Sunday, October 27, 2024
Sunday, October 27, 2024

ఉన్నత విద్య అందని ద్రాక్షేనా!

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 సంవత్సరాలు గడిచినా ఉన్నత విద్య చాలా మందికి అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. మోదీ పాలనలో దేశంలో ఉన్నత విద్యకు దూరమవుతున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ప్లానింగ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ( ఎన్‌యూఈపీఏ) నివేదిక ప్రకారం, 25 శాతం మంది ఉన్నత విద్యను మధ్యలోనే మానేస్తున్నారు. అంటే కాలేజీలో చేరిన ప్రతి నలుగురిలో ఒకరు డిగ్రీ పూర్తి చేయడంలేదు. కేంద్ర విశ్వవిద్యాలయాలు డ్రాపౌట్లకు కేంద్రంగా నిలిచాయి. విద్యార్థులు మధ్యలో చదువు మానేయడానికి కారణాలు అనేకం. అందులో కులవివక్ష ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఆధునిక ప్రపంచంలోనూ నిమ్నవర్గాల విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు. ఇందుకు ఆర్థిక, సామాజిక కారణాలకు తోడు క్యాంపస్‌లలో కులం పేరిట వేధింపులు కూడా కారణంగా చెప్పవచ్చు. ఫీజులు, భరించలేని జీవన వ్యయం మరొక అత్యంత ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కొంత మంది విద్యార్థులు తగినంతగా సిద్ధపడక పోవడం ఇంకో కారణం. మరికొంత మంది విద్యార్థులు కుటుంబ బాధ్యతలు లేదా ఆరోగ్య సమస్యలు వంటి వ్యక్తిగత సమస్యలు చదువును కొనసా గించడం కష్టతరం చేస్తుంది. విద్యాభ్యాసంలో అనేక మంది విద్యార్థులకు వారి కుటుంబం, స్నేహితులు లేదా ఉపాధ్యాయుల నుంచి అవసరమైన మద్దతు లభించడంలేదు. దేశంలోని అత్యధిక కళాశాలలకు డ్రాపౌట్‌ రేటు ఒక తీవ్రమైన సమస్యగా పరిణమించింది. ఇది అనేక ప్రతికూల పరిణా మాలకు దారితీస్తోంది. మధ్యలో చదువు మానివేయడం నిరుద్యోగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పేదరికం, నేరాలు పెరగడం వంటి సామాజిక సమస్యలకు హేతువవుతోంది. మధ్యలో చదువు మానివేయడం వల్ల జీవితంలో విజయం సాధించేందుకు అవసరమైన నైపుణ్యాలు, జ్ఞానం అరకొరగానే సంపాదించగలుగుతారు.
గడిచిన ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల విద్యార్థులు 13వేల మందికిపైగా ఉన్నత విద్యకు దూరమయ్యారు. మధ్యలో చదువు మానివేసిన వారిలో 2,622 మంది ఎస్టీలు, 2,424 మంది ఎస్సీలు, 4,596 మంది ఓబీసీలు ఉన్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. 2018-23లో ఉన్నత విద్యకు దూరమైన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థుల వివరాలను గత ఏడాది డిసెంబరులో అప్పటి విద్యాశాఖ సహాయ మంత్రి సభాశ్‌ సర్కార్‌ రాజ్యసభలో రాతపూర్వకంగా తెలిపారు. దాని ప్రకారం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లలో 2018 నుంచి 2023 వరకు వివిధ కోర్సుల్లో మధ్యలో చదువు మానివేసిన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థుల సంఖ్య 13,626. ఐఐటీల నుంచి 2,066 మంది ఓబీసీలు, 1,068 మంది ఎస్సీలు, 408 మంది ఎస్టీలుÑ ఐఐఎంల నుంచి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు వరుసగా 188, 91 మంది చొప్పున మధ్యలో చదువు మానివేస్తున్నారు.
ఈ సమస్య పరిష్కారానికి కేంద్రప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టిందని మంత్రి చెప్పారు. పేద విద్యార్థుల ఉన్నత విద్య కల సాకారానికి అనేక పథకాలు తెస్తున్నట్లు చెప్పారు. ఫీజు రాయితీ, కొత్త ఇన్‌స్టిట్యూట్ల ఏర్పాటు, జాతీయ`రాష్ట్ర స్థాయి స్కాలర్‌షిప్‌ల కల్పనతో పాటు ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంక్షేమం కోసం ఐఐటీల్లో ట్యూషన్‌ ఫీజు మాఫీ, ఇన్‌స్టిట్యూట్‌లలో స్కాలర్‌షిప్‌లు కల్పించడం వంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఇన్‌స్టిట్యూట్‌లలో గ్రీవియెన్స్‌ సెల్స్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడిరచారు. ‘ఎస్సీ/ఎస్టీ స్టూడెంట్‌ సెల్స్‌’, ‘సమాన అవకాశాల విభాగం, విద్యార్థుల గ్రీవియెన్స్‌ సెల్‌, గ్రీవియెన్స్‌ కమిటీ, స్టూడెంట్స్‌ సోషల్‌క్లబ్‌, లైసన్‌ ఆఫీసర్స్‌, లైసన్‌ కమిటీ వంటివి ఇన్‌స్టిట్యూట్‌లలో నెలకొల్పినట్లు మంత్రి చెప్పారు. విద్యార్థుల్లో సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు అందిస్తోందని కూడా వెల్లడిరచారు. అయితే, ఈ ప్రకటన చేసి దాదాపు ఏడు మాసాలు గడిచినా ఆ దిశగా మోదీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అత్యంత విచారకరం. ఐఐటీ, ఐఐఎం క్యాంపస్‌లలో ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల సంఖ్య 33కుపైగా ఉన్నట్లు ఈ ఏడాది ఆరంభంలో పార్లమెంటుకు విద్యాశాఖ తెలిపింది. 2014 నుంచి 2021 వరకు కేంద్ర ఉన్నత విద్యా సంస్థల్లో 122 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు 2021, డిసెంబరులో కేంద్రప్రభుత్వం పేర్కొంది. వీరిలో 24 మంది ఎస్సీలు కాగా ముగ్గురు ఎస్టీలు, 41 మంది ఓబీసీ విద్యార్థులు ఉన్నట్లు తెలిపింది. అన్ని వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులో ఉండేలా పాలకులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైన విద్యార్థులు అందరికీ ఎటువంటి షరతులు లేకుండా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలి. విద్యార్థులను సంసిద్ధులను చేయడంలో పాఠశాల వ్యవస్థ మెరుగైన కృషి చేయాలి. వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటున్న విద్యార్థులకు కౌన్సెలింగ్‌, అవసరమైన సహాయ సహకారాలు అందించాలి. కళాశాలలు విద్యార్థులకు శిక్షణ, మార్గదర్శకత్వం వంటి కార్యక్రమాలను అందించాలి. దేశంలో ఉన్నత విద్య స్థాయిలో మధ్యలో చదువు మానివేసే రేటును తగ్గించడం ఒక క్లిష్టమైన సవాలు, అయితే ఈ విధంగా చేయడం దేశ భవిష్యత్తుకు ఎంతో అవసరం. కళాశాలను మరింత సరసమైనదిగా చేయడానికి, అకడమిక్‌ ప్రిపరేషన్‌ను మెరుగుపరచడానికి, వ్యక్తిగత సమస్యలను పరిష్కరించడానికి మరియు మరింత మద్దతును అందించడానికి చర్యలు తీసుకోవడం ద్వారా, ఎక్కువ మంది విద్యార్థులు తమ కళాశాల విద్యను పూర్తి చేయడానికి, వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉండేలా భారతదేశం సహాయపడుతుంది.
ఎం. లక్ష్మీరాజ్యం

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img