విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఎస్‌సీ, బీసీల నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించింది. తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, అనంతపురం లోక్‌సభ నియోజకవర్గ అంగన్‌వాడీ సంఘం అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న దళవాయి రమాదేవి పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు సంబంధిత దస్ర్తాన్ని గవర్నర్ ఆమోదం కోసం పంపారు. దీంతో శాసన మండలిలో కూటమి సంఖ్యా బలం మరింత పెరగనుంది. వైసీపీ నుంచి పండుల రవీంద్ర బాబు, జకియా ఖానం గత నెల పదవీ విరమణ చేయడంతో కూటమి నుంచి ఈ రెండు స్థానాలు ఎవరికి ఇస్తారనే చర్చ సాగింది. అనేక పేర్లు కూడా టీడీపీ అధిష్టానం పరిశీలనలోకి వచ్చాయి. 2024 ఎన్నికల్లో కూటమిలో సీట్ల సర్దుబాటు కారణంగా కొందరు టీడీపీ సీనియర్లకు టికెట్లు దక్కలేదు. అప్పుడు కొందరికి ఎమ్మెల్సీ పదవులిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గవర్నర్ కోటా లో పార్టీ సీనియర్లకు అవకాశం వస్తుందని వారంతా ఆశించారు. రాజ్యసభకు చివరి వరకు రేసులో నిలిచి…అవకాశం చేజారిన ఎస్‌సీ నేత వర్ల రామయ్యను ఎమ్మెల్సీ చేయాలని నిర్ణయించారు. అదే విధంగా మరో సీటు కోసం రాయలసీమ ప్రాంతానికి చెందిన బీసీ మహిళను ఎంపిక చేశారు. సామాన్య మహిళకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వటం ద్వారా పార్టీ కోసం పని చేసిన వారికి గుర్తింపు ఇచ్చినట్లు అవుతుందన్న సంకేతాన్ని పార్టీ శ్రేణుల్లోకి పంపే ఉద్దేశంతో అనంతపురం అంగన్ వాడీ సంఘం అధ్యక్షురాలిగా పనిచేస్తున్న దళవాయి రమాదేవి పేరు ఖరారు చేశారు. గతంలో రమాదేవి టీడీపీ నుంచి అనంతపురంలో 47వ డివిజన్ కార్పోరేటర్ గా పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వరుస కేసులు, అనేక ఒత్తిడులు ఎదుర్కొన్నారు. వర్ల రామయ్య, రమాదేవి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లకు కృతజ్ఞతలు తెలియజేశారు.


