Monday, October 28, 2024
Monday, October 28, 2024

అభిషేకం

చింతపట్ల సుదర్శన్‌

పొద్దున వచ్చిన వాన, పొద్దుగూకంగ వచ్చిన చుట్టం ఓపట్టాన వదలనన్నట్టు మూడు రోజులు ముసుర్లూ, జల్లులూ, జడులూ కురిపించిన వాన తెరిపిచ్చింది. మబ్బులు మాయమవడంలో సూరీడు ఆకాశంలో గాజు పేపర్‌ వెయిట్‌లా మెరవసాగాడు.
మూడునాళ్ల నించీ వానలో తడుస్తూ చెత్తాచెదారంలో దొరికిందేమో నమిలి ఎంతో కుమిలిపోయిన డాగీకి, కొంచెం ఉషారొచ్చి చెవులు దులిపి, తోక విదిలించి రోడ్డు ఎక్కింది. మంత్రుల హామీల్ని మధ్యలోవాళ్లు తుంగలో తొక్కడం మామూలే కద. ఎండ ఇచ్చిన ఉషారు బేజారుగా మారడానికి ఆట్టే తిరగాల్సిన అవసరం లేకపోయింది గోడ గడియారానికి.
మాంసం కొట్టు తాళం వెక్కిరించింది. మాంసాహారం పంటికి తగలకపోతే పోయింది, చప్పరించడానికి నాలుకకి ఏమైనా దొరక్కపోదు అనుకుంటూ వీధంట నడుస్తున్న డాగీకి గుంపులుగా జనం కనపడ్డారు. మళ్లీ ‘రోడ్డు షో’ నా లేక పడిపోతుంది ప్రభుత్వం పడిపోతుంది అనే పిల్లి శాపాలకు, నిజంగానే అలాంటిదేమయినా జరిగిందా అనుకుంది డాగీ.
జనం ఓ పెద్ద వాల్‌పోస్టర్‌ పట్టుకుని చౌరస్తాలో గుమిగూడేరు. ఓ ఎలక్ట్రిక్‌ స్తంభం చాటున నిలబడి ఈ తాజా తమాషా ఏమిటో చూసి తరించవలసిందే అనుకుంది డాగీ. చౌరస్తా మధ్యన నిలబడి ఉన్నది ఓ నాయకుడి చిత్రపటం. దానికి ఆ పక్కా, ఈ పక్కా నిలబడున్నారు మనుషులు. ఇప్పుడు వీళ్లంతాకల్సి ఆ చిత్రపటాన్ని ఏం చేయబోతున్నారు? కాలుస్తారా లేక పూడుస్తారా చూద్దాం తాగబోతూ రుచి అడగడం దేనికి అనుకుంది. తినబోతూ అనడానికి బదులు తాగబోతూ అన్ని అన్నానెందుకో అని నాలుక కర్చుకుంది.
ఓ మనిషి నెత్తిమీద బిందె, చేతిలో గ్లాసుతో వచ్చాడు. ఆ బిందెలో ఏమున్నదని కుతూహలపడిరది డాగీ. బిందె కిందకు దించారు. దాన్నిండా తెల్లని నీళ్లు. నీళ్లు కావు అవి పాలు. అయితే నీళ్లు కల్సిన పాలవవచ్చు కానవి పాలే. తెల్లని పాలే కాని నల్లని నీళ్లు మాత్రం కావు. ఆ చిత్రపటంలో ఉన్న మనిషి ఎవరో అర్థం కాలేదు డాగీకి. రోజూ న్యూస్‌ పేపర్లు నమిలే డాంకీ ఉంటే టక్కున చెప్పేసి ఉండును. సివిల్స్‌ రాసే వాళ్లకున్నంత తెలివి ఉంది కాని గాడిదైపోయింది కనుక కలెక్టర్‌వలేకపోయింది అనుకున్న డాగీకి జనం జిందాబాద్‌ కేకలు పెద్ద పెట్టున వినిపించి జడుసుకుంది. తోకతో వీపు మీద కొట్టుకుంది.
జనంలోంచి ఒకడు ముందుకువచ్చి గ్లాసు నిండా పాలు తీసుకుని చిత్రపటం తలమీది నుంచి కిందకి కారేట్టు పోశాడు. జిందాబాద్‌లు కంటిన్యూ అవుతుంటే ఒకరి తర్వాత ఒకరువచ్చి గ్లాసు బిందెలో ముంచి పాలతో చిత్రపటాన్ని తడిపేయసాగారు. ఇదేమిటి ‘చిత్రం’ తడిసి ముద్దయిపోతున్నది. అయినా చిత్రపటం నెత్తిన పాలు పోయడమెందుకు ఆకలితో ఉన్న మనుషుల నోటికో, నాలాంటి వీధికుక్క నాలుకకో అందిస్తే పుణ్యం దక్కేది కదా అనుకుంది డాగీ నాలుక బయటకి వేలాడేసి.
జనం జిందాబాద్‌లు క్రమంగా తగ్గేయి. కాస్సేపటికి అక్కడ ఎవరూలేరు. ఇక మనమూ తిండికి వెదుక్కుంటూ పోవాలి అనుకున్న డాంకీ కాళ్లకి ఏదో తడి తగిలింది. ఏమిటా అని తలదించి చూస్తే చిత్రపటం నెత్తిన పోసినపాలు కాళ్లకు తగులుతూ పక్కనే ఉన్న చిన్న గొయ్యిలో పడుతున్నది. అదృష్టం కాలు తడపడం అంటే ఇదన్న మాట అనుకుంటూ పాలు నిండిన గుంతలో మూతిపెట్టింది డాగీ. నాలుకతో ఓ రౌండు ‘కతికి’ తలెత్తి చూసింది. వేరే కుక్కలు ఏవైనా ‘షేర్‌’ చేసుకుందుకు వస్తున్నయేమోనని. కానీ చుట్టుపక్కల మనుషులకే కాదు కుక్కలు కూడా లేవు. పాలు మరీ రుచిగా లేవు నీళ్లు బాగానే కలిపినట్టున్నారు. అయితేనేం కడుపునిండా తాగడానికి దొరికినవి కదా అని తన నాలుకకు పని చెప్పింది డాగీ.
అరుగు మీదికి వచ్చిన డాగీ ముక్కూ మూతీ తెల్లగా కనపడ్డంతో అడగనే అడిగింది డాంకీ. ‘క్యా బాత్‌ హై’ అని. ఏముందీ పాల గుంతలో నోరు ముంచా అంటూ చిత్రపటానికి జనం పాలుపోసిన విషయాన్ని వివరించి, అడిగింది డాంకీ ‘బ్రో’ వాళ్లంతా ఆ చిత్రపటం నెత్తిన పాలు ఎందుకు పోశారు అని. అది నెత్తిన పాలుపోయడం కాదు. అభిషేకం. పాలాభిషేకం. హామీలు కొద్దోగొప్పో నిజం చేసిన వారికి, రూపాయికి పది పైసలైనా విదిలించిన వారికి అభిమానంతో జనం పాలతో అభిషేకం చెయ్యడం ఇప్పుడు ‘ట్రెండీ’ అయిన సంగతి. జనం తమంతట తాము చచ్చేంత అభిమానంతో అభిషేకం చేస్తారా లేక తామే చేయించుకునేవారుంటారా అంది డాగీ. చేసినా, చేయించుకున్నా అభిషేకం అభిషేకమే, పైత్యం పైత్యమే అంటూ అరుగు ఎక్కాడు అబ్బాయి. పైత్యమో, వేయి తలల వెర్రో ఎవరికి తెలుసు. ప్రజల్ని పాలించడం ఓ డ్యూటీ. ఆ డ్యూటీ చేసిన వాడు దేవుడు కాదు గదా అంది డాంకీ.
గుళ్లో దేవుడికి పెరుగుతో, నెయ్యితో కూడా అభిషేకం చేస్తారు. ఈ నాయక దేవుళ్ల అభిషేకానికి పాలు మాత్రమే వాడుతున్నందుకు సంతోషించాలి అన్నాడు అబ్బాయి. ఇంతమంది నాయకులున్నారు. రోజూ ఒకరికిలా ‘పాలాభిషేకం’ చేస్తే నాలాంటి కుక్కలకే కాదు గోడ మీది పిల్లులకు కూడా కడుపు నిండును కదా అంది డాగీ.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img