London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

ఏడవ లేక ఎద్దేవా

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం లోక్‌సభలో చర్చ ప్రారంభించిన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి మోదీ మనసును ఛిద్రం చేసేశారు. అప్పటికే రాహుల్‌ ప్రసంగం మధ్యలో రెండుసార్లు జోక్యం చేసుకుని సభా సంప్రదాయాన్ని ఉల్లంఘించారు. ఇలాంటి సందర్భాలలో ప్రతిపక్ష నాయకుడు చర్చ ప్రారంభించడం, చర్చ ముగిసిన తరవాత ప్రధానమంత్రి సమాధానం చెప్పడం పరిపాటి. ప్రధానమంత్రి మోదీ తాను దైవాంశ సంభూతుడిని అని చెప్పుకుంటారుగనక రాహుల్‌ గాంధీ గంటా నలభై నిముషాలు మాట్లాడితే మోదీ రెండు గంటలకు పైగా మాట్లాడారు. రాహుల్‌ అంత తీవ్ర విమర్శలు చేసిన తరవాత ప్రధాని ఏ సమాధానం ఇస్తారోనని ఎదురు చూడడం సహజమే. రాహుల్‌ను పప్పు అని సంబోధించిన మోదీకి ఇప్పుడు అదే మాట మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. అందుకని ఈ సారి కొత్త మాట కనిపెట్టి ‘‘బాలక్‌’’ అన్నారు. యాభై ఏళ్లు దాటినా రాహుల్‌ కు బాల్య చేష్టలు పోలేదని మోదీ నమ్ముతున్నారు. అందుకే ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ప్రసంగంలో మోదీకి ‘‘బాలక్‌ బుద్ధి’’ మాత్రమే కనిపించింది. రాహుల్‌ లేవనెత్తిన ఒక్క అంశానికి కూడా సమాధానం ఇచ్చే శక్తి బీజేపీకీ, మోదీకి లేదు. అందువల్ల నరనరాల్లో జీర్ణించుకుపోయిన అసత్య ప్రచారం, వక్రీకరణ, విద్వేషం అనే ఇదివరకటి మాటలనే మోదీ తన సమాధానంలో ధారాళంగా వినియోగించారు. అసలు రాహుల్‌ మాట్లాడుతున్నంత సేపూ మోదీ సభలో ఉండడం విశేషమే. రాహుల్‌ మాట్లాడడం అయిపోగానే వెళ్లి పోయారు. ప్రతిపక్ష నాయకుడు ప్రధానమైన ప్రసంగం చేసేటప్పుడు సభా నాయకుడు సభలో ఉండాలన్న నియమం ఉంది కాబోలు. అందుకే ఊపిరి బిగబట్టి కూర్చున్నట్టున్నారు. మంగళవారం మోదీ సమాధానం ఇవ్వాల్సి వచ్చిన సమయంలో పాత అబద్ధాలకు తోడు కొల్లలుగా కొత్త అబద్ధాలను గుప్పించారు. బాలక్‌, బాలక్‌ బుద్ధి లాంటి మాటలను పదే పదే వాడి పార్లమెంటరీ పరిభాషను కలుషితం చేశారు. ప్రతిపక్ష నాయకుడిని అలాంటి చవకబారు మాటలతో సంబోధించడం పార్లమెంటరీ వ్యవస్థ మీద ఏ మాత్రం విశ్వాసంలేని మోదీ లాంటివారికే సాధ్యం. ఏ ప్రధానమంత్రీ ఇప్పటిదాకా ఇంత చౌకబారుగా మాట్లాడిన దాఖలాలు లేవు. సందు దొరికితే కళ్లు మూసుకునే నిద్రపోయే గౌడ అనిపించుకున్న దేవగౌడ కూడా పార్లమెంటులో హుందాగానే ప్రవర్తించారు. అందరు నాయకులూ ఒకలా ఉండరు. ఎవరి తాహతు వారిది. ఎవరి సామర్థ్యం వారిది. ఎవరి విషయ పరిజ్ఞానం వారిది. అందులో హెచ్చు తగ్గులు ఉండొచ్చు. అవి సహజం. కానీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, 2014, 2019 ఎన్నికల తరవాత ప్రధానమంత్రి అయినప్పుడు బీజేపీకి సంపూర్ణమైన మెజారిటీ ఉంది కనక ఆయన నిరాటంకంగా ఆధిపత్య ధోరణి అనుసరించగలిగారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎన్‌.డి.ఎ. భాగస్వామ్య పక్షాల మీద ఆధారపడక తప్పని పరిస్థితి. అయినా ఆధిపత్యం చెలాయించడానికి మాత్రమే అలవాటుపడిన వ్యక్తికి అమాంతం అణకువ అలవడుతుందనకోవడం అత్యాశే. అందుకే రాహుల్‌ పేరెత్తకుండానే బాలక్‌, బాలక్‌ బుద్ధి లాంటి నేలబారు మాటలు మాట్లాడగలిగారు. బాలక్‌, బాలబుద్ధి అనడం ద్వారా మోదీ బాలలను అవమాన పరిచినట్టే. ప్రతిపక్షం, ప్రతిపక్ష నాయకుడు అంటే మోదీలో ఛీత్కార దృష్టి మోదీ మనసులో గూడు కట్టుకుంది. ఆయన అహంకారానికి చిహ్నం. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడితో సహా ఎంత సీనియర్‌ నాయకుడైనా ఒక్కోసారి నోరుజారే అవకాశం ఉండొచ్చు. కాని విజ్ఞులైన సభ్యులు తమ తప్పు గ్రహించి వెంటనే క్షమాపణలు చెప్తారు. కానీ మర్యాద అతిక్రమించడం మోదీకి నిత్యకృత్యం.
1984 తరవాత కాంగ్రెస్‌ కు ఎన్నడూ 250 సీట్లు మించి రాలేదని మోదీ దెప్పి పొడిచారు. కానీ 1991 ఎన్నికలలో కాంగ్రెస్‌ కు 232 స్థానాలే వచ్చినా పీవీ నరసింహా రావు ప్రభుత్వం అయిదేళ్లూ విజయవంతంగా పదవీ కాలం పూర్తి చేసుకుంది. ఈ సారి ఎన్నికలలో బీజేపీ ఎందుకు 240 సీట్ల దగ్గరే కుదేలైపోయిందో మాత్రం మోదీ తన ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు. వాస్తవం అంగీకరించడం మోదీవల్ల అయ్యే పని కాదు. అనివార్యంగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి వచ్చినా సంకీర్ణ ధర్మాన్ని నిర్వర్తిస్తానని మాత్రం చెప్పలేక పోయారు. బీజేపీ సైద్ధాంతిక చిత్ర పటాన్ని రాహుల్‌ ఛిద్రం చేశారు. బీజేపీ సిద్ధాంత ప్రాతిపదికను రాహుల్‌ నిండు సభలో ఛిన్నాభిన్నం చేయడంతో మోదీ చలించి పోయారు. అందుకే రాహుల్‌ గాంధీ ప్రసంగంలోని ప్రధానాంశాలన్నింటినీ వక్రీకరించి ఎదురు దాడికి దిగారు. రాహుల్‌ గాంధీ నేరుగా హిందుత్వ సిద్ధాంతాన్ని ఎండగట్టారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌., బీజేపీకి హిందుమతంతో సంబంధమే లేదన్నారు. దీన్ని మోదీ రాహుల్‌ హిందువులందరినీ అవమానించారు అని వక్రీకరించారు. మోదీ, బీజేపీ, ఆర్‌.ఎస్‌.ఎస్‌. హిందూ మతాన్ని గుత్తకు తీసుకోజాలదు అని రాహుల్‌ అనడం మోదీ బృందానికి బొత్తిగా మింగుడు పడలేదు. కాంగ్రెస్‌ మిత్రపక్షాల మీద ఆధారపడ్డ పరాన్న జీవి అని మోదీ తనకు ఇష్టమైన పాత మాటను పాముల బుట్ట లోంచి తీసినట్టే తీశారు. తన ప్రభుత్వమూ ఇప్పుడూ మిత్ర పక్షాల మీద ఆధారపడిరదేగా! పైగా ఈ సారి జనం తమ ఏలుబడిని మెచ్చి సుస్థిరత, నిరంతరత కోసం బీజేపీని గెలిపించారని మోదీ నోటి నిండా అబద్ధమాడారు. అదే నిజమైతే బీజేపీకి మెజారిటీ వచ్చి ఉండాలిగా! పార్లమెంట్‌ లో నిర్భయంగా, కేసుల బాధ లేకుండా మాట్లాడడానికి ఉన్న విశేషాధికారాన్ని మోదీ అసత్య ప్రచారానికి లైసెన్సుగా మార్చేశారు. ప్రతిపక్షాలు బలపడిన సందర్భాన్ని సంవాదానికి, సంప్రదింపులకు వినియో గించుకోవలసింది పోయి ప్రతిపక్షాన్ని అణగదొక్కే క్రమంలో అపఖ్యాతిపాలుచేసే మార్గాన్నే ఎంచుకున్నారు. ఇప్పటిదాకా పదేళ్ల తమ ప్రభుత్వం కేవలం ఆకలి పెంచేదేనని, అసలు భోజనం ఇక ముందు ఉంటుంది చూడండి అంటున్నారు. కాంగ్రెస్‌ కు 60 ఏళ్లు ఇచ్చారు, నాకు 60 నెలలు ఇవ్వండి చాలు అని ప్రధాని కాక ముందు మోదీ అన్న తన మాటలను తానే విస్మరించారు. పదేళ్లలో ఏమీ చేయలేక పోయినందువల్లే 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుంది చూడండి అని కొత్త ఆశలు కల్పిస్తున్నారు. పార్లమెంటులో సాక్షాత్తు ప్రధనమంత్రే దిగజార్చే స్థాయిలో మాట్లాడినప్పుడు వాటి మీద విమర్శలు కూడా అదే స్థాయిలో ఉండడం అనివార్యం కానక్కర్లేదు. కానీ అసత్యాలను, వక్రీకరణలను పొట్ట విప్పి చూడాల్సిందే. సార్వత్రిక ఎన్నికల తరవాత ఏర్పడిన లోక్‌సభలో ప్రతిపక్షాలకు గొంతు విప్పే అవకాశం వచ్చినందుకు సంతోషించాలిగానీ, మోదీ అసత్య ప్రచారాలను, వక్రీకరణలను ఎదుర్కునే మార్గం ఏమిటో అన్వేషించవలసిందే. మోదీ దేవతా వస్త్రాల గుట్టు విప్పాల్సిందే. రాహుల్‌ విమర్శనాస్త్రాలు మోదీని చిందరవందర చేశాయి. అందుకే ఏడవలేక ఎద్దేవా చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img