.ఓ.ఆర్.టి నెం. 564 జారీచేసినట్లు శుక్రవారం శాసనసభలో చెప్పారు. ఈ కమిటీకి చైర్మన్‌గా సీసీఎల్ఏ డి.ఎస్. లోకేశ్‌కుమార్ వ్యవహరిస్తారని, లా సెక్రటరీ పాపిరెడ్డి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐ.జీ. రాజీవ్ గాంధీ హనుమంతు సభ్యులుగా ఉంటారని తెలిపారు. రేవంత్ రెడ్డి … మల్కాజిగిరి ఎంపీగా ఆనాడు రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని వివిధ కాలనీల్లో ఉన్న రెగ్యులరైజేషన్ సమస్యను పరిష్కరిస్తానని ఇచ్చిన హామీ మేరకు జీఓ 118 ప్రకారం 9,700 ప్లాట్ల క్రమబద్దీకరణకు సంబంధించిన ఉత్తర్వును జారీ చేసినట్టు చెప్పారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు. దశాబ్దాల కాలంగా అక్కడ ప్లాట్లు తీసుకొని నివాసం ఉంటున్న ఇళ్ల యజమానులు జీఓ118 ప్రకారం స్థానిక అధికారులను సంప్రదించి నిబంధనల ప్రకారం క్రమబద్దీకరణ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి ప్రాంతంలో ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణకు సంబంధించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జీవో 76 జారీ చేశారని, ఆ జీవోను అనుసరించి శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్వర్యంలో సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి క్రమబద్దీకరణ ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. రెవెన్యూ రికార్డులలో 22ఏలో ఉండి హెచ్ఎండీఏ, డీటీసీపీ, జీహెచ్ఎంసీ అనుమతులతో లేఅవుట్లు వేసిన ప్రాంతాలను 22ఏ నుంచి తొలగించే విషయంలో ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. శాసనసభలో సీఎం ప్రకటించిన 12 అంశాలపై నెలరోజుల వ్యవధిలోనే నిర్ణయం తీసుకొని 22ఏ దరఖాస్తుదారులకు ఉపశమనం కల్పిస్తామని ప్రకటించారు.


