Homeసాహిత్యంతెలుగుచరిత్రకు ప్రాణం పోసిన మల్లంపల్లి

తెలుగుచరిత్రకు ప్రాణం పోసిన మల్లంపల్లి

- Advertisement -

నిశితమైన చూపు, నిర్మలమైన మనస్సు, సహజమైన కళా రసికత, సందర్భ శుద్ధమైన వాక్‌కు, నిక్కమైన చరిత్ర జిజ్ఞాస, నిరంతరాయమైన పరిశోధన, ఇన్ని సుగుణాల రాశి సాధారణుడు కాదు! శాసన పరిష్కారంలో వారిని దాటిన వారు లేరు! లిపిశాస్త్రం ఈయన చక్కగా ఎరుగును. శాసన దర్శనాలకు లిపి రహస్యజ్ఞత సుధాంజనం. ఆ మేలికాటుక ఈయన సొంతం. ఈయన సంగ్రహించి ప్రకటించిన శాసనాలు ఇన్ని అన్ని అని చెప్పలేం. ప్రాచీన దక్షిణ హిందూ దేశ చరిత్ర సర్వం ఆయనకు కరతలామలకం. బౌద్ధ యుగాన్ని గూర్చిన వీరి పరిశీలన గొప్ప విలువ గలది. రెడ్డి యుగాన్ని గూర్చిన అమోఘం, అపూర్వం అగు వీరి విషయ సందోహం మహా గ్రంధమైంది. శాతవాహనులు, చాళుక్యులు, కళింగ గాంగులు, కాకతీయులు వీరి వీరి యుగాలను గాలించి పరమ రహస్యాల నెన్నింటినో వెల్లడించిన పరిశోధకతల్లజులు ఈయన!
“కొదమ తుమ్మెద రెక్కల గుస్తరించు
మీసముల నీ ప్రసన్న గంభీర ముఖము
కన్నులంటగ గట్టినట్లున్న నిన్ను
మరిచిపోలేను జన్మములకైన…” అంటూ కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ప్రేమ పూర్వక ప్రశంసలతో, స్నేహపూర్వక అభినందనలతో వారి ‘ఆంధ్ర ప్రశస్తి’ కృతినంకితం అందుకున్న ఆ మహానుభావుడే మల్లంపల్లి సోమశేఖర శర్మ.
సుప్రసిద్ధ తెలుగు చారిత్రక పరిశోధకుడు, పురాలిపి శాస్త్రజ్ఞుడు అయిన మల్లంపల్లి సోమశేఖర శర్మ పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలోని ‘మిను మించిలి పాడు’ గ్రామంలో 1891, డిసెంబర్ 9వ తేదీన నాగమ్మ, భద్రయ్య దంపతులకు జన్మించారు.
అప్పటి సాంస్కృతిక కేంద్రమైన రాజమండ్రిలో మెట్రిక్యులేషన్ పరీక్షల్లో ఉత్తీర్ణుడై పాత్రికేయునిగా తన సారస్వత జీవితం ప్రారంభించారు. కథలు, నాటకాలు, నవలలు, పద్యాలు వివిధ పత్రికలలో ప్రచురించారు. తరువాత మల్లంపల్లి వారి కార్య స్థానం అప్పటి రాష్ట్ర రాజధాని మద్రాసు నగరానికి మారింది.
ఆ రోజులలో చరిత్ర చతురాననుడిగా ప్రసిద్ధి చెందిన చిలుకూరి వీరభద్రరావుతో శర్మకు పరిచయమైంది. అతనికి సహాయకుడిగా ప్రాచీన కావ్యాలకు, శాసనాలకు ప్రతులు రాశారు. అనంతరం విజ్ఞాన సర్వస్వం తయారీ కృషిలో కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, గాడిచర్ల హరివోత్తమరావు, ఆచంట లక్ష్మీపతి, రాయప్రోలు సుబ్బారావు, వంటివార్లకు తోడు నిలిచి ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం నిర్మాతల్లో ఒకరైనారు.
అప్పటికి ఆంధ్రదేశంలో చరిత్ర పరిశోధన ప్రాథమిక దశలోనే ఉండేది. చరిత్ర రచనలకు మౌలిక ఆధారాలు అయిన శాసనాలను రక్షించి వెలుగులోనికి తెచ్చి, విశ్లేషించే బృహత్తర బాధ్యతను మల్లంపల్లి తలకెత్తుకున్నారు. ఒంటరిగాను, మిత్రుడు నేలటూరి వెంకటరమణయ్యతోనూ కలిసి నెల్లూరు జిల్లాలోనూ రాయలసీమ ప్రాంతంలోనూ అన్వేషణ యాత్రలు సాగించారు. ఈయనను ‘శాసనాల శర్మ’ అని ప్రజలు సాదరంగా గౌరవించేవారు. ఈ అన్వేషణ ఫలితంగా అశోకుని ఎర్రగుడిపాడు శాసనం, పల్లవ, రెడ్డి, విజయనగర రాజుల కాలంనాటి ఎన్నో శాసనాలు వెలుగులోనికి వచ్చాయి.
తాను సేకరించిన శాసనాలను విశ్లేషించి వివిధ అంశాలను వివరిస్తూ భారతి, శారద, ఆంధ్రపత్రిక వంటి పత్రికలలో వ్యాసాలు రాశారు. శాసనాల లిపిని పరిశోధించడంలో అఖిలభారత పరిగణన పొందిన ఆంధ్ర చరిత్రకారుడు కేవలం ఒక్క మల్లంపల్లి వారు మాత్రమే అనవచ్చును.
1940 నుండి 46 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చరిత్ర పరిశోధకులుగా, 1957 నుండి 63 వరకు ప్రాచీన శాసనాధ్యాపకులుగా పనిచేశారు.
లిపి శాస్త్రంలోనే కాక ఆంధ్ర వాస్తు శిల్ప స్వభావ నిరూపణలో, ప్రతిమ స్వరూప నిర్ణయంలో శర్మ నిష్ణాతుడు.’ అమరావతి స్తూపం’ అన్న వారి రచన ఇందుకు తార్కాణం. మొగల్రాజపురంలోని దుర్గ గుహలో మూలవిరాట్ స్థానంలో అస్పష్టంగా ఉన్న కుడ్య చిత్రాన్ని గుర్తించి, అది అరÆనారీశ్వర మూర్తి అని సహేతుకంగా నిరూపించారు ఈయన.
అమరావతి స్తూపము ఇతర వ్యాసములు, ఆంధ్ర వీరులు, రాగ తరంగణి అనే కథ, విజయ తోరణం రేడియో నాటికలు, ఆంధ్ర సంస్కృతి తరంగణి, ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహము, రెడ్డి రాజుల చరిత్ర, బౌద్ధ యుగంపై రాసిన చారిత్రక వ్యాసాలు, రోహిణి చంద్రగుప్తము, ప్రాచీన విద్యాపీఠము మొదలైనవి ఈయన రచనలు.
“రాగి రేకులలో రాతి ఫలకాలలో కనుమూసిన తెలుగు చరిత్రకు ప్రాణం పోసిన మహా మనిషి శర్మ” అని స్తుతిస్తూ తన కర్పూర వసంతరాయల కృతిని మల్లంపల్లి వారికి అంకితం ఇచ్చారు డాక్టర్ సి.నారాయణరెడ్డి.
ప్రాచీన భారతదేశ చరిత్రకు భండారక్కర్ లాగా, మహారాష్ట్ర చరిత్రకు సర్దేశాయి లాగా, దక్షిణ భారతదేశ చరిత్రకు నీలకంఠ శాస్త్రి లాగా మన ఆంధ్రప్రదేశ్ చరిత్రకు మల్లంపల్లి సోమశేఖర శర్మ ప్రాత’ స్మరణీయులు.
“మేము శిలలమైనా మాకు మనసులు ఉన్నాయి” అంటూ శిలా శాసనాలు మూగగా రోదించిన రోజు, 1963 జనవరి 7వ తేదీన మన మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు స్వర్గస్తులయ్యారు. వారు ఈ రోజున మన మధ్య భౌతికంగా లేకపోయినా, వారు అందించిన ప్రాచీన సాహితీ సంపదలో వారు మనకు సదా కనిపిస్తూనే ఉంటారు.
సెల్: 94403 18415

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు