Sunday, October 27, 2024
Sunday, October 27, 2024

పవన్‌ కళ్యాణ్‌ ఆర్‌.ఎస్‌.ఎస్‌. కీర్తి గానం

నిర్దిష్టమైన అభిప్రాయాలు, సిద్ధాంతాలు లేనివారు అంతిమంగా పాలకపక్షానికి అనుకూ లంగా స్థిరపడతారు. ఆ పాలకపక్ష సిద్ధాంతాన్ని వేనోళ్ల కీర్తించి తరిస్తూ ఉంటారు. ప్రసిద్ధ సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌్‌కు రాజకీయాల మీద ఆసక్తి ఎన్నేళ్లుగా ఉందో తెలియదు. ఆయన రాజకీయరంగ ప్రవేశానికి ఉన్న చరిత్ర మాత్రం స్వల్పమే. 2014లో జనసేన పార్టీ స్థాపించిన పవన్‌ కళ్యాణ్‌… 2019 ఎన్నికలలో సీపీఐ, సీపీఎం, బీఎస్పీతో కలిసి పోటీ చేశారు. జనసేన దాదాపు135 సీట్లకు పోటీచేసి ఒక్క రాజోలు నియోజకవర్గంలోనే గెలిచింది. అదీ పవన్‌ కళ్యాణ్‌్‌ కాదు. రాపాక వరప్రసాద్‌ జనసేన అభ్యర్థిగా గెలిచారు. అప్పుడు పవన్‌ కళ్యాణ్‌ విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీచేసి రెండు చోట్లా ఓడిపోయారు. ఆయన సోదరుదు చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టి తిరుపతి, సొంత ప్రాంతం పాలకొల్లు నుంచి పోటీ చేశారు. తిరుపతి ప్రజలు ఆయనను గెలిపించారు. కానీ సొంత ప్రాంతం వారు ఓడిరచారు. ఆ తరవాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏకంగా కాంగ్రెస్‌లో కలిపేసి రాజ్యసభ సభ్యత్వంతో రాజీ పడ్డారు. అది ముగిసిన తరవాత చిరంజీవి రాజకీయ హడావుడి ఏమీ లేదు.
ఇటీవలి శాసనసభ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీతో పొత్తు, బీజేపీతో లంకె కుదుర్చుకుని పవన్‌ కళ్యాణ్‌ నాయకత్వంలోని జనసేన 21 స్థానాల్లో పోటీచేసి అన్ని చోట్లా విజయం సాధించింది. పవన్‌ కళ్యాణ్‌ ఉపముఖ్యమంత్రి అయిపోయారు. ఎన్నికల సమయంలో శ్రుతి కలవని పార్టీలు కూడా నాలుగు సీట్లు సంపాదించుకోవడానికి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం మామూలే. కానీ అలా పొత్తుపెట్టుకున్న పార్టీల కీర్తిగానంలో మునిగిపోయిన సందర్భాలు అరుదు. ఆ లోటు పవన్‌ కళ్యాణ్‌ తీర్చేశారు. తెలుగుదేశం పార్టీతోనే కాక బీజేపీతోనూ పొత్తు పెట్టుకుని పోటీ చేసినందువల్ల బీజేపీ గురించి నాలుగు మంచి మాటలు చెప్తే పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన పని లేదు. పవన్‌ కళ్యాణ్‌ అక్కడితో ఆగలేదు. తాజాగా బీజేపీకి గురుస్థానంలో ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆర్‌.ఎస్‌.ఎస్‌.)ను నోరారా పొగిడారు. ‘‘ఆర్‌.ఎస్‌.ఎస్‌. వారు రాజకీయాల్లోకి వచ్చినా నిస్వార్థంగా పనిచేసి అలా వెళ్లిపోతారు. జనరల్‌ సెక్రటరీలు అవుతారు. మళ్లీ కార్యకర్తలుగా వెళ్లిపోతారు. అది చాలా గొప్ప సంస్థ. దాన్నుంచి మనం స్ఫూర్తి తీసుకుంటాం. వారెంతసేపు దేశం, సమాజం, దేశ సమగ్రత మీద ఉంటారు. నిస్వార్థంగా ఉంటారు. వారి నుంచి మనం ప్రేరణ తీసుకోవాలి’’ అని అన్నారు పవన్‌ కళ్యాణ్‌. పదవులువస్తే తీసుకుందాం. కానీ నిస్వార్థంగా ఉండాలి. పదవి లేనప్పుడు కూడా అంతే నిబద్ధతతో పని చేయాలి. నేను అలాంటి వాడిని అని ఆయన తన వీపు తానే చరుచుకున్నారు. నిస్వార్థత గురించి పవన్‌ కళ్యాణ్‌ ధర్మోపన్యాసం చేయడానికి కారణం లేకపోలేదు. ఆయన ఉపముఖ్యమంత్రి కనక… పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో చంద్రబాబు నాయుడు ద్వారా దోస్తీ కుదిరింది కనక…ఆయనను ఆ పదవి ఇప్పించమని, ఈ పదవి ఇప్పించమని అడిగేవారు కచ్చితంగా ఉంటారు. అందరినీ సంతృప్తి పరచలేనని ఆయనకు తెలుసు. అందుకే నిస్వార్థత గొప్పతనం మీద సూక్తి ముక్తావళి వినిపించారు. కీలకమైన శాఖల్లో పదవులు ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నానని హామీ ఇచ్చారు. నేను ప్రయత్నం చేస్తున్నానని చెప్తూ తప్పొప్పులు ఎక్కడైనా ఉంటే మీరు కోప్పడకుండా హరిప్రసాద్‌ దృష్టికి తీసుకు రండి అని ఎవరికి నివేదించాలో మార్గనిర్దేశం కూడా చేశారు. ఇంకో ఒకరిద్దరి పేర్లు మాత్రం చెప్పారు. అంటే పదవులు కోరుకునే వారు ఎవరిని ఆశ్రయించాలో చెప్పేశారు.
ఇక్కడిదాకా బాగానే ఉంది. పవన్‌ కళ్యాణ్‌ ఆర్‌.ఎస్‌.ఎస్‌.ను పొగిడిన తీరు చూస్తే మాత్రం ఆయన రాజకీయ సిద్ధాంతం కోసం అన్వేషిస్తున్నారేమో అనిపిస్తోంది. పవన్‌ కళ్యాణ్‌ ఎన్నికల విజయం కోసం తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం అధినేత ఈసారి మళ్లీ బీజేపీ వేపు మొగ్గారు కనక పవన్‌ కళ్యాణ్‌ రైలు ఇంజన్‌ వెనకే వెళ్లే బోగీల్లాగా వెళ్లిపోయారు. చిక్కెక్కడ అంటే చాలా ప్రాంతీయ పార్టీలకు నికరమైన రాజకీయ సిద్ధాంత బలం ఏమీలేదు. ప్రాంతీయ ప్రయోజనాల ఆధారంగానే చాలా ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి. అధికారంలోకి వచ్చే అవకాశం వచ్చిన ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సఖ్యంగా ఉంటే తమ రాష్ట్రానికి ఎంతో కొంత మేలు కలగక పోతుందా అన్న ఆశలు పెంచుకున్నాయి. ఇంతవరకు చాలా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. వాటిలో ఎక్కువ భాగం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సఖ్యతగా ఉండడానికి ప్రధాన కారణం కేంద్రం నిధులేమన్నా కాస్త ఎక్కువగా విదిలిస్తుందేమోనన్న ఆశే.
నిరంతరం సెక్యులర్‌ విధానాలకు కట్టుబడి ఉన్న పార్టీలూ తక్కువే. దీనికి మినహాయింపు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్‌.జె.డి.) మాత్రమే. ఎంత క్లిష్ట పరిస్థితి వచ్చినా ఇదివరకు లాలూ నాయకుడిగా ఉన్నప్పుడుగానీ, ప్రస్తుతం తేజస్వీ యాదవ్‌ నాయకత్వంలో ఉన్నప్పుడు గానీ ఆర్‌.జె.డి. ఎన్నడూ సెక్యులర్‌ విధానాల విషయంలో రాజీ పడలేదు. మతతత్వవాదుల పంచన చేరలేదు. పోటీ చేసిన అన్ని సీట్లలో గెలిచి రికార్డు సృష్టించిన జన సేన నాయకుడికి హఠాత్తుగా ఆర్‌.ఎస్‌.ఎస్‌.ను పొగడడానికి రెండు కారణాలు ఉండొచ్చు. బీజేెపీతో సఖ్యత కొనసాగాలంటే మోదీని మాత్రమే ప్రసన్నుణ్ని చేసుకుంటే ఉండే ప్రయోజనం కన్నా, బీజేపీకి గురుపీఠం అయిన ఆర్‌.ఎస్‌.ఎస్‌. స్తోత్ర పాఠాలు వినిపిస్తే రెండిరతల ప్రయోజనం ఉంటుందని భావించి ఉండొచ్చు. అదీ కాకపోతే పవన్‌ కళ్యాణ్‌కు మతతత్వం ఉన్నా లేకపోయినా మతతత్వవాదాన్ని సహించే గుణమైనా ఉండి ఉండాలి. ఆయన నుదుటిన ఇంత లావు కుంకుమ బొట్టు లాంటివి ఆయన మతాభినివేశానికే ప్రతీకలు. ఆర్‌.ఎస్‌.ఎస్‌.ను కీర్తించడం అంటే ఆ సంస్థ ఉనికికి మూలకందమైన మతోన్మాదాన్ని భుజాన వేసుకోవడమే. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి బీజేపీతో పొత్తు కలిసిన చరిత్ర ఇంతకుముందు కూడా ఉంది. కానీ ఆయన ఆర్‌.ఎస్‌.ఎస్‌.ను కీర్తించిన సందర్భం కనిపించడం లేదు. ఆచరణలో తెలుగు దేశం పార్టీ మతతత్వ వాదులను సమర్థించిన ఉదంతమూ లేదు.
అలాంటప్పుడు పవన్‌ కళ్యాణ్‌ బాహాటంగా ఆర్‌.ఎస్‌.ఎస్‌.ను నోరారా కీర్తించడానికి సైద్ధాంతికగా పవన్‌ కళ్యాణ్‌ అంతరాంతరాల్లోనైనా మతతత్వం గూడు కట్టుకుని ఉందేమో! ఇక్కడ మతతత్వానికి మతోన్మాదానికి ఉన్న సూక్ష్మమైన తేడా కూడా గమనించాలి. పవన్‌ కళ్యాణ్‌ మతోన్మాది అనడానికి ఆధారాలేమీ లేవు. మతతత్వవాదులను, కడకు మతోన్మాదులను సమర్థించే లక్షణం మాత్రం స్పష్టంగానే కనిపిస్తోంది.చాలా ప్రాంతీయ పార్టీలు తమ ప్రాంత అభివృద్ధి అంశం ఆధారంగా ఏర్పడినవే కావచ్చు. కానీ కుల సమీకరణలు కూడా ప్రాంతీయపార్టీల అవతరణకు తోడ్పడ్డాయి. చాలా ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌ తానులోని ముక్కలే. పవన్‌ కళ్యాణ్‌కు కాంగ్రెస్‌తో సంబంధమే లేదు. ఆయన అగ్రజుడు సొంతపార్టీని రద్దుచేసి కాంగ్రెస్‌లో విలీనం చేసేశారు. పవన్‌ కళ్యాణ్‌ కూడా జనసేన పార్టీని బీజేపీలో విలీనంచేసే అవకాశం ఉందేమోనన్న ఊహాగానాలు నిరాధారం కావేమో! నిర్దిష్టమైన రాజకీయ సిద్ధాంతాలు లేనివారు ఏదో ఆశతో రాజకీయాల్లోకి వస్తే పరిస్థితి భిన్నంగా ఉండదు.

  • అనన్య వర్మ

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img