Sunday, October 27, 2024
Sunday, October 27, 2024

వరమిచ్చేదెవరు?

చింతపట్ల సుదర్శన్‌

కుయ్యోవ్‌…మొర్రోవ్‌ అంటున్నది పాత ఇంటి అరుగు మీద డాగీ. అప్పటికే సగం నిద్రలోకి జారుకున్న డాంకీ ఉలిక్కిపడిరది. నిద్ర చెడి, చికాకుపడి అడిగింది. ఏమిటి ‘బ్రో’ ఎందుకా కుయ్యో మొర్రోవ్‌లు. ఏమిటి ప్రాబ్లం అని.ఏం చెప్పనన్నా ఎన్నికల్లో గెలిచిన ఓ కాండేటు సంబరాలు చేసుకుంటున్నాడు. సరదాగా చూద్దామని వెళ్లా. సనాతన ధర్మం పార్టీ మనిషే కదా చక్కెర పొంగలి చిక్కదా అనుకున్నా. కానీ అక్కడ సీనే వేరు. వారెవ్వా క్యా సీన్‌ హై అనిపించింది. ఏమిటో ఆ సీను మాకూ చూపించ రాదూ అంది డాంకీ. ఏం చెప్పను. జనం క్యూలో నిలబడున్నారు. రాములల్లా దర్శనానికేమోననుకున్నా. కాదు. ఆ గెలిచిన ఆసామి వందల కేసుల బీర్లూ, అన్ని కేసుల మందూ పంచి జనానికి పండుగ చేశాడనుకో. ఇందులో ఆశ్చర్యపడాల్సిందేముంది. ఎలెక్షన్‌లకు ముందు మందు సీసాలు పంచి ఉంటాడు. మందు పుణ్యం వల్లనే కదా గెలిచామని మరొక్కసారి జనానికి మందు కొట్టించి థాంక్స్‌ చెప్పుకుని ఉంటాడు, ఇంతకీ కుయ్యో మొర్రోల సంగతి చెప్పనేలేదు అంది డాంకీ. ఏం చెప్పను సీసా అందిన వాడో అందుతుందో లేదో అని ఆదుర్దాగా పరుగెత్తిన వాడో నా తోక తొక్కి పోయాడు. ఒకటే నొప్పి. నొప్పి…నొప్పి… అంటూ డాగీ కుయ్యో మొర్రోవులు కంటిన్యూ చేసింది. అరెరే ఎంత పనయింది. నొప్పి తగ్గడానికి టాబ్లెట్లుంటాయి కాని మనకెవడిస్తాడు. పశువుల ఆసుపత్రికి వెళ్తే యజమాని కుక్కలకూ, గాడిదలకూ మందివ్వరు. మనుషులకు ఆర్యోశ్రీ పథకం ఉన్నది కాని మనకు ఏ పథకాలూ లేవుకదా అని నిట్టూర్చింది డాంకీ. అవును బ్రో అప్పుడెప్పుడో ఎవడో ఇలాగే నా తోక తొక్కితే తిక్కరేగి శాపం పెట్టాను. ఈసారి మరో పార్టీ గెలిచింది చూశావా నా తడాఖా. ఈసారి ఈ పార్టీకి శాపం పెట్టానా…గోవిందా గోవిందే. ఫక్కుమని నవ్వింది డాంకీ. పిల్లి శాపాలకు ఉట్లు తెగవు అన్న సామెత విన్నాను కానీ కుక్క శాపం అన్నమాట ఎప్పుడూ వినలేదు అంది డాంకీ. నీకు తెలీదు ‘బ్రో’ ఈ మనుషుల సంగతి. ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగాక బోడి మల్లన్న అంటారు. ప్రజలు ఓట్లేస్తే గెలిచి అంతా తమ ఘన కార్యమేనని ఒళ్లు తెలీకుండా నీల్గుతారు. వీలైతే తెగ్గోస్తారు కూడా. అందుకే వీళ్లను శపించాలి అంది డాగీ. పిల్లి శాపాలకూ, కుక్కల కుయోవ్‌లకూ, రాజకీయాలకూ సంబంధం లేదోయ్‌. ఈ ఓటర్లున్నారు వీళ్ల సైకాలజీ ఎవళ్లకీ అర్థం కాదు. తల్చుకుంటే అమాంతం ఆకాశానికి ఎత్తేస్తారు. లేకపోతే పాతాళానికి తొక్కేస్తారు అంది డాంకీ.
నేను ఒప్పుకోను డాంకీ భయ్యా! ఓటర్లు మందుకు, డబ్బుకు మాత్రమే ఓట్లేస్తున్నారని, పుణ్య పురుషులకు కాదని విన్నాను అంది డాగీ తోకకేసి దిగులుగా చూసుకుంటూ. అలాగనకు మన వాళ్ల నిజాయితీ నిప్పులాంటిది సుమా! ఎవర్నీ కాదనలేక మొహమాటంగా అందరి దగ్గరా తీర్థంపుచ్చుకుని, ప్రసాదంగా డబ్బు అందుకుని తాము ఎవరికి వెయ్యాలనుకున్నారో వారికే వేస్తున్నట్టున్నారు ఓట్లు. ఓట్లు పడ్డం కొందరి సీట్లకి చిల్లులు పడ్డం జరిగినా ఇంకా ఆ టాపిక్‌ వదల్లేదా మరో ఐదేళ్ల ఆగలేరా, కళ్లు మూసుకుంటే ఇట్టే అయిపోతాయని ఓ జగమెరిగిన వాడు కూయలేదా అంటూ అరుగెక్కాడు అబ్బాయి. ఓట్ల జాతర అయిపోయినా సీట్ల జాతర మళ్లీ ఓట్ల దాకా ఉండేదే కదన్నా. ఇక ఓడిపోయిన వాళ్లు తాము జార్చుకున్న సీట్ల వంక చొంగకారుస్తూ కూచునే ఉంటారు కద అంది డాగీ మాటల్లో పడితే తోక బాధ మరిచిపోవచ్చుననే ఆశతో. నువ్వన్నది నిజమే. గోతికాడ నక్కల్లా పొంచి ఉండి, సీటెక్కిన వాడి తప్పులు వెదకడం, లెక్కలు రాయడం, తాము చేసింది, పొడి చేసింది ఎవడూ చెయ్యలేడని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం ఇవే కదా చేసేది ఓడిన వాళ్లు అన్నాడబ్బాయి. గెలిచిన వాళ్లకు మాత్రం సుఖం ఎక్కడిది. ఆరునెలల్లో కూలబడతారని, రాలిపడతారని చిలక జోస్యాలు, రాశి ఫలాలూ చెప్తూనే ఉంటారు కదా చెప్పేవాళ్లు. ఇదొక వైపైతే ఉన్నవాళ్లను గట్టిగా వాటేసుకుని, ఎదుటి పార్టీ వాళ్లని ఎందుకైనా మంచిది అని తమ వేపు లాక్కుని ప్రతిపక్షం అనేదే లేకుండా చేస్తేనే కద అయిదేళ్లూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు గెలిచినవాళ్లు. అందుకే కద ఫిరాయింపులు, ఫిరాయింపులు ముదిరితే విలీనాలు అన్నాడు అబ్బాయి. ఎక్కడి నిద్ర. ఓడిన వాడికి ఓడినందుకు నిద్ర కరువు. గెలిచిన వాడికి గెలిచినందుకు నిద్ర కరువు. పార్టీలో పనిలేని వాళ్లందరూ కృష్ణా రామా అని భజన చేసుకుంటూ ఉండరు కద. ఏదో ఓ హోదా లేకుండా ఊపిరి ఆడదు కద అంది డాగీ. అందుకే గదా గవర్నరు గిరీలు, నామినేషన్‌ పదవులు, సలహాదార్ల కొలువులు. పార్టీలో ఉన్నవాళ్ల కడుపు కొట్టవద్దు. పార్టీలోకి వచ్చిన వారి కడుపు నింపకుండా ఉండద్దు. అందరి వైభోగాలూ వెలగడానికి ప్రజల సొమ్ము ఉండనే ఉంది. ఆ పైన అప్పుల కుప్పలు ఉండనే ఉన్నయి. అవీ ఆర్చేదీ తీర్చేదీ ప్రజలే కద అన్నాడు అబ్బాయి. ఇప్పుడు గెలిచిన మత్తు తలకెక్కి, ఉచితంగా తాగిన మందు కైపెక్కి, నా తోక తొక్కినవాడు వచ్చే ఎలక్షన్లల్లో ఓడిపోవాలి అంది డాగీ.
ఇదివరకైతే ఓడిన వారు, మత్తు దిగినవారు, ఓదార్పు యాత్రలు, పాద యాత్రలు చేసేవారు. ఇప్పుడిరకేదైనా కొత్త యాత్ర కనిపెట్టి నీ శాపం నిజం చేస్తారేమో అన్నాడు అబ్బాయి. నీ శాపం కంటే ప్రజలిచ్చే వరం గొప్పది. వాళ్లకు పనికొచ్చే పనులు చేసిన వారికే వరమిస్తారు వాళ్లు అన్నది డాంకీ.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img