‘నేను కవిత రూప దర్పణంలో మీ ప్రతిబింబం చూస్తున్నాను. మీరు ఒక చిన్న తపస్విని’ -అన్నపూర్ణ అనే కవయిత్రి రాసిన కవిత చదివి ప్రముఖ ఒరియా సాహితీవేత్త ఫకీర్ మోహన సేనాపతి చేసిన ప్రశంస ఇది (1903 ఏప్రిల్). కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత డాక్టర్ రాజేశ్వరిగారి సాహిత్యం చదివినా,ఆమె రూపాన్ని చూసినా “చిన్న తపస్విని” గానే కనిపిస్తారు. బహుముఖీనమైన ఆమె రచనలు చూస్తే, ఆమె తపనే ఆమెను తపస్వినిగా మార్చిందని పిస్తుంది. అనేక సాహితీ ప్రక్రియలకు సంబంధించిన అపారమైన సమాచార, భావ సంపద ఆమె దగ్గర ఉంది. ప్రధానంగా సజీవ అనువాదాలు ఆమె ప్రత్యేకత. గోదావరి తీరంలో గుడ్లవల్లేరు గ్రామం కన్నవారు. బుTషి కుల్య తీరంలో బరంపురం స్థిరపడిన ఊరు. తెలుగు- ఒరియా సాహిత్య చరిత్రలో భాగమై, గడచిన నాలుగు దశాబ్దాల నుంచి ఎనలేని కృషి చేస్తున్నారు. తన 25వ రచనగా, ఉభయ రాష్ట్రాల చరిత్ర, సాహిత్య, సంస్కృతులకు సంబంధించి రాసిన వ్యాసాలు, చేసిన ప్రసంగాలతో ఇటీవల ‘సహృదయ వ్యాసావళి’ పేరిట ఒక సంకలనాన్ని ఇటీవల వెలువరించారు. ప్రచురణ: త్రిపురవాసిని ప్ఙ్లకేషన్స్. దీనిలో ఆంధ్ర- ఒరియా చరిత్ర, సంస్కృతి, సాహిత్య, సంస్కరణ ఉద్యమాలతో పాటు, తెలుగు – తమిళ భీష్మాచార్యుడు గురించి రెండు విలువైన వ్యాసాలు ఉండటం విశేషం. ఒరియా నుంచి తెలుగు అనువాదాలకు డాక్టర్ రాజేశ్వరి ప్రసిద్ధి. 2021 లో ప్రముఖ సాహితీ వేత్త గోపీనాథ మహంతినవల ‘దాడీ బుఢో’ను ఆమె ‘ఈతచెట్టుదేవుడు’ పేరుతో అనువదించారు. ఒరియా సాహిత్యరంగం నుంచి తొలి జ్ఞానపీఠ అవార్డు అందుకున్న దిగ్గజం గోపీనాథ్ మహంతి (1973).
తాజా గ్రంథంలో 23 వ్యాసాలున్నాయి. తొలి వ్యాసాలు తెలుగు నేల, చరిత్రకు సంబంధించినవి. పుట్టినూరుపై మమకారం కావొచ్చు. కృష్ణాజిల్లాలోని ఆధారాలనే ఎక్కువగా ప్రస్తావించారు. ఆంధ్ర అనే పదానికి తెలుగు సమానారÆకమా? తెలుగు జన్మస్థలం ఏది? అనే ప్రశ్నలకు సంతృప్తికరమైన జవాబులు ఇంకా దొరకలేదు. కానీ, కోరాడ రామకృష్ణయ్య గారి నుంచి డాక్టర్ జీవి పూర్ణచంద్ర వరకూ, వారి పరిశోధనల బలంతో, తెలుగు ప్రాచీనతగురించి సహేతుకంగానే వివరించారు. భాష పుట్టుక జోలికి వెళ్లకుండా ఉండటం చేసిన మంచిపని. తెలుగు భాషలో పద్య శాసనాలను చాలా ఓపికగా సేకరించారు. బరంపురం పక్కనే ఉన్న, శ్రీకాకుళం జిల్లాలోని దీర్ఘాసి శాసనం ఆమె దృష్టిలో లేకపోవడం కాస్తా వెలితి! వేములవాడ భీమకవి వ్యాసంపై కూడా గతంలో చర్చ జరిగింది. ఇద్దరు భీమకవులు ఉన్నారని, వారు వేర్వేరని (చూ. ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం). ఏమైనా, చరిత్ర రచన ఎంత క్లిష్టమో, నిర్ధారణకు రావడం కూడా అంతే!
వ్యాస సంకలనంపై డాక్టర్ రాజేశ్వరి ముద్ర కొనసాగింది. ఈ వ్యాసావళి ప్రత్యేకత ఇదే!
‘మనం మనం బరంపురం’ అనే బాంధవ్యానికి కొనసాగింపే ఆ ముద్ర. హాలీస్ తోకచుక్క (1910) కనిపించిన రోజున, బరంపురంలో సహా పంక్తి భోజనాల గురించి యుగకవి గురజాడ ముత్యాలసరాల్లో, ఉప్పల తన బతుకు పుస్తకంలో వివరించిన దానికి గల నేపథ్యాన్ని డాక్టర్ రాజేశ్వరి మరింత విస్తరించారు. బరంపురం సంస్కరణ వాదుల ప్రయత్నాలను వివరించారు. ఇవి, మంచి జ్ఞాపకాలు. బరంపురంలో తెలుగు సాహిత్య, సంస్కృతులకు ఎంతో సేవచేసిన వ్యక్తులు, సంస్థలు, ఆంధ్రేతర రాష్ట్రాల్లో తెలుగు సంస్థల వివరాలను కూడా అందించారు. ఒడిశాలో తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాల గురించి, కొన్ని కులాల వారీగా ఆమె గమనించిన విధానం చాలా ఆసక్తికరమైన వ్యాసంగా మారింది. చరిత్రపరంగా మహానది- గోదావరి మధ్య విస్తరించిన భూభాగమే కళింగ. రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత (1936) సమిష్టి చరిత్ర, సంస్కృతీ, సంప్రదాయాలు కొత్త తరాలకు తెలియని పరిస్థితి. ఈ సంకలనంలో, అమూల్యమైన వ్యాసాలు, తెలుగు-తమిళ భీష్మాచార్యుడు కీ. రాజనారాయణ్ (కీ.రా) జంట నవలల గురించి రాసినవి. ఆంధ్రదేశంలో తెలుగు వాళ్లు తమిళనాడు వలసలకు దారితీసిన రాజకీయ, సాంఘిక, మత కారణాలను, విభ్రాంతకరమైన వాస్తవాలను, గోపల్లె, దాని రెండో భాగం నవలల్లో రాజనారాయణ్ వివరించారు. రెండో భాగాన్ని తెలుగులోకి ఆచార్య శ్రీపాద జయప్రకాష్ అనువదించారు.
‘మూలం పుష్పమైతే, అనువాదం అత్తరు’ – అన్నారు అమరేంద్ర. అంటే, అనువాదం ఏ భాషలో జరిగినా, సౌగంధం అంత సజీవంగా ఉండాలని అర్థం.
‘ఈత చెట్టు దేవుడు’ లో డాక్టర్ రాజేశ్వరి చేసిన ప్రయత్నం అమరేంద్ర భావానికి తగినట్టుగా ఉంది. అందువల్లే, అది కేంద్ర సాహిత్య అకాడమీ న్యాయ నిర్ణేతల మనసు గెలవగలిగింది. గోపీనాథ మహంతి ఎంచుకున్న ఇతివృత్తం ఆంధ్ర- ఒడిశా సరిహద్దులోని కోరాపుట్ జిల్లా ఆదివాసి ప్రాంతానిది. కోరాపుట్, ఒకనాటి ఉమ్మడి మద్రాస్ ప్రెసిడెన్సీ లోని భాగం. రాష్ట్రాల విభజన వరకూ (1936), విశాఖజిల్లాలో ఉంది. అందుకేనేమో, అనువాదంలో కళింగాంధ్ర కోణాన్ని స్వేచ్ఛగా అన్వయించుకుని డాక్టర్ రాజేశ్వరి విజయవంతమయ్యారు. ఈ అనువాద స్వేచ్ఛకు ఆద్యులు పురిపండా అప్పలస్వామి గారు. గోపినాథ్ మహంతి నవల ‘అమృతర సంతాన్’ ను (1947) పురిపండా కళింగాంధ్ర మాండలికం వినియోగించి ‘ అమృతర సంతానం’ పేరుతో (1966) అనువదించారు. ఈ నవలకే, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది. ఒరియా భాష నుంచి ఈ అవార్డు అందుకున్న తొలి రచయిత ఆయనే! పురిపండా వారసురాలిగా డాక్టర్ రాజేశ్వరి ఉభయ భాష సాహిత్య సాంస్కృతిక సేతువుగా, దృఢంగా నిలబడ్డారు. ఆమె కృషి కొనసాగాలి. ‘ఈత చెట్టు దేవుడు’ పై, పద్మావతి విశ్వవిద్యాలయంలో (తిరుపతి) ఒక పరిశోధనా పత్రాన్ని సమర్పించినట్టు తాజా సమాచారం. డాక్టర్ రాజేశ్వరికి అభ్యుదయ రచయితల సంఘం (అరసం) తరపున అభినందనలూ, శుభాకాంక్షలు.
(ప్రతులు అన్ని ప్రముఖ ప్రచురణ సంస్థల్లోనూ దొరుకుతాయి.)
నల్లి ధర్మారావు, 76609 67313
తెలుగు-ఒరియా సాహిత్య ‘సహృదయ‘ !
- Advertisement -


