అంతా అనుకూలంగా ఉంటేనే ముందుకు: ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్‌తో మంచి ఒప్పందం కుదిరితేనే ముందుకు వెళతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల నేపథ్యంలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాల అధినేతలతో కీలక భేటీ జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమ అంచనాలకు తగ్గట్టు ఇరాన్‌తో ఒప్పందం జరగకపోతే చర్చలకూ తావులేదన్నారు. అమెరికాతో ఒప్పందాన్ని ఇరాన్ కోరుకుంటోందని, అందుకు షరతులు వర్తిస్తాయని ఆయనన్నారు. ఇరాన్ ప్రస్తుతానికి షరతులతో కూడిన ఒప్పందానికి సిద్ధంగా లేదని కూడా చెప్పారు. ఇదిలావుంటే, యుద్ధాన్ని ముగించే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. వచ్చే వారం న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి సమావేశాలలో భాగంగా జీసీసీ సమావేశం జరగనున్నది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్ ప్రతినిధులతో ట్రంప్ ప్రత్యేకంగా చర్చలు జరపనున్నారు. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ఇప్పటికే వెల్లడించింది. ఆయా దేశాధినేతలకు ఆహ్వానం పంపినట్లు తెలిపింది. అదే క్రమంలో జీసీసీని విస్తరించాలని కూడా అమెరికా యోచిస్తున్నట్లు సమాచారం. ఇదిలావుంటే, ట్రంప్ అధికారాలకు కళ్లెం వేసే దిశగా అమెరికా ప్రతినిధుల సభ కీలక తీర్మానాన్ని ఆమోదించింది. దీనిని డెమొక్రాటిక్ ప్రతినిధి సేథ్ మోల్టన్ ప్రవేశపెట్టారు. తీర్మానానికి అనుకూలంగా 220 ఓట్లు, వ్యతిరేకంగా 204 ఓట్లు వచ్చాయి. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఏడుగురు సభ్యులు మద్దతిచ్చారు. ‘లిండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026’ చట్టాన్ని కూడా ప్రతినిధుల సభ ఆమోదించింది. రష్యా, ఇరాన్ చమురు, గ్యాస్ కొనుగోలు దేశాలపై 100 శాతం సుంకాలు విధించేలా అమెరికాకు ఈ చట్టం విచక్షణాధికారాన్ని కట్టబెడుతోంది. అయితే చైనా దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది.


