Homeమండలిలో ‘మంటలు’

మండలిలో ‘మంటలు’

- Advertisement -

సవాళ్లు`ప్రతి సవాళ్లు

  • పయ్యావుల వర్సెస్ బొత్స సత్యనారాయణ
  • మెగా డీఎస్‌సీపై దద్దరిల్లిన సభ
  • పోడియం చుట్టుముట్టిన విపక్షం

విశాలాంధ్ర-సచివాలయం : ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సమావేశాలు రెండవ రోజూ వాడీవేడిగా సాగాయి. రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన ‘మెగా డీఎస్‌సీ’ నియామకాల అంశంపై సమగ్ర చర్చ జరపాలంటూ వైసీపీ సభ్యులు పట్టుపట్టడంతో సభలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. విపక్ష నేత బొత్స సత్యనారాయణ, సభా వ్యవహారాలు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మధ్య జరిగిన తీవ్రస్థాయి మాటల యుద్ధంతో మండలి ఒక్కసారిగా దద్దరిల్లింది. మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు అధ్యక్షతన సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే, డీఎస్‌సీ స్పోర్ట్స్‌ కోటా, ఇతర నియామకాల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. నియమావళి ప్రకారం ఈ వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించి ప్రశ్నోత్తరాల ప్రక్రియను ప్రారంభించడంతో వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియం చుట్టూ చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. నిరసనల మధ్యే చైర్మన్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. ప్రశ్నోత్తరాల సమయంలోనే ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సభలో మాట్లాడుతూ లక్షలాది మంది నిరుద్యోగ యువత జీవితాలకు సంబంధించిన మెగా డీఎస్‌సీపై సమగ్ర చర్చకు డిమాండ్ చేస్తున్నామన్నారు. దీనిపై అసెంబ్లీ తరహాలోనే మండలిలోనూ ప్రత్యేక సమయం కేటాయించి చర్చించేందుకు ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తోందని, నిరుద్యోగుల సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. వేరే రూపంలో ప్రతిపాదనలు తీసుకురావాలని చైర్మన్ సూచించినప్పటికీ వైసీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు.
అల్లరి చేసి వెళ్లడమే విపక్ష పని : పయ్యావుల కేశవ్
విపక్ష నేత బొత్స వ్యాఖ్యలు, వైసీపీ సభ్యుల ఆందోళనపై ఆర్థిక, సభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘సభలో ప్రజా సమస్యలపై చర్చించడం వైసీపీ సభ్యులకు ఎంతమాత్రం ఇష్టం లేదు. కేవలం సభను అడ్డుకోవడం, రచ్చ చేయడం, అల్లరి చేసి బయటకు వెళ్లిపోవడమే వారి లక్ష్యం. డీఎస్‌సీ అంటేనే గుర్తుకొచ్చేది తెలుగుదేశం పార్టీ. మా పాలనలో ఏకంగా 14 సార్లు డీఎస్‌సీలు నిర్వహించి వేలాది ఉద్యోగాలు ఇచ్చాం. గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పని చేసి… తన ఐదేళ్ల హయాంలో ఒక్క డీఎస్‌సీ కూడా ఇవ్వని బొత్స సత్యనారాయణ… ఈ రోజు నిరుద్యోగుల పట్ల ప్రేమ ఉన్నట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉంది’ అని పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. మండలి చైర్మన్ స్థానానికి కనీస గౌరవం ఇవ్వకుండా వైసీపీ సభ్యులు ప్రవర్తిస్తున్నారని, ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారమే తాము సభా వ్యవహారాలు నడుపుతామని పయ్యావుల తేల్చిచెప్పారు. సభను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని, అంశాలను బిజినెస్ అడ్వైజరీ కమిటీలో నిర్ణయిద్దామని చైర్మన్ విజ్ఞప్తి చేసినా… రెండు పక్షాల హోరాోరీ నినాదాలతో సభ తీవ్ర రసాభాసగా మారడంతో చైర్మన్ సభను వాయిదా వేశారు.
వైసీపీ ఎమ్మెల్సీలు ర్యాలీగా అసెంబ్లీకి…
డీఎస్‌సీ అక్రమాలపై చర్చకు పట్టుబడుతూ వైసీపీ ఎమ్మెల్సీలు ర్యాలీగా అసెంబ్లీకి వచ్చారు. ఆ సమయంలో పోలీసులు వాళ్లను అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. డీఎస్‌సీ అక్రమాలపై విచారణ జరిపించాలని, మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు ఫ్లెక్సీలతో గేటు వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరారు. ఆ సమయంలో పోలీసులు వాళ్లను అడ్డుకుని బారికేడ్లు అడ్డుపెట్టారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు